| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | సర్వపశు శ్రవణంబు లాచరించి ఋత్విగ్జనంబు లశ్వాలంభ సమయంబున యాజ్ఞసేని సన్నిహితం జేసి యశ్వంబు నవయవంబుల మాంసంబులయ్యై దేవతలకు నాహుతు లిడునప్పు డమ్మహాదేవి నిజహస్తంబునం జేయం దగియెడు హుతంబులు చేయించిరి; తదనంతరం బయ్యశ్వవపాహోమంబునం బరఁగుగంధం బాఘ్రాణించి ధర్మనందనుండు తమ్ములుందానును బరమానందంబునం బొందె; శేషించిన యశ్వావయవంబు లర్హప్రకారంబున యాజకులు వేల్చి; రిట్లు సాత్యవతేయుండు యుధిష్ఠిరు నశ్వమేధం బఖిలలోక హితంబుగా నిర్వహించి యాతని గుఱించి యుదాత్తనాదం బెసంగ నాశీర్వాదంబుసేసె; సమస్తదేవమునులును దీవనలిచ్చి; రప్పుడు కౌరవవంశపావనుం డగు భూవరుండు. | 184 |
| తే. |
అలఘుభక్తి సదస్యుల కెలమి యెసక | మెసఁగఁ గోటివేల్ నిష్కము లిచ్చి తనదు వసుధ యంతయు నొసఁగె దివ్య ప్రబోధ | ఘనత నొప్పు వేదవ్యాస మునివరునకు. |
185 |
| క. |
విను ఋత్విగాఢ్యుఁడగు న | మ్మునిపతి యట్లు కురువంశముఖ్యుఁ డొసఁగ మే దిని సంప్రమోదమునఁ గై | కొని యిట్లను నా నరేంద్రకుంజరుతోడన్. |
186 |
| ఆ. |
‘జగతి ఋత్విగర్థముగ నిచ్చి; తేము వి | ప్రస్వభావకలనఁ బసిఁడిఁ గొనఁగఁ గోరెదము; కరంబు గారవంబున బ్రాహ్మ | ణాభిలషితదాయి వగుట మేలు’ |
187 |
| వ. | అని వెండియు. | 188 |
| క. |
‘ఇలకు వెలగా హిరణ్యం | బలఘుమతీ! మాకు నొసఁగు’ మనుటయు ధరణీ శులు వినఁగా నప్పౌరవ | కులపతి యా వేదరక్షకున కి ట్లనియెన్. |
189 |
| ఆ. |
‘అశ్వమేధమునకు నార్యులు దక్షిణ | ధరణి యండ్రు; గాన నరునిచేత విజిత యైన ధరణి ప్రజనిత ప్రీతిమై | ఋత్విగర్చనముగ నిచ్చినాఁడ.’ |
190 |
| వ. | అని మఱియును. | 191 |
| చ. |
‘వనమున కేఁగి యందు సుఖవాసత నుండఁగలాఁడఁ గాక యే ననఘవిచార! బ్రహ్మధన మక్కట! గొందునె?’ యన్నఁ బ్రీతిమై ననుజులు యాజ్ఞసేనియును ‘నట్టిద యా పని యొండు చెప్పకుం’ డనుటయు హర్షబాష్పపులకాంకురముల్ ధరియించి రందఱున్. |
192 |
| వ. | అప్పుడు. | 193 |
| తే. |
దివ్యవాణి కీర్తించెఁ గౌరవ్యవరుని; | నఖిల జనములుఁ బ్రస్తుతిముఖరు లైరి; తానుఁ బొగడి వేదవ్యాసుఁ డానరేంద్ర | చంద్రునకు నిట్టులను విప్రచయము వినఁగ. |
194 |
| క. |
‘ఏ మమ్మెద మనినఁ బృథివి | యో మనుజాధీశ! కొనుట యొప్పెడు తెరు; విం దేమియును నెగ్గు లే; దీ | భూమిసురుల కోర్కి దీర్చి పుచ్చుము ప్రీతిన్.’ |
195 |
| క. |
అని పలికినఁ గృష్ణుం ‘డి | మ్మునినాయకు పనుపు సేయుము నరేశ్వర! నీ’ వని చెప్పిన నొడఁబడి తన | యనుజులతో నట్లకాక యని యతఁ డర్థిన్. |
196 |
| తే. |
కోటి కోటులు మాడలు కుప్పవోసి | ధరణి వెల యని చెప్పి యప్పరమసంయ మాధిపతికి సమర్పించె; నతఁడు ఋత్వి | గావలికిఁ బంచిపెట్టె నయ్యతులధనము. |
197 |
| వ. | మఱియును. | 198 |
| తే. |
అతుల కనకమయములైన యజ్ఞవాట | వేదికా యూప తోరణ వివిధ భాండ దండ శయ్యాసనాదులఁ ధరణినాథుఁ | డొసఁగె విప్రచయంబుల కుల్ల మలర. |
199 |
| తే. |
అట్లు విప్రుల కిచ్చి యనంతరంబ | రాజులకు, వైశ్యులకు, శూద్రరాజి కన్య జాతులకు మ్లేచ్ఛులకును బ్రభూతధనము | ద్రవ్వి తండంబు లిచ్చె నా ధరణివిభుఁడు. |
200 |
| క. |
ఇమ్మెయి సకలజనులు హే | మమ్మునఁ బరితృప్తులై యమంద మ్మగు మో దమ్మునఁ దేలుచు నిజవా | సమ్ములకుం జని రజాతశత్రుఁ బొగడుచున్. |
201 |
| క. |
రెండవ మరుత్తుఁడై య | ప్పాండవముఖ్యుండు చేయు పరమ వితరణం బొండొకయెడఁ గల్గునె యె | న్నండును జూడ విన సజ్జనస్తుతచరితా! |
202 |
| క. |
తనయంశ మైన కనకము | విను కుంతీదేవి కిచ్చె వేదవ్యాసుం; డనఘా! యది యంతయు న | వ్వినుతచరిత ధర్మకృతుల వినియోగించెన్. |
203 |
| తే. |
సకల బాంధవ భూపతి సంయుతముగ | నా నరేశ్వరుఁ డవభృథస్నాన పూత గాత్రుఁడై చిత్తగత సర్వ కల్మషములఁ | బాసి నిర్జితస్వర్గత్వభాసి యయ్యె. |
204 |
| వ. | అట్లొప్పి యప్పుడమిఱేఁడు పరాశరనందను చరణారవిందంబులు దన వెడంద నొసలు సోఁకఁ జాఁగి మ్రొక్కి యక్కులపతిం బెక్కుభంగులంబ్రస్తుతించి యామంత్రితుం జేసిన నా మునిశ్రేష్ఠుండు శిష్యసంఘ సహితంబుగా నంతర్ధానంబు సేసె; నట్టియెడ. | 205 |