| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
అనుజులు నఖిల నృపాలురుఁ | దనుఁ బరివేష్టింప నొప్పెఁ దారలలోనం బెనుపొందు చంద్రుగతి న | మ్మనుజాధీశ్వరుఁడు కురుకుమారప్రవరా! |
206 |
| తే. |
క్రతువుఁ జూడ నేతెంచిన రాజవరుల | కందఱకు మణిభూషణ హస్తి వాజి వారకాంతాచయముల నవ్వసుమతీశుఁ | డొసఁగె ధనదుని కైవడి నెసక మెసఁగ. |
207 |
| ఆ. |
బభ్రువాహనునకుఁ బరమ విశేషంబు | మెఱయ గారవించి మేలివస్తు కోటు లొసఁగి ప్రీతిఁ గూరిన మనముతో | నతనిఁ దత్పురమున కరుగఁ బనిచె. |
208 |
| క. |
చిత్రాంగదయు నులూపి(చి)యు | వృత్రారి తనూజుపాల విభవమహితలై గోత్రావర! నిలువఁగ న | ద్ధాత్రీశుఁడు చనియె సమ్మదం బెలరారన్. |
209 |
| తే. |
మున్న చనుదెంచి ప్రీతిమై నున్న యట్టి | దుశ్శలకుఁ బెంపుఁ గలుగఁ దత్పుత్త్ర పుత్త్రు సింధుదేశంబునకు నభిషిక్తుఁ జేసె | దోహలమున నజాతశత్రుఁడు నరేంద్ర! |
210 |
| క. |
తమ తమ దేశంబుల భూ | రమణుల నెల్లను విభక్తరాజ్యులు గా నె య్యము నెఱయ నిలిపెఁ బాండు | క్షమారమణు పెద్దకొడుకు గౌరవముఖ్యా! |
211 |
| వ. | ఇత్తెఱంగున నెల్లరాజుల యుల్లంబులు ప్రమదంబునం బొందంజేసి వీడుకొలిపి, కృష్ణునకు నత్యుత్తమ వస్తు విస్తార మహోదారంబగు నుపహారం బిచ్చి దేవోపచారంబుల నారాధించి కృతార్థత్వంబు నొంది య ప్పార్థివోత్తముండు బలభద్రునకు భక్తియుక్తంబును వివిధ రత్నవిరాజితంబును నగు పూజా విశేషంబునం బరమసంతోషం బావహించి, సాత్యకి ప్రభృతి యాదవలోకంబున కతిలోకంబులగు నానావిధ పదార్థంబు లొసంగి, యయ్యం దఱుం దనచేత నుచిత ప్రకారంబుల నామంత్రితులై ద్వారకానగరంబున కరుగం, దాను మఱియు ననేక దేశాగతులైన జనంబుల నన్నపానంబులం గనక వస్త్రాది దానంబుల ననురక్తులం గావించి, మహా రావంబుల దిశలు పిక్కటిల్లం జెలంగు మంగళ తూర్యంబులు మొరయం బుణ్యపాఠకరవం బులు నానంద గానంబులు వినుచు మందిరంబునకుఁ జనుదెంచె నని చెప్పిన వైశంపాయనునకు జనమేజయుం డిట్లనియె. | 212 |
| ఆ. |
‘అనఘ! మత్పితామహుని యశ్వమేధ యా | గంబు సమయమునఁ గరంబు విస్మ యంబుఁ జేయఁ జాలునట్టిది యే మేనిఁ | గలిగెనేని వినఁగ వలతుఁ జెపుమ!’ |
213 |
| వ. | అని యడిగిన యమ్మహీనాయకునకు వైశంపాయనుం డిట్లనియె. | 214 |
| క. |
అమ్మెయిఁ బ్రభూతధనలా | భమ్మున భూమిఁ గలయట్టి బ్రాహ్మణు లెల్లన్ సమ్మద మొందఁగ హయమే | ధ మ్ముజ్జ్వలభంగి నొప్పెఁ దత్సమయమునన్. |
215 |
| తే. |
అఖిల జనములు నచ్చెరువంద ధర్మ | నందనుని మానసమున నానంద మొలయ నతనిపై మకరంద ధారాభిశోభి | కుసుమవర్షంబు పెల్లుగఁ గురిసె నధిప! |
216 |
| వ. | అట్టియెడ. | 217 |