పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
యముఁడు సక్తుప్రస్థునికడ కతిథియై వచ్చుట (సం. 14-93-11)
తే. అతిథి యొక్కధరామరుం డరుగుదెంచెఁ; | గని ప్రియంబున వా రెదుర్కొని సభక్తి
కముగఁ బర్ణశాలాభ్యంతరమున కతనిఁ | దోడికొనిపోయి యాసనస్థునిగఁ జేసి.
222
చ. అడుగులు గడ్గి ప్రీతి యెసలారఁగఁ దద్దయు నెమ్మిఁ బల్కి; ర
ప్పుడు మది పల్లవింప మునిపుంగవుఁ డాతని కాత్మభాగ మె
క్కు డగు వినీతిఁ జూపి ‘బుధకుంజర! నిర్దురితార్జనంబునం
బడసిన యట్టి సక్తువు; కృపారతి నాఁకలి దీనఁ దీర్పవే!’
223
వ. అని సమర్పణంబు చేసిన నమ్మహీసురోత్తముం డాసక్తు వుపయోగించె; దాన నతండు తృప్తిం బొందకునికి యమ్ముని గనుంగొని ‘యేమిట నితండు తృప్తుం డగు? నెట్లు చేయుదు నొకో’ యను విచారంబు వొడమి డోలాయమాన మానసుం డయ్యెం; దదీయభార్య తదింగితం బూహించి యతనితోడ. 224
క. ‘నాపాలి సక్తు విచ్చెద; | నీ పురుషునిఁ దృప్తుఁ జేయు మీ!’ వనిన నతం
డా పొలఁతి డప్పియును సం | దీపిత జఠరాగ్నియైన తెఱఁగును గనుచున్‌.
225
వ. ఇట్లనియె. 226
క. ‘మృగములుఁ బక్షులు లోనుగఁ | దగు నాహారములు దెచ్చి తమ ప్రియలకు నిం
పుగ నిచ్చు; నాకుఁ గొనఁగాఁ | దగునె భవద్భోజ్య మైన ద్రవ్యము సాధ్వీ!
227
క. స్త్రీ సంతోషించు తెఱం | గాస పడని మనసు గలుగునట్టి యధముఁ డి
చ్చో సడిఁ గనుఁ జని యచ్చో | గాసింబడు జముని భటులు గాఱియ వెట్టన్‌’.
228
వ. అనిన విని యవ్వనిత యతని వదనంబునం జూడ్కి నిలిపి. 229
తే. ‘పతియ చుట్టంబుఁ బక్కంబుఁ బతియ చెలియుఁ | బతియ తల్లియుఁ దండ్రియుఁ బతియ గురువుఁ
బతియ దైవంబుఁ గావున నతనిపని యొ | నర్చుటయఁ జూవె ధర్మంబు నాతి కరయ.
230
వ. అట్లుంగాక. 231
క. మానితగుణ! నీ వాఁకలి | తో నుండఁగ నేటిపాలు; దోషం బిది; యి
ట్లే నాహారము గొందునె?; | యీ నిర్మలమతికి దీని ని మ్ముచిత విధిన్‌.’
232
చ. అని తనసక్తు విచ్చినఁ బ్రియమ్మున నమ్ముని యమ్మహాద్విజుం
గనుఁగొని ‘డప్పి వో దిదియుఁ గైకొను’ మన్న నతండు ప్రీతి నె
క్కొన భుజియించి వెండియును గూరఁడ తృప్తిఁ; దదంతరంగముం
గనుఁగొని యత్తపస్విపతి గ్రమ్మఱ నెమ్మదిఁ జింత నొందినన్‌.
233
వ. తదీయ తనయుండు తద్దశావిశేషం బెఱింగి. 234
సీ. తనపాలి సక్తువుఁ దండ్రికిఁ జూపి ‘యీ | యతిథిఁ దృప్తునిఁ జేయు మనఘ! దీనఁ;
దనయుండు దండ్రి చిత్తమున నెక్కొనిన కృ | త్యం బాచరించుట యర్హధర్మ;
మన విని యమ్మహాముని ‘యెంత ప్రాయంబు | చనినను విను జనకునకు సుతుఁడు
బాలుండ; యాఁకలి బాలుర కగ్గల; | మట్లు గావున నిది యనుచితంబు’;
 
తే. నావుడును ‘దాన పుత్త్రుఁ డనంగ విందు; | నన్నుఁ గాచుట యరయంగ నిన్నుఁ గాచి
కొనుట; యిప్పిండి యమ్మహాత్మునకు నిచ్చి | కావవే! నన్నుఁ; గారుణ్యభావితాత్మ!’
235
వ. అనినం గొడుకు మాటలకు నమ్మహితాత్ముండు ప్రీతాత్ముండై యాసక్తు వాయతిథి కిచ్చినం బుచ్చికొని యతం డుపయోగించె; దానను నాఁకలి వోని తెఱంగు దోఁ చిన నయ్యంచిత వ్రతునిడెందంబు గుందు నొందినం గోడలు తదాకార ప్రకారంబు గని తనయంశంబైన పిండి మామముందటికిం దెచ్చి. 236
సీ. ‘ఇదియును నతిథికి నిం’ డన్న ‘నక్కట! యాఁకటఁ దలరి నీ యంగకములు
శిథిలంబు లైనవి; చేడ్పడి యున్నది | చిత్తంబు; దీనిఁ బుచ్చికొని నిన్ను
డప్పితో నుండంగ నెప్పాటఁ జూడఁగ | లాఁడ నే’ ననుడు నాలలన ‘మీరు
మద్గురు గురులరు; మహిత శుశ్రూషకుఁ | గాదె ప్రాణములు నంగములుఁ గలిమి;
 
తే. విహిత మిటు సేఁత నా; కనువృత్తి శీలఁ | గాఁగఁ జేయుండు నన్ను మీ కరుణ యలర’
ననిన సంయమివరుఁ డియ్యకొని యతనికి | నచ్చెలువపాలి సక్తువు నర్థి నిచ్చె.
237
ఉ. ఇచ్చినఁ బ్రీతిఁ బుచ్చికొని యింపెసలార భుజించి తృప్తిమై
నచ్చుపడంగ మెచ్చున ముఖాంబురుహం బలరంగ నిట్లనుం
బొచ్చెము లేక యయ్యతిథి ‘భూరిగుణోత్తర! నిన్నుఁ జూడఁగా
వచ్చితి; నేను ధర్ముఁడ; భవద్వ్రతశీలతఁ జూచి మెచ్చితిన్‌.
238
క. భక్తియు వినయము శ్రద్ధా | యుక్తియునుం దాల్మితోడి యొప్పును గరుణా
సక్తియు నతిథులయెడ నను | రక్తియు నీయంద సుస్థిరత్వముఁ బొందెన్‌.
239
క. నీ దానంబున విస్మితు | లై దైవత యక్ష సిద్ధు లభివర్ణన మ
త్యాదరమునఁ జేసెద రిదె! | రోదసి సమ్మర్దముగ నరుగుదెంచి తగన్‌’.
240
క. అని చూపి పల్కునవసర | మునఁ బర్జన్యుండు గురిసెఁ బుష్పాసారం;
బనవద్య హృద్యనాదం | బున మ్రోసెను దేవదుందుభులు గగనమునన్‌.
241
వ. అప్పు డయ్యతిథి వెండియు. 242
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )