| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
ఒక్కబిలంబుననుండి వెల్వడి యొక్క | నకులంబు విప్రజనంబు నడుమ నిలిచి ‘సక్తుప్రస్థు నలఘు ధర్మంబు నే | మియుఁ బోల దీ యశ్వమేధ’ మనిన నవ్విప్రు లతివిస్మయంబంది యమ్ముంగిఁ | గనుఁగొని ‘మంత్రవర్తనముఁ దంత్ర గమనికయును వివిధములైన దాన వి | ధులు బహుళ త్యాగములును లోక |
|
| తే. |
సంస్తుతము లయ్యె; భక్తియు శ్రద్ధయును బ్రి | యంబు వినయంబు సురముని హర్ష మావ హిల్లఁ జేసె; నీ వేమిట నిమ్మహాధ్వ | రంబుఁ గీ డంటి; చెప్పుమ! ప్రస్ఫుటముగ!’ |
218 |
| వ. | అనుటయు నన్నకులంబు వారల కిట్లనియె. | 219 |
| సీ. |
‘వినుఁడు ధర్మక్షేత్ర మన రూఢమైన కు | రుక్షేత్రమునయందు రోషకామ విరహితుం డొక మహాద్విజుఁ డుంఛవృత్తిమై | నుండు; భార్యయుఁ దనయుండు నతని పత్నియు సహచరభావంబు నొంది వ | ర్తింతు; రట్టులు తపశ్శ్రీ వెలుంగ నున్నెడఁ బులుపంట లన్నియు నత్యంత | వికలంబుగా ననావృష్టిదోష |
|
| తే. |
మావహిల్లిన నతని కాహార మొనరఁ | జేసికొనుట దుర్ఘటమయి చెల్లుచుండఁ దారు నలువురుఁ జని తృణధాన్య మల్ప | మేఱికొనివత్తు; రాఁకలి దీఱకుండు. |
220 |
| వ. | అట్టియెడ నొక్కనాఁ డయ్యందఱును రేపు దొడంగి పడమటి జామునకు వెదకి తెచ్చిన పూరి కొలుచు ప్రస్థమాత్రంబు సక్తు వయ్యెం; గర్తవ్యానుష్ఠానంబులు నడపి యనంతరంబ యాకుంచెఁడు పేలపిండియుఁ జెఱిమానెండుగా నలువురును సమంబుగాఁ బంచికొని యుపయోగించువారై యున్న సమయంబున. | 221 |