| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
తమ తమ దేశంబులకై | మిముఁ గొని పాండవుల గెలుచు మెయికోలున భూ రమణులుఁ గొందఱు వచ్చిరి | సమగ్ర సఖ్యమునఁ గూడు చందమునఁ దగన్. |
31 |
| తే. |
వారి నన నేల! తొల్లియు వసుధకై య | నేక నృపతులు పోరాడి; రిట్లు నేల వ్రాలి కాదె భగీరథరఘుయయాతి | నహుషముఖ్యులు విశ్రుతోన్నతులు గనిరి. |
32 |
| వ. | భారత వర్షంబున నుదార విభూతి విలాసంబున కాసపడి యీసునం బెనంగ కుండుదురె? దీని విస్తారంబు విను వివరించెద. | 33 |
| ఆ. |
మలయ మనఁగ శుక్తిమంతంబు నా వింధ్య | మనఁగఁ బారియాత్ర మన మహేంద్ర మనఁగ ఋక్షవంత మన సహ్య మన నిందుఁ | గులనగంబు లేడు వొలుచు నధిప! |
34 |
| వ. | వీనియందు వివిధ మణిగణంబులు సమకూర్పవచ్చు ననిన ఖనివిశేషంబులు సెప్పనేల? మఱియు నుపమహీధరంబు లనేకంబులు గలిగి యుండు; వానియందు. | 35 |
| క. |
ఇనుమును రాగియుఁ దగరం | బును వెండియుఁ బసిఁడియుం బ్రభూతములై పే ర్చిన సిరిఁ జేయఁగ నొప్పెడు | ఖను లెడనెడఁ బెక్కు గలవు కౌరవనాథా! |
36 |
| క. |
వెండియు ధనార్జనంబులు | గొండల వలనన ఘటించికొన నగు నేర్పున్ దండితనంబును బాడియు | నొండొంటికి మిగులఁ గలిగి యున్న ట్లయినన్. |
37 |
| వ. | గంగయుఁ దుంగభద్రయు వేత్రవతియు వేదవతియుఁ గృష్ణవేణియుఁ బెన్నయు యమునయుఁ దమసయు శిరావతియుఁ గావేరియు గోదావరియు నర్మదయు బాహుదయును సరయువును శతద్రువును వితస్తయు విపాశయుఁ దామ్రపర్ణియు నను మహానదులు మఱియు ననేక సరిద్విశేషంబులునుం గలిగి వీనివలన నానాముఖంబులు ధనధాన్యాది సంపదాగమంబులు సొంపు మిగిలి యుండు. | 38 |
| క. |
ఎడనెడఁ బఱపై యొప్పెడి | యడవు లనేకములు; వానియం దర్థము సే రెడు వెరవులు పెక్కులు సొ | ప్పడి యుండు నయంబుతోడి బలిమి గలిగినన్. |
39 |
| వ. | పాంచాల బర్బర వత్స మత్స్య మగధ మళయాళ కళింగ కుళింగ కుకురు కోంకణ టేంకణ త్రిగర్త సాముద్ర సాళ్వ శూరసేన సుదేష్ణ సుహ్మ కురు కరూశ కాశ కోసల యవన యుగంధ రాంధ్ర సింధు చేది చోళ పుళింద పుండ్ర పాండ్యాభీర సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర విదేహ విదర్బ ద్రవిళ దశార్ణ కర్ణాట గౌళాంగ వంగ వరాట లాట బాహ్లిక బహుదాన కిరాత కేకయాశ్మంత కాశ్మీర గాంధార కాంభోజ కేరళ మాళవ నేపాళ ఘూర్జర కుంత లావంతి కానూపాది జనపదంబులు సమస్త వస్తు సంపత్సంపాదనంబు లయిన గుణవిశేషంబుల వెలసి పురుషార్థంబులగు ధర్మార్థ కామంబులకుం గారణంబులై కమనీయంబు లగుచుండు. | 40 |
| క. |
వినికి గలిగి రక్షించుచు | ననువున దయతోడిపాడి నాయతు లెల్లం గొనుచుఁ దగ నేలి పొగ డొం | దిన రాజున కుర్వి గామధేనువు గాదే! |
41 |
| ఆ. |
వెరవు లావుఁ గలుగు నరనాథు లింత దే | శంబు గలదు తమకుఁ జాలు ననరు; దండ్రి బిడ్డ యన్న తమ్ముఁడు నా కెత్తి | పోయి పోటులాడి పుడమిఁ గొండ్రు. |
42 |
| క. |
కావునఁ గౌరవ పాండవు | లీ వసుధకునై పెనంగు టెగ్గే? దైవం బే వంక వ్రాలె వారిక | పోవుం గా కిది; నరేంద్ర! పొగులకు మింకన్.’ |
43 |
| వ. | అనిన విని యాంబికేయుండు సంజయుతో ‘నీ వింక సంగరంబుఁ జూడం బొ’మ్మని సముచితంబుగ వీడు కొలిపినం బోయి భారత రణ ప్రకారం బనుసంధించి, యతండు కతిపయ దినంబులకుం జనుదెంచి తగిన తెఱంగునం గాంచి. | 44 |
| క. |
కొడుకుల దెస నెవ్వగఁ జే | డ్పడి వందురి యున్న యా నృపాలు నడుగులం బడి, భీష్ముపాటు సెప్పుచు | నడలి కరుణనాద మెసఁగ నాక్రందించెన్. |
45 |
| వ. | అయ్యేడ్పుతో నిట్లని విలాపంబు సేయు. | 46 |
| సీ. |
ఆత్మయోధుల కెల్ల నాధార మగునట్టి | తనకు నస్త్రంబు లాధార మయ్యెఁ; బరశురామునకు మే ల్సరి యైన తన యందుఁ | గలిగె భంగంబు శిఖండిచేత; జనపతి దను నచ్చి మును జూద మొనరించె | దాను గయ్యంపు జూదమున నోడెఁ; దనయార్పు టెలుఁగునఁ దలఁకు వైరులు వొంగ | నొఱలుచు నేలకు నొఱగె నేఁడు; |
|
| ఆ. |
తీవ్ర బాణజాల దీప్తులు పరఁగించి | పాండుతనయ సైన్య బహుళ తమము లీలఁ బది దినంబు లోలి వినోదించి | యధిప! భీష్మభానుఁ డస్తమించె. |
47 |
| క. |
పదివేవురు రాజులు దన | కెదిరి పొలిసి రా శిఖండి యేమిటివాఁడై తుదిఁ బోయి తన్ను నాజిం | గదియుచుఁ బొలియించె; నియతిఁ గడవఁగ వశమే! |
48 |
| తే. |
చాపవక్త్రుండు భల్లదంష్ట్రావితాన | ఘోరమూర్తి నారాచనఖుండు ఖడ్గ జిహ్వికాభీషణుఁడు నరసింహమూర్తి | గాక కేవల నరుఁడె గంగాసుతుండు!’ |
49 |