| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
‘అధిప! నానా ప్రకార చరాచరంబు | లింద వేర్వేఱ జనియించు, నింద పెరుఁగుఁ, బిదప నింద యడంగు; నీ పృథ్వి దాన | సకలమునకుఁ బరాయణస్థాన మరయ. |
17 |
| వ. | అదియునుంగాక విను మాకాశంబునకు గుణంబు శబ్దంబు, వాయువునకు శబ్ద స్పర్శంబులును, దేజంబునకు శబ్ద స్పర్శ రూపంబులును, నప్పులకు శబ్ద స్పర్శరూప రసంబులును గుణంబులు; పృథివికి శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకం బైన గుణసముదయం బంతయుం గలదు గావున నిమ్మహా భూతంబు లేనింటిలోనం బృథివి యెక్కుడు; దీని యున్న విధంబు వివరించెద నాకర్ణింపుము. | 18 |
| సీ. |
ధాత్రీశ! మేరువు దక్షిణంబున సుద | ర్శన మను నభిధానమునఁ బ్రభూత విస్తార మై రెండువేలు నేనూఱు యో | జనముల పొడవునై సరస మధుర విపుల శాశ్వత ఫలవితతి సమేతమై | యొక్క జంబూతరు వొప్పియుండు దాని పండులు మహీస్థలి మహారవముగ | ననిశంబుఁ బడి రాలి యవియుచుండు |
|
| ఆ. |
వానిరసము పొంగి వాహినీ మూర్తి న | న్నగమునకుఁ బ్రదక్షిణంబు గాఁగ నొరసికొనుచుఁ దిరిగి యుత్తరకురు భూము | లందుఁ జొచ్చి పాఱు నంబునిధికి. |
19 |
| వ. | జంబూనది యనం బరఁగిన యా తరంగిణి నీరు సోఁకిన చోటెల్లను సువర్ణం బగుటం జేసి కనకంబునకు జాంబూనదం బను నామంబునుం గలిగెఁ; దదీయ జలపానంబు సేసిన మానవులకు ముదిమియుం దెవులును దప్పియు లే వని చెప్పుదు; రయ్యేటి పడమటం బెరిఁగి పఱపు గలిగి శరనిధిచందంబున జంబూషండంబు గాఱుకొనుచుండు; నింతటికిం గారణంబయిన యాజంబూవృక్షంబు పేర నీ ద్వీపంబు జంబూ ద్వీపంబు; జంబూద్వీపంబును సుదర్శన ద్వీపంబు నన నెగడి లవణ సముద్ర ముద్రితం బయి పొలుచు నద్దీవియందు. | 20 |
| సీ. |
నిడుపునఁ దూర్పును బడమర నై రెండు | గడలు నంభోనిధి గదిసి యుండు రత్నమయంబులు రమణీయములు సాధ్య | సిద్ధ చారణ గణసేవితములు నై హిమాచలమును, నావల హేమకూ | టంబును, నట నిషధంబు నొప్పు; లలితంబు లైన నీల శ్వేత శృంగవం | తంబులు గ్రమమునఁ దనరి పొలుచు; |
|
| ఆ. |
నివుల మూఁటి కవల నవుల యమ్మూఁటికి | నివలఁ దేజరిల్లు దివిజ నగము గమలకర్ణికానుకారియై కాంచన | మణిమయత్వ మహిమ మహిత మగుచు. |
21 |
| తే. |
అతిదృఢం బగుపాఁతు పదాఱువేల | యోజనము లంద్రు; దానికి రాజముఖ్య విందు మెనుబదినాలుగువేల యోజ | నంబులని హేమధాత్రీధరంబు పొడవు. |
22 |
| వ. | ఇవ్విధంబున భూమధ్యంబున నున్న యమ్మేరుమహీధరంబున దేవతలును, దేవమునులును, గంధర్వ కింపురుషాది దేవయోనులును, దేవేంద్ర ప్రముఖ దిక్పతులును, బరమేష్ఠియుం దత్తత్ప్రదేశంబులఁ బుణ్య వర్తనంబులం బరమ సుఖంబు లనుభవింతు; రుత్తరతటంబునం గర్ణికారవనంబున గౌరీసమేతుండై సిద్ధగణంబులు పరివేష్టింప విశ్వేశ్వరుండు విహరించుచుండు. | 23 |
| క. |
తొమ్మిది ఖండములై వ | ర్షమ్ము లనం జాల నొప్పెసఁగు జంబూద్వీ పమ్మున జనపదములు విను | మమ్మహితాంశములు దెలియ ననువర్ణింతున్. |
24 |
| వ. | ఉత్తర సముద్రంబు శృంగవంతంబు మధ్యమం బైరావతవర్షం బన నొప్పు; శ్వేత పర్వత శృంగవంతంబుల నడుము హైరణ్మయ వక్షం బనం బొలుచు నీలశైలోత్తర దక్షిణదేశంబులు గ్రమంబున రమణక వర్షంబును ననం జెలువమరు; మేరువునకుం బ్రాచ్య ప్రతీచ్యంబు లగు భాగంబులు వరుసన భద్రాశ్వ వర్షంబును గేతుమాలా వర్షంబును ననం బొగడొందు; హేమకూటోత్తర భూమి హరివర్షం బన నెగడు; హిమవంతంబు నక్కడయు నిక్కడయు నోలిన కింపురుష వర్షంబును భారత వర్షంబును ననం బెంపారు; ని ట్లున్న దీనియందు. | 25 |
| క. |
‘భారతవర్షముఁ దొడఁగి మ | హీరమణ! యుదీచ్యము లను నెక్కుడు బలస త్త్వారోగ్యాయుస్సుఖపు | ణ్యా రంభ గుణంబు లంతకంతకు నరయన్.’ |
26 |
| వ. | అనిన విని వైచిత్రవీర్యుండు ‘సమస్తద్వీపంబులు సకలజలనిధులు నున్న పరిపాటియుం బ్రమాణంబులుం బ్రకాశంబుగ నెఱిఁగింపు, మనుటయు, సూతసూనుండు జంబూద్వీప విష్కంభంబు కొలఁది యెనుబదివేలు నాఱు నూఱు యోజనంబులు; దీని రెం డంతలు దొడంగి లవణేక్షు సురాఘృత దధి క్షీరశుద్ధ జలమయంబు లయిన మహార్ణవంబుల విష్కంభంబులు గ్రమంబున నొకటి కొకటి రెట్టి యై యుండుఁ; బ్లక్షద్వీప శాల్మలద్వీప క్రౌంచద్వీప కుశద్వీప శాకద్వీప పుష్కర ద్వీపంబుల విష్కంభంబులు జంబూద్వీప విష్కంభ ద్వి గుణ ప్రమాణంబు మొదలుగా నోలి నొకటి కొకటి యినుమడి యై యుండు; నయ్యాఱు దీవులును జంబూ ద్వీపంబుకంటె నెల్లదానను బొగడ్త వడి యనేక పర్వతంబులను నానా నదులను బహు జనపదంబులను నొప్పి వరుస నొండొంటికి గుణవిశేషంబుల నధికంబు లై యుండు; నింతకుం గర్తయు భర్తయు హర్తయునై దుగ్ధాంబుధి యుత్తరంబునం గనకమయం బై యష్టచక్రంబును బ్రభూతభూతయుక్తంబును మనోజవంబును నగు మహనీయ శకటంబున వినోద పరాయణుం డైన నారాయణుండు వికుంఠనిధానుం డగుచు వైకుంఠాభిధా నంబున విఖ్యాతుండై విహరించుచుండు, నని చెప్పుటయు నతండు. | 27 |
| క. |
‘భారతవర్షమునకుఁ గాఁ | గౌరవులును బాండవులును గాంక్షం గడుఁ బె ల్లై రాసి యొండొరులతోఁ | బోరం దెగి రిట్టి లుబ్ధబుద్ధులు గలరే?’ |
28 |
| వ. | అనిన విని యమ్మనుజపతికి సంజయుం డిట్లనియె. | 29 |
| ఆ. |
‘అధిప! పాండుసుతుల కరయంగ నతికాంక్ష | లేదు; లుబ్ధబుద్ధి నీదు సుతుఁడు శకుని కఱపు విని యసన్మార్గవృత్తికిఁ | జొచ్చి యిట్టి యెడరు దెచ్చికొనియె. |
30 |