పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
అర్జునుఁడు సింధుదేశాధీశులతోడ యుద్ధంబు చేయుట (సం. 14-76-1)
వ. అది సింధుదేశవర్తి యగుటయు, భారత రణ హతులైన సైంధవ యోధుల పుత్త్రపౌత్త్రులు, పూర్వవైరంబు వాటించి యాటోపంబున ననేక సహస్ర సంఖ్యల రథికులు రాజనందనులు గూడుకొని క్రీడిపై నడచి; రట్టియెడ. 038
సీ. అరుణాంబుదంబులు పరఁగి పెన్నెత్తురుఁ | గండలుఁ గురిసె; మార్తాండ బింబ
మసితారుణచ్ఛాయ మయ్యె; నుల్కాతతు | లెల్ల దిక్కులఁ బెల్లు డుల్లె; నశ్వ
సహితంబుగా సవ్యసాచిఁ జుట్టును ముట్టి | యతనిపై నయ్యోధవితతి యొక్క
పెట్ట శస్త్రాస్త్రముల్‌ బెట్టుగాఁ గురిసిన | నప్పాండవుఁడు పెనుడప్పి సోలె;
 
తే. నేమి చెప్పుదు నీకు; నుద్దామ విక్ర | మాభిరాముండు నాఁ జను నక్కిరీటి
కరము గరము బెం డగుటయు గాండివంబు | వడియెఁ బుడమిపైఁ గురునరపతివరేణ్య!
039
చ. అనిమిషులున్‌ మునీశ్వరులు నప్పుడు శోకమునన్‌ మునింగి య
ర్జునజయ కాంక్షులై నియతి శుద్ధి వహించి సవీర్య మంత్రసా
ధనపరులైరి; తెప్ఫిఱి యతండు ధనుర్ధరుఁడున్‌ సముల్లస
త్తను విభవోజ్జ్వలుండు సముదగ్రమనస్కుఁడు నయ్యె భూవరా!
040
వ. ఇట్లు తెలివొంది విజృంభించి. 041
శా. నారాచ ప్రముఖాస్త్రజాల పటువిన్యాసంబు తీవ్ర త్వరా
ఘోరంబై విలసిల్లఁ జేయ సమరక్షోణీతలం బంతయున్‌
వైరివ్రాత శవావృతం బగుడు గీర్వాణుల్‌ మునుల్‌ సిద్ధు ల
వ్వీరుం బ్రస్తుతి సేయుచుం బొదలి రుద్వేలప్రమోదంబునన్‌.
042
వ. హతశేషంబైన యా సింధు రాజకుమార సైన్యంబుదైన్యంబునొంది నలుదిక్కుల విచ్చియు నొచ్చియు వివ్వచ్చుండు రణధరణిం బొలిచి నిలుచుటఁ జూచి మాత్సర్యధుర్యంబై మగుడం బోరికిం బూని యడరిన నప్పురందర నందనుం డందలి రథికముఖ్యులతోడం దమయన్న చెప్పిన వాక్యంబు లుపన్యసించి ‘మీరేలజాలిం బడియెదరు, ప్రాణంబులు మీ కింత చేఁ దయ్యెనే’ యని పలికినను నిలువక పైపయి వా రురవణించిన. 043
క. నవ్వుచు నానా శరముల | నవ్వీరులఁ బొలియఁ జేయ, నంతయు విని తా
నెవ్వగతో దుశ్శల యా | కవ్వడిఁ బౌత్త్రాన్వితముగఁ గానఁగ వచ్చెన్‌.
044
సీ. వచ్చి కన్నీళులు వదనంబుపై వెల్లి | గొన రోదనంబు చేసిన నతండు
దయ నిల నిడియెఁ గోదండ మప్పడఁతుక | పౌత్త్రునిఁ జూపి ‘యిబ్బాలుఁ గావు
మితఁడు మీ యల్లుని సుతుఁ; డన్న నప్పార్థుఁ | డిప్పుడు నా యల్లుఁ డెచట నున్న
వాఁ?’ డని యడిగిన వనిత వెక్కుచు ‘నతం | డాత్మీయ జనకుఁ డుగ్రాహవమున
 
తే. ననఘ! నీచేతఁ దెగుట దా విని నితాంత | శోకమగ్నుఁడై యుండి నీ రాక బిట్టు
వినుట బెగ్గిలి ప్రాణముల్‌ విడిచె ‘ననుచు | నెలుఁగు గడలుకొనంగఁ బెల్లేడ్చె నధిప!
045
వ. అప్పుడు శోకాక్రాంతుం డయి గాండీవి వదనంబు వాంచియుండ నయ్యుగ్మలి యతని నుద్దేశించి. 046
సీ. ‘ధార్తరాష్ట్రుల కీడు దలఁపక సైంధవు | కొఱగాము లెల్లను మఱచి తండ్రి
లేని యీ శిశువుపై మానితంబైన నీ | యక్కటికంపుఁ జూ పడరఁ జేయు
మాశ్రితవత్సల!’ యనుచు నబ్బాలునిఁ | జరణానతునిఁ జేసి ‘శరణు! శరణు!
కృప నన్ను రక్షింపు కీర్తియుఁ ధర్మంబుఁ | జేకొను’ మనవుడుఁ జిత్త మడల
 
తే. ‘రాచకొల మిది గాల్పనే క్రౌర్యమూల’ | మని తలంచుచు నాతఁ డయ్యతివతోడ
‘నధమవృత్తి సుయోధనుఁ డంతకంటె | నేముఁ గొఱగాము. మాచేత నింతపుట్టె.’
047
క. అను పలుకు పలికి, బహుసాం | త్వనముల నూరార్చి, యాసుదతి మస్తకముం
దన యక్కునఁ జేర్చి ‘యబల! చనుము వగపు దక్కి’ యని ప్రసాద భరితుఁడై.
048
వ. వీడ్కొలిపిన దుశ్శల దనమనుమనిం దమబలంబులంగొని ప్రియంబునం జనియె; నయ్యనిమిషపతి సుతుండును గ్రతువిషయంబులై వలయుననుష్ఠానంబులు విధివంతంబులుగాఁ జలుపుచుఁ దురంగంబు వెనుకం దా నామృగానుసారియయిన పినాకపాణియుం బోలెఁ బోవుచుండ, నదియును నఖిల దేశంబుల సుఖసంచారంబునఁ బ్రవర్తిల్లుచుఁ, గ్రమంబున మణిపూర పురంబు నుపాంతంబున కరిగిన, నన్నగరంబు పతి యైన బభ్రువాహనుండు నిజజనకుం డయిన యర్జును రాక యాకర్ణించి. 049
ఆ. వినయ మెసఁగ నార్యజనసమేతంబుగా | నరుగుదెంచి, యతని చరణములకుఁ
బ్రీతి నెఱఁగ, నక్కిరీటి యన్నరపతి | నాదరింప కుండె మేదినీశ!
050
వ. అట్లుండి తన యనాదరణంబునకుం గారణం బెఱుంగక సవిచారుండై యూరకున్న యక్కుమారునితో ధనంజయుం డిట్లనియె. 051
ఉ. ‘యాగ విముక్తమై చనుహయంబున కడ్డము వచ్చి పట్టి కా
కీగతి మెత్తఁబాటు దగునే? నృపధర్మవిహీనతన్‌ రణో
ద్యోగము లేక తక్కి భయ ముల్లముఁ జేరఁగ నిచ్చు రాజు రా
జే? గుణహీన! పొ’ మ్మనిన నేమియుఁ బల్క కతండు గ్రమ్మఱన్‌.
052
సీ. అరిగి పట్టణవీథి నల్లన చనుచుండ | నర్జునుం డతనితో నాడినట్టి
తెఱఁగెల్లఁ దన దగు దివ్యబోధంబునఁ | గని భుజంగోత్తమతనయ సదయ
వృత్తిఁ బాతాళంబు వెలువడి యన్నరా | ధిపుని పాలికిఁ జనుదెంచి ‘ యేను
మీ తల్లి నాగేంద్రు సూతి నులూపి నా | పేరు; హితంబు చెప్పెడు మనీష
 
తే. నరుగుదెంచితి వినుము! మీయయ్య పనుపు | దలకొనుము; రాజులకు నర్హధర్మమైన
యని యొనర్పుము; దనతోడఁ బెనఁగు టధిక | సమ్మదము సేయు నక్కురుసత్తమునకు.
053
క. అనిన సభక్తికముగ న | వ్వనితకుఁ బ్రణమిల్లి ‘యాహవము జనకునితోఁ
జనునె యొనర్పఁగ’ నని య | ప్పనికిఁ జొరక వచ్చితిని శుభప్రదమూర్తీ!
054
క. నీ వింత దెలిపి పలికెద; వావిభుఁడును మున్ను నన్ను ననుమతుఁ జేసెం;
గావునఁ దల్లీ! మీకుం | గావించెద నిద్దఱకు నఖండ ప్రియమున్‌.’
055
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )