| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
క్రమ్మఱంగ నేతెంచెదు గాక!’ యనుడు | నతిముదంబునఁ బ్రణమిల్లి, యతని వాక్య మపుడు దల నిడుకొనినవాఁ డగుచు నప్పి | తామహుని నెమ్మి వీడ్కొని ధర్మసుతుఁడు. |
160 |
| వ. | కృష్ణార్జునాదులుం దోడన చనుదేర గురుకృపశల్యుల కడకుం గ్రమంబున నరిగి పాదప్రణామంబు లాచరించి, వారలచేత రణంబునకు ననుజ్ఞ వడసి, యమ్మనుజపతి దనకు జయం బాశాసింపుమని యభ్యర్థించిన నయ్యాచార్యుండు ‘నీకుం గృష్ణుండు మంత్రి యై యుండ నొరుల జయం బాశాసింపు మననేల? ధర్మం బేవలనం గలుగు నవ్వలన కృష్ణుండు గైకొను; నవ్వలనికి జయం బగు’ ననియె; నిజవధోపాయంబు వేఁడిన నతండు ‘నాచేత నాయుధం బున్నంతసేపు నన్నుం జంప నెట్టివారికి నశక్యం; బేను బ్రాయోపవేశంబున సన్న్యస్తశస్త్రుండ నైనం జంపుటకు నోపు నట్టివారికి నది దొరఁకొనుఁ; బెద్దయు నమ్మఁగలవాఁడు సెప్ప నత్యంతదుస్సహం బైన కీడుమాట వింటినేని నట్టివాఁడ నగుదు; నప్పు డట్టి పగఱకు నప్పని దీర్ప ననువై యుండు ’ నని చెప్పినఁ గృపాచార్యునిం బరిమార్చు తెఱంగు నడుగం దొడంగి యేర్పడం బలుకనేరకున్న , నతం డెఱింగి తాను వధ్యుండు గామి యెఱింగించి ‘గెలువు’ మని దీవించె మద్రపతితో ‘నీవు రాధేయునకు సారథి వగుట సంభవింప నోపు నని చెప్పి కయ్యంబు నప్పుడు కర్ణుతేజంబు దూలం బలికి యతనిఁ జిక్కువఱుపవలయు’ నని వరంబు గోరిన ‘నతం; డవ్విధంబు నీ యుద్యోగ సమయంబున నియ్యకొనినయది గాదే’ యట్ల చేయుదు’ నని పలికె నిత్తెఱంగున నందఱ వీడ్కొని యజాతశత్రుం డనుజవర్గానుగతుండై మరలె నయ్యవసరంబున | 161 |
| క. |
మొనల వినోదంబునకుం | గనుఁగొన నేతెంచియున్న కర్ణునికడకుం జని హరి యిట్లను నొండొరుఁ | గని యప్పటి యుచితభంగి గడతేర్చి తగన్. |
162 |
| తే. |
‘అమరతటినీతనూజుపై నలుకఁ జేసి | యనికిఁ జొర వటె! యట్లైన నతఁడు సచ్చు నంతదాఁకఁ బాండవులకై కొంత సమర | కేలి వేడుకఁ జలుపుట వోలదొక్కొ!’ |
163 |
| వ. | అనిన విని దేవకీనందనునకు రాధానందనుం డిట్లనియె. | 164 |
| క. |
‘కినుక వొడమి గంగాపు | త్త్రుని కయ్యమునప్పు డనికిఁ దొలఁగితి నేనిం జనుఁగా; కేఁ గురుపతికి | చ్చిన ప్రాణం బొండువలనఁ జేర్పం దగునే?’ |
165 |
| వ. | అనవుడు నప్పలుకులకు సంతోషించినవాఁడయి వాసుదేవుండు గౌంతేయులం గూడఁ జనుదెంచె నివ్విధంబున ధర్మనందనుండు గౌరవసైన్యంబు వెడలి నిలిచి యద్దిక్కు మొగంబు సేసి యెలుం గెత్తి యిట్లనియె: | 166 |
| తే. |
‘మమ్ము నెమ్మిమైఁ గలయఁ జిత్తంబు గలుగు | వార లెవ్వరు గలిగిన వచ్చి కలయుఁ; డట్టివారిని నా తమ్ము లంతవారి | గాఁగఁ బాటింతు నెంతయు గారవమున.’ |
167 |
| వ. | అనిన విని నీ పుత్త్రుండు యుయుత్సుం ‘డేను వచ్చెద నన్నుం గలపికొను’ మని పలికిన దానికిం బాండవాగ్రజుండు ప్రియంబందిన పలుకులు పలుకుటయును నతండు దుర్యోధనాదుల దుశ్చేష్టితంబు లుగ్గడించుచుఁ గౌంతేయుల గుణంబు లగ్గించుచు నిజసేనాసమేతంబుగా నిస్సాణాది రావంబులు సెలంగం జని ధర్మనందను బలంబులం గలసె; నది యట్టిద కాక సవతాలి ప్రజలు పొంద నేర్తురే? యది యట్లుండె; నిట్లు దన్నుం గలసిన సంతుష్టాంతరంగుం డగుచు నయ్యుధిష్ఠిరుండు యుయుత్సునకు నత్యుపచార సమాచారంబులం బ్రమోదం బొనరించి. | 168 |
| తే. |
‘రథముమీఁదికిఁ జనుదెంచి పృథులసైన్య | హర్షభాషణధ్వనులుఁ దూర్యస్వనములు నెగసి దివి ముట్ట మైమఱు విడి తలిర్చు | నెలమిఁ గోదండ తూణీరములు ధరించె. |
169 |
| వ. | తదవసరంబున నితని తమ్ములుం దక్కటి దొరలును దమతమ రథంబు లెక్కి యెప్పటి నెలవుల నిలిచినం, దదీయవ్యూహంబు పూర్వప్రకార సన్నాహం బై యొప్పె నట్టియెడ రెండు బలంబులవారును బాండవులు దొల్లి పడినపాట్లు సెప్పికొని వగచుచు వారు సంధికై చేసిన యత్నంబు వాక్రుచ్చి మెచ్చుచు నప్పుడు గురుజనంబులయెడఁ బాటించిన వినయంబు వర్ణించి యనురాగించుచుండి’రని చెప్పిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె. | 170 |
| క. |
‘మానుగ ధర్మక్షేత్రం | బైన కురుక్షేత్రమున మహాహవమునకుం బూని మన బలముఁ బాండవ | సేనయు నిటు వన్ని యేమి సేసెం జెపుమా!’ |
171 |
| వ. | అనిన విని సంజయుం డతని కి ట్లను: ‘దుర్యోధనుండు పాండవవ్యూహంబు గనుంగొని గురుని కడకుం బోయి | 172 |
| తే. |
‘చూడు మాచార్య! నీదు శిష్యుండు ద్రుపద | సుతుఁ డమర్చినయది పాండుసుతుల సేన పెంపు బలుపును గలిగి యొప్పినది: యందు | భీము నర్జునుఁ బోలిన బిరుదుమగలు. |
173 |
| వ. | సాత్యకి విరాటుండు ద్రుపదుండు ధృష్టకేతుండు చేకితానుండు గాశిరాజు పురుజిత్తు కుంతిభోజుండు శైబ్యుండు యుధామన్యుండు నుత్తమౌజుండు నభిమన్యుండు ద్రౌపదేయులు వార లందఱుం జాలు మానిసుల యిట్లు గూడి భీమాభిరక్షితంబగు నబ్బలంబు సాల సమర్థంబునుం బోలె మెఱసె; మన సేనా నాయకులం జెప్పెద; నిన్నును భీష్ముని నెన్న నేల? కృపాచార్యుం డశ్వత్థామ శల్యుండు వికర్ణుండు భూరిశ్రవసుండు మఱియుం బెక్కండ్రు రథికులు గలరు; నానాస్త్ర కోవిదులు, వివిధయుద్ధవిశారదులు, వీర లందఱు నాకై ప్రాణంబులు విడిచెద మని యున్నవా రిట్లు బెరసి భీష్మపరిపాలితం బయిన యీ సైన్యంబు పెద్దయు సమర్థం బై తోఁచుచున్నయది; మీరెల్లను వలయునెడల నిలిచి భీష్మునకుఁ గావలి గావలయు’ ననిన ద్రోణుం’ డట్ల కాక! యింత సెప్పనేమిటి? కనియె; నప్పలుకులు విని యమ్మహీపతికిఁ బ్రియంబు వుట్ట శాంతనవుండు సింహనాదంబు సేసి శంఖంబు పూరించిన. | 174 |
| క. |
తనతన శంఖంబును ద | క్కును గల దొరలెల్ల ననికి గొనకొని పూరిం చిన వివిధతూర్యనాదం | బును జెలఁగె నభంబు దిశలుఁ బూర్ణంబులుగాన్. |
175 |
| వ. | అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్యదేవదత్తంబులును భీమసేనుండు పౌండ్రంబున యుధిష్ఠిరుం డనంతవిజయంబును నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును పాంచాల విరాట సాత్యకి ధృష్టద్యుమ్నశిఖండి ప్రముఖ దండనాయకులు దమతమ శంఖంబులుఁ బూరించిన. | 176 |
| క. |
అనయము నుగ్రం బగు త | ద్ధ్వని గాంధారేయహృదయదారణ మై పాం డునరేంద్ర పుత్త్రసైనిక | మనోరమం బగుచుఁ జెలఁగె మనుజాధీశా! |
177 |
| వ. | తదనంతరంబ శస్త్రసంపాతంబునకు సమయం బగుటయుఁ గపిధ్వజుండు గాండీవంబు వుచ్చికొని గుణంబు సారించి బాణపాణియై నీ కొడుకులం జూచి కృష్ణునితో నిట్లనియె. | 178 |
| తే. |
‘కౌరవులలోన నిప్పు డెవ్వారితోడ | ననికిఁ గడఁగుదునో చూచికొనఁగవలయు నరద మల్లన యుభయసైన్యముల నడిమి | నేల కటు వోవఁగా నిచ్చి నిలుపు మచట.’ |
179 |