పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
అర్జునుఁడు గాంధారదేశాధీశుతో యుద్ధంబు చేసి జయించుట (సం. 14-85-9)
ఉ. కావున నేఁ గడంగ విను; కయ్యము నీ కిది యేల తమ్ముఁడా!
నా వినియున్‌ వడిన్‌ శకునినందనుఁ డయ్యమరేంద్ర నందనుం
దా విశిఖంబులం బొదివె; దానికి నవ్వుచు వాని శీర్షకం
బావిజయుండు బల్వెడఁదయమ్మున నేలఁ బడంగ నేసినన్‌.
118
వ. అచ్చిత్రము చూచి యచ్చోటం గలయట్టి. 119
క. ఎల్లజనులు నివ్వీరుం | డొల్లఁడుగా కుత్తమాంగ ముర్వి నిటుల వే
డొల్లఁగ నేయఁడె వలసినఁ; | జెల్లంబో! యితని కరుణ చెలు విట్లున్నే!’
120
వ. అనుచు నక్కుమారుం జేరి, యతనితేరు మరల్చికొని పోవం బోవ. 121
తే. దురభిమానము పేర్మి నన్నరవరుండు | మరలి నరుమీఁద నడవ, మున్‌ తెరలి చనిన
బలము గ్రమ్మఱి, యయ్యింద్రుపట్టిఁ జుట్టు | బలసి శస్త్రాస్త్రచయములు పరఁగఁజేయ.
122
చ. అవి నిశితాస్త్రపంక్తిఁ దునుమాడి రయం బెసఁగంగఁ గప్పె నా
హవతల మంతయుం దలర నప్పటువిక్రమశాలి; యమ్మహో
గ్ర విహరణంబునం గలఁగి కన్కనిఁ బాఱె బలంబు; లక్కుమా
రవరునిఁ గాచికొంటకు ధరావరుమంత్రులు వాని తల్లియున్‌.
123
వ. అర్ఘ ంంబుగొని రయంబున శరణు శర ణనుచు వచ్చిన నవ్వివ్వచ్చుండును నవ్వెలంది నభినందించి మంత్రులకు మాననీయ వచనంబులం బ్రియం బొనర్చి యబ్బాలునితో సాంత్వనస్వరంబున నిట్లనియె. 124
ఉ. ‘నీ విట వన్ని నాపయి ననింద్యపరాక్రమ! రాక చూచి మ
ద్భావము ఖేద మొందుటయు ‘ధర్మజుపం పిది రాజకోటి నే
నే విధినైనఁ జంప’ నని యెల్లజనంబు వినంగఁ జెప్పనే!
కావున నీ బలంబులన కాని నినుం దెగటార్ప కుండితిన్‌.
125
వ. విశేషించి గాంధారీ ధృతరాష్ట్రులం దలంచి నాకు నీ దెస నిట్లు గావలసి యుండె. 126
ఆ. అట్టులగుటఁజేసి యవనీశనందన! యింత ప్రొద్దుఁ బోరి; తింక శాంతిఁ
బొందు టొప్పు; ధర్మపుత్రునితోడ పొం | దొప్పదయ్య! నీకు నుదితశౌర్య!’
127
వ. అని చెప్పి యాగామి యయిన చైత్రంబున పున్నమ నాఁ డన్నరేంద్రచంద్రు నశ్వమేధ యాగంబున కనురాగం బెసఁగ రమ్మీ! యనియునుం బలికి, యప్పాండవ మధ్యముండు మేధ్యాశ్వంబు ననుసరింప నది కరిపురంబు దిక్కుమొగంబయి యరుగం జొచ్చె; నట్టియెడ నతండు వివిధ దేశంబులం దిరిగిన తెఱం గెల్లనుం జారులచేత విని యజాతశత్త్రుం డప్పురుహూతపుత్త్రుం డశ్వరక్షణం బట్లు ధర్మప్రకారంబున నిర్వహించుటకుం బ్రీతి వహించె; నద్దివసంబు. 128
ఆ. మాఘమాస పౌర్ణమాసి యై యుండె; నా | ధర్మనందనుండు పేర్మి వెలయ
నెలమి మిగులఁ బెద్దకొలువున నుండి త | మ్ముల సగౌరవముగఁ బిలువఁ బనిచి.
129
వ. అనిల నందను నాననం బాలోకించి. 130
క. ‘నీ తమ్ముఁడు తురగముఁ గొని | యేతెంచుట వింటిఁ; జై త్ర మింకఁ దడవు లే
దీతఱి మునులను నృపసం | ఘాతంబును బిలువఁ బంపఁగా వలయుఁ దగన్‌.
131
వ. యాగశాలయు శిల్పి జనులం గొని కల్పింపుము; తగువారలకు విడియం దగియెడు వివిధ గృహంబుల నొనరింపు’మని పనిచిన నతండు. 132
ఆ. యజ్ఞవాటమును జనాధిపులకు ముని | వ్రాతములకు విడియ వలయునట్టి
మందిరములుఁ గనక మణిమయంబులుగా నొ | నర్చెఁ దద్‌జ్ఞ మగు జనంబు వొగడ.
133
క. ధరణీసురులను బనిచెను | ధర నెందును దిరిగి మునుల ధాత్రీశుల న
ధ్వరమునకుఁ బిలువుఁ డని య | మ్మరుత్సుతుఁడు; వారుఁ జని సమంచిత భక్తిన్‌.
134
చ. పిలిచిన రాజులున్‌ మునులుఁ బ్రీతి యెలర్ప బలోత్కరంబు శి
ష్యులుఁ దమతోడ రా మనము లువ్విళు లూరఁగ యజ్ఞవర్తనం
బులుఁ గనుఁగొంటకై సకల భూవలయంబునఁ గల్గునట్టి వా
రలు సనుదెంచినం గురుధరాపతి చిత్తము వేడ్క నూనఁగన్‌.
135
క. ఎదురుకొని వీడుఁ బట్లకు | ముద మారఁగఁ దాన యనిచి మొక్కలములు నిం
పొద వించునట్టివియుఁ గాఁ | బదార్థములు ప్రజదలమునుఁ బాటించి తగన్‌.
136
క. భోజన శయనాసనములు | రాజిల్లెడు నట్లుగాఁగ రాజుల కెల్లం
దేజోధనుఁ డా ధర్మత | నూజుం డిడఁ బనుచు జనవినుతసుచరిత్రా!
137
చ. మునులకు నెల్లఁ గందములు మూలములున్‌ ఫలకోట్లునుం బ్రియం
బొనరఁగఁ దాన పోయి మధురోక్తులతోడ సమర్పణంబు సే
యు; నిటుల సంవిధానము లనూనములై విలసిల్లఁజేయు; న
య్యనిమిషనాథవైభవుఁ డహంకృతి వర్జన సంస్తుతంబుగన్‌.
138
తే. యజ్ఞవాటంబుఁ దక్కటి యాలయములు, | లలితభంగి రమ్యములు, సలక్షణములు
గా నొనర్చిన శిల్పి నికాయమునకుఁ | బసదనం బిచ్చె సంతసం బెసక మెసఁగ.
139
సీ. పాండవాగ్రజుఁ డట్లు పవననందనుఁ బంచి | యజ్ఞశాలా కరణాదు లైన
కృత్యముల్‌ నడపుటఁ గృష్ణుండు గనుఁగొని | కడుఁ బ్రీతిఁ బొందె; నాగత నృపాలు
రచ్చెరువొంది; రయ్యమృతాంశు వంశ ని | స్తారకుం డర్థిమైఁ దేరఁ బనుప
ననవద్య పశువుల నఖిలజాతులవానిఁ | గొనివచ్చి రత్యంత కుశల పరిజ
 
ఆ. నంబు; లన్న పర్వతంబులు నాజ్య వా | హినులుఁ గల్గి విప్రజనపరంప
రలు భుజించు పేర్మి యొలసి యాగారంభ | సమయ మద్భుత ప్రజనక మయ్యె.
140
క. విను లక్ష భూసురులు గుడి | చిన నొకమరి మ్రోయుభేరి సెలఁగుచునుండున్‌
జననాయక! యెప్పుడు; నే | మని చెప్పుదు నశ్వమేధయజ్ఞవిభూతిన్‌.
141
చ. శరధిపరీత భూమిఁ గలసర్వజనంబును దోఁచె; నమ్మహా
ధ్వరమున భూపతుల్‌ మకుట పంక్తులు భూషణరాజిఁ జక్కఁగాఁ
బొరిఁబొరిఁ ద్రోచి కొంచు మదిఁ బొంపిరి వోయెడు వేడుకం బనుల్‌
వెరవులు లావులున్‌ మెఱయ వేయు విధంబులఁ జేయు టొప్పఁగన్‌.
142
సీ. కలయంగ రాజులఁ గనుఁగొని ధర్మనం | దనుఁడు భీమునిఁ బిల్చి మనుజపతుల
కెల్లను వే పూజ లిమ్మన్న నమ్మరు | త్తనయుండు దగఁ దన తమ్ముదోయి
నెలమిఁ గూర్చికొని మహీశుల సబహుమా | నంబునఁ బూజించె; నలిననాభుఁ
డప్పుడ సీరి సాత్యకి ముఖ యాదవ | సహితంబుగాఁగఁ బ్రసన్నవదన
 
తే. కమల మొప్పంగఁ బాండవాగ్రజుని కడకు | వచ్చుడును, బ్రియ మలర నవ్వసుమతీశుఁ
డా బలుండును నతఁడును నాదిగా స | మస్త యాదవులకు నధికార్చ లిచ్చె.
143
వ. నారాయణుండు నరునిం బ్రసంగించి పాడవాగ్రజు మొగంబు గనుంగొని ‘ద్వారవతినుండి యాప్తుండును విచక్షణుండును నగు వాఁ డొక్కరుండు వచ్చె; వివ్వచ్చుం డప్పురంబు పరిసరంబునఁ బోవం జూచితి ననియె; వివిధ సంగరంబులం దదంగంబు కృశంబై యున్నయది యనియుం జెప్పి; నప్పార్థుండు చేరువకు నరుగు దెంచెం; గాలోచిత క్రియా కలాపంబునకుం దొడంగు’; మనవుడు నప్పుడమిఱేఁ డప్పురుషోత్తముని తోడ 144
క. ‘నీ పంపునఁ బోవుట ను | ద్దీపిత బల శౌర్య ధైర్య తేజోయుతుఁడై
యా పార్థుఁడు యోగక్షే | మోపేతుం డయ్యె; నడపు ముచితంపుఁ బనుల్‌.’
145
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )