పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
అర్జునుతోఁ ద్రిగర్తదేశాధిపతులు యుద్ధము చేయుట (సం. 14-73-1)
సీ. ఉద్ధతులై త్రిగర్తోర్వరాపతి పుత్త్ర | పౌత్త్రు లయ్యశ్వంబుఁ బట్టువారు
గాఁ బూని తేరులు గడురయంబునఁ దోలి | కొని యడ్డముగ వచ్చు కోలుతలకు
నలుగక, నరుఁ డన్నయానతిఁ దలఁచి యా | రాజ కుమార వర్గంబుతోడ
‘ధర్మజు నశ్వమేధంబున కపకార | మాచరించుట పాప; మదియుఁ గాక
 
తే. యేము మీరును బాంధవ మెసక మెసఁగ | నడచు టొప్పదె; పగ యే?’ లనంగ వారు
సూర్యవర్మ నామకుఁ డగు శూరతమ కు | మారుఁ డగ్రణి గాఁగ నుదారలీల.
005
చ. కవిసిన వారితో మఱియుఁ గవ్వడి యిట్టు లనున్‌ ‘దయాధురా
ప్రవణుఁ డజాతశత్రుఁడు తురంగమ రక్షకు నంపునప్డు భూ
పవితతియెల్లనుం దెగియె భారతయుద్ధమునందు; బాలురం
దివిరి వధింపఁ గాదు; కృపఁ దిన్నఁదనం బెసఁగం జరింపుమీ!
006
చ. అవినయవృత్తి నశ్వమున కడ్డము వచ్చిర యేని నీవు బాం
ధవము దలిర్పఁ బల్కి, యని దప్పఁగ ద్రోవుము; కిన్క మాను; మ
న్నవచనవృత్తి నాదగుమనంబున నెక్కొని యున్కిఁ జేసి యా
హవమున కొల్ల నయ్యెదఁ బ్రియంబులు గా వొకొ! మీకుఁ బ్రాణముల్‌?
007
చ. వలవదు పొం’ డనంగ నిలువంబడ కేపున సూర్యవర్మ య
బ్బలియుని మీఁదఁ గ్రూరశరపంక్తి నిగిడ్చినఁ, ద్రుంచెఁ జిప్పయ
మ్ముల నది, యెఱ్ఱనవ్వు తనమోమనుతమ్మికి లేఁతయెండయై
చెలువము చెన్ను వింతలుగఁ జేయఁగ నా విజయుండు భూవరా!
008
వ. అట్టియెడ. 009
తే. సూర్యవర్ముని తమ్ముండు శూరవరుఁడు | కేతువర్మ గాండీవిపై శాతబాణ
వృష్టిఁ గురియుచు నుద్ధురవేగ మొప్ప | నన్నఁ గడచి బె ట్టడరిన నన్నరుండు.
010
చ. అతని నొదుంగ నేయుటయు, నాతని తమ్ముఁడు చండ విక్రమో
ద్ధతి ధృతవర్మ నాముఁ డతిదారుణ సాయకపంక్తి సత్వరా
తతగతిఁ బర్వఁ జేయుచుఁ బృథాసుతుఁ దాఁకిన మెచ్చు వచ్చి య
య్యతిరథవర్యుఁ డప్పుడు తదంగము లేయఁగ నొల్లకుండుటన్‌.
011
చ. శరములు ద్రుంప, నాతఁడు వెసన్‌ బలునారసముల్‌ నిగిడ్చె న
న్నరుపయి; నా బలిష్ఠుఁడు మనంబునఁ గొండొక యల్క పుట్టి య
న్నరవరసూతి పేరురమునం బదితూపులు గ్రుచ్చె; దానికిం
దెరలక యక్కుమారుఁడును దీవ్రశరంబులఁ జేయి నొంచినన్‌.
012
ఆ. ముష్టి సడలి చోద్యముగను గాండివ మిలఁ | బడిన నా త్రిగర్తబలము దెసలు
చెలఁగ నార్చె; నందుఁ జేయంగఁగల యోధు | లక్కుమారవర్యు నవులఁ ద్రోచి.
013
తే. ‘ఇంద్రధనువు చందంబున నెసక మెసఁగు | గాండివము పాటు గంటిరే; చండవిక్ర
మాభిరాముండు గాండీవి యన్న పలుకు | లకు మహోగ్రత సూప నొల్లండు గాక.
014
ఉ. నిక్కపుఁ గిన్క వచ్చిన ననిన్‌ నొసలం గనుచూపు, వింటి పా
టక్కట! రిత్తవోవునె? నృపాత్మజులం దెగటార్చు నీతఁ డిం
దొక్కఁడుఁ ద్రిక్కకుండ; మన మొప్పమి చూడఁగనేల? మున్న పే
రుక్కునఁ దాఁకు టొప్పు’ నని యొక్కట నర్జును నాక్రమించినన్‌.
015
క. అటమున్న గాండివం బు | త్కటరయమున నెత్తి కోపదహనుం డత్యు
ద్భటమూర్తిఁ దాల్చెనన మి | క్కుటమై కడగంటి కెంపు గొమరారంగన్‌.
016
వ. ఆ బీభత్సుండు 017
క. పిడుగులు వడిఁ బె క్కొక్కటఁ | బడియెడు ననఁ దొరఁగఁ జేసెఁ బటు విశిఖము ల
ప్పుడు మేదిని దోఁపద చె | ప్పెడు కొలఁదియె రథికవరుల పీనుఁగు పెంటల్‌.
018
శా. ఆ యుగ్రోద్ధతి చూచి పెల్కుఱి త్రిగర్తానీకముల్‌ నల్గడం
బాయం బాఱెఁ; దదాప్తు ‘ లేము దగ నీపం పోపి సద్భక్తిమైఁ
జేయంగాఁ బనిగొమ్ము; పేర్మిగ మముం జేకొమ్ము సమ్యగ్దయా
శ్రీయుక్తా!’ యనినన్‌ ధనంజయుఁడు గాచెన్‌ వారినెల్లం గృపన్‌.
019
వ. అట్లు వెనుకొనక నిలిచి, యెలుంగెత్తి, వారలతో ‘మీ రిట్లు ప్రాణంబులు గాచికొనుండు; నా పంచిన పనిసేయం బుద్ధి గలిగి సుఖులరై యుండుం’ డని పలికి యయ్యశ్వంబు ననుసరించె; నది క్రమగతిం బ్రాగ్జ్యోతిష పురపరిసరంబునకుం బోయిన, దాని తెఱం గాకర్ణించి. 020
సీ. భగదత్తతనయుండు బాహుగర్వంబున | బాల్యసిద్ధం బగు లౌల్యమునను
బురి నిర్గమించి యత్తురగంబు వెలిపించి | కొని పోవఁ గాంచి యర్జునుఁడు గాండి
వము సజ్యముగఁ జేసి వాలమ్ము లొక్కట | నక్కుమారునిమీఁదఁ బెక్కు గురియ
నవ్వజ్రదత్తుండు నొవ్వు దన్కిన దాని | నచ్చట దిగఁ ద్రావి చొచ్చెఁ బురము
 
తే. సత్వరంబుగ నటు సొచ్చి సామజంబుఁ | బన్నఁగాఁ బంచి వెస నెక్కి బలముఁ జలము
వీఁకయును నొప్ప నన్నరుఁ దాఁకి శాత | ఘన శరంబులు పరఁగించెఁ గౌరవేంద్ర!
021
క. నడుమన వానిం బార్థుఁడు | పొడిగా నేయంగఁ గనలి భూపకుమారుం
డడరించెఁ దోమరంబులు | గడుఁ బె క్కవి మిడుత కదుపు గతిఁ గవియంగన్‌.
022
ఆ. అనల శిఖలు వోని యమ్ములగమి వాని | రూపుమాపి యన్నరుండు వాఁడి
లేని దొడ్డ తూఁపు లేనింటిఁ దొడి రాచ | కొడుకు నేసెఁ దూలి పుడమిఁ గూల.
023
క. కూలియు నీడంబోవక | బాలుఁడు రయమార దంతిపైకిం జని దో
ర్లీల మెఱయ నరుఁ బటు శర | జాలంబులఁ బొదివె గగనచరు లగ్గింపన్‌.
024
చ. అతఁడును దీవ్రబాణముల నా భగదత్త తనూజు దంతి నా
వృతముగఁ జేసె; నట్లు పృథివీవర నందన! యేమి చెప్పుదున్‌;
శతమఖ పుత్త్రుతోడ దివసత్రయ ముగ్రరణం బొనర్చె; న
ద్భుత మెసఁగం జతుర్థదినముం దెగునంతకుఁ బోరె ధీరతన్‌.
025
వ. తెగియెడు సమయంబున. 026
ఆ. అక్కుమారుఁ డేచి ‘యర్జున! యర్జున! యేను గలుగ నీకు నెందుఁ బోవ
వచ్చు? వృద్ధుఁడైనవాఁడు గావునఁ దండ్రి | సమసె; నట్లు నన్ను సమతె బేల!’
027
వ. అని యదల్చి. 028
క. పెను సెలయేఱులు వాఱఁగఁ | దనరు గిరియుఁ బోలె బహుమదంబులు దొరఁగం
గనుపట్టు కుంజరము సిం | హనిభుం డగు పార్థుమీఁద నడరం జేసెన్‌.
029
క. అది ఫూత్కారము చేసిన | నొదవిన కర శీకరముల నుర్వీవర! యం
బుదముక్త సలిల ధారలు | పొదివిన గిరివోలె నింద్రపుత్త్రుం డొప్పెన్‌.
030
చ. కరి యిటు లేపునం గవియఁగా భగదత్తసుతుండు దీప్త ని
ష్ఠుర శరపంక్తి నాహవపటుత్వము సూపిన నల్పకోప సుం
దరుఁ డగుచున్‌ నరుండు శతధారనిభం బగు నారసంబు భీ
కరగతి నేయఁ గూలె నది కౌరవనాయక! పర్వతాకృతిన్‌.
031
క. కూలిన నేలకు వచ్చిన | బాలుం గని నాకలోకపతిసుతుఁడు దయా
లోలుండై మార్దవ హృ | ద్యాలాపము లొప్ప నిట్టు లను నాతనితోన్‌.
032
వ. ‘ధర్మతనయుం డశ్వమేధ దీక్షితుండయి యిత్తురంగంబుపజ్జ నన్నుం బుత్తెంచునప్పుడు. 033
క. ‘చంపకుమీ! రాజుల; నను | కంపాతిశయంబు మెఱయఁగా నడపుము; నీ
పెం పను కుసుమమునకు నా | పం పొనరించుటయ సౌరభముగ నెఱుఁగుమీ!’
034
క. అనియెం గావున నీపైఁ | గినుక వొడమ; దలుక విడువు; గీతయశుం డా
జనపతి యాగంబునకుం | జనుదేరఁగ వలయు బంధుజనముల్‌ నీవున్‌.
035
ఆ. అధిపతనయ! నిన్ను నామంత్రితునిఁ జేసి | పోవుచున్నవాఁడ; నీవు హస్తి
పురికి భావి చైత్రమునఁ బున్నమకు ముద | మొదవ నరుగుదెంచు టొప్పుఁజేయు.’
036
క. అనిన నతఁ డట్ల కా కని | వినతుం డగుటయును, బ్రీతి విజయుం డభినం
దన మాచరించి యశ్వము | వెనుకఁ జనియెఁ బూరుకులపవిత్రచరిత్రా!
037
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )