| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అనిన గుడాకేశు పలుకులకు హృషీకేశుండు భీష్మద్రోణప్రముఖ యోధవీరులు గనుంగొనుచుండ నత్తెఱంగున రథోత్తమంబు నిలిపి యతనితో ‘నీ వీ కూడిన కౌరవులం జూడు’ మనవుడు నప్పార్థుండు రెండు బలంబుల యందు నున్న సోదర సుత మాతులాచార్యాదు లగు బంధుశిష్టజనంబుల నాలోకించి పరమకృపావేశంబున నత్యంత విషాదంబు నొంది, గోవిందు మొగంబు గనుంగొని ‘దుర్మదాంధుం డయిన దుర్యోధను దుర్వినయంబున నింత వుట్టెం జూచితే!’ యని పలికి వెండియు. | 180 |
| చ. |
సరసిజనాభ! బంధుజన సంతతిఁ గయ్యపునేలఁ జూడఁగా విరవిరఁ బోయి మేను నిడువెండ్రుక వెట్టుచుఁ గంప మొందెఁ, జే నిరతము గాదు గాండివము, నిల్వఁగ నోర్వవు గాళు, నేను ని ష్ఠురతకుఁ జాల నొల్ల, నొకఁడున్ మహియేలుట యేటి సౌఖ్యముల్? |
181 |
| తే. |
ఎవ్వరికిఁ గాఁగ ధరణియు నెల్లసుఖముఁ | గోరెదము వార లందఱు వీరె వచ్చి ప్రాణములు నర్థములు నొల్లఁబాటు సేసి | కయ్యమునఁ జావ నఱుముట గంటి గాదె! |
182 |
| ఉ. |
తాతల, మామలన్, సుతులఁ, దండ్రులఁ, దమ్ముల, నన్నలన్, గురు వ్రాతము, శిష్టకోటి, సఖివర్గముఁ, దుచ్ఛజనానురూప దు ర్నీతి వధించి యేఁ బడయు నెత్తుటఁ దోఁగిన రాజ్యభోగముల్ ప్రీతి యొనర్చునే? యశము పెల్లొడఁగూర్చునె? పెం పొనర్చునే? |
183 |
| క. |
అక్కడి బంధులఁ జంపుచు, | నిక్కడి బాంధవులు సచ్చు టియ్యకొనుచు, నిం దెక్కడి పెం పొందెదఁ? దుదిఁ | ద్రెక్కొను పాపంబు రణము తెరు వే నొల్లన్. |
184 |
| ఆ. |
ఎల్ల భువనములను నేలుట కైనను | నిట్టి క్రూరకర్మ మెట్లు సేయ వచ్చుఁ గడఁగి? యెదిరివా రేమి సేసిన | మాఱుసేయ నాకు మనసురాదు. |
185 |
| చ. |
అకట! నితాంతలోభమున నావలఁ బాటిలు కీడు గానఁ జా లక ధృతరాష్ట్రసూనులు కులక్షయ మయ్యెడుదాని కోర్చి పో రికిఁ దెగి వచ్చి రన్కలుచ రెండు నెఱింగెడు నీవు నేను దీ నికిఁ జొర నేల? వీరి నిటు నిర్దయఁ జంపిన నేమి యయ్యెడున్? |
186 |
| క. |
కులనాశము సేసినఁ ద | త్కులధర్మము లడఁగు నష్టకులధర్ములకుం గలుగును దుస్సంకర; మ | క్కులఘ్ను లేఁగుదురు నరకకూపంబులకున్. |
187 |
| తే. |
ఇంత పాపంబు సేయంగ నెత్తికొందు | మయ్య? రాజ్యలోభంబున నఖిలబంధు జనుల వధియింపఁ దొడఁగితి మని’ రథంబు | మీఁదఁ గూర్చుండఁ బడియెఁ జే యూఁదికొనుచు. |
188 |
| వ. | ఇవ్విధంబున శోకసంవిగ్నమానసుండును విషాదవిహ్వలుండును బరమకరుణాభరితుండును నై శరశరాసనంబులు విడిచి కన్నీరు దొరంగ నూరకున్న, సవ్యసాచిం జూచి మధుసూదనుం డిట్లనియె. | 189 |
| క. |
‘దెప్పరపుఁ జోట నీ కీ | యొప్పని విధ మెచటినుండి యొదవెను? విను మీ చొ ప్పవివేకులయది; యిది | దప్పించును సద్గతియు నుదాత్తయశంబున్.’ |
190 |
| వ. | అని మఱియును. | 191 |
| తే. |
‘తగునె యర్జున! యీ పెంటితనము నీకు? | దండివై లెమ్ము’ మనసు పేదఱిమి విడిచి; యనిన నట్లున్న భంగిన యల్ల నిట్టు | లనియె నాతండు పుండరీకాక్షుతోడ. |
192 |
| సీ. |
‘అక్కట! పూజార్హు లగు ద్రోణ భీష్ముల | నమ్ముల నొప్పింప నగునె చెపుమ! మాన్యులఁ జంపుట మగపాడి గాదు; భి | క్షాశనం బైన నత్యంత సుఖము; కడఁగి యెవ్వరిఁ జంపఁగాఁ బెద్ద బ్రదుకయ్యు | నూహింప బ్రదుకు గాకుండు నాకు; విను మట్టి ధృతరాష్ట్రు తనయులు గారె యీ | యొడ్డిన మొనలలో నున్నవార; |
|
| ఆ. |
లింద్రియముల నెల్ల నివురంగఁ జేయుచు | నడరు శోకవహ్ని యాఱ నేర దింద్రపదవి సేరె నేనియుఁ; గావున | భండనంబు సేయకుండువాఁడ. |
193 |
| వ. | ఎల్ల భంగుల గురుజనంబుల నొప్పించుటకుం జాల వారిని గెలిపించుటయును మనము వారల గెలిచినవారల మగుటయు నను నీరెంటియందును బెద్ద మే లెయ్యది యేను గార్పణ్య దోషోపహత స్వభావుండను, ధర్మసమ్మూఢచేతస్కుండనునై నిన్ను శరణు సొచ్చి యడిగెద నీశిష్యుండ నగు నన్ను శాసింపు, మనిన విని కలకల నవ్వి నారాయణుండు నరున కిట్లనియె. | 194 |
| చ. |
‘వగవఁగ నేమియుం దగనివారికినై హృదయంబు గుందఁగా వగచెదు; బుద్ధి మాటలును వావిరి నాడెదు నీవు, పండితుల్ వగతురె యున్నవారికి నవశ్యవిధేయతఁ జన్నవారికిం; దెగు వగలెల్లఁ జిత్తము ప్రదీప్త వివేకమయత్వ మొందినన్.’ |
195 |
| వ. | అని పలికి పార్థునిం బరమ జ్ఞానంబునకుఁ గారణంబు లగు వాక్యంబులు వినుటకుం జొనిపి, యద్దేహంబునందు బాల్యంబు యౌవనంబు వార్ధకంబుననం గలుగు నవస్థలం బొందినట్లు జీర్ణంబులైన వస్త్రంబులు విడిచి నూతనంబు లైన వానిం గైకొనిన చాడ్పుననుంగాని దేహాంతరగమనం బాత్మహానిం జేయదనియుఁ బుట్టువుఁ జావు నను నివి లేమిం జేసి శరీరంబు వోలె శస్త్రచ్ఛేదనంబు మొదలైన వికృతికారణంబులకు నాత్ముండు లోను గాఁ డనియు నప్పురుషుండు నొప్పించువాఁడును నొప్పింప బడియెడు వాఁడును గాఁ డనియుం జెప్పి మఱియు ననేక వాక్యంబుల నాత్మకు నభావంబును శరీరంబునకు భావంబును గలుగమి దెలిపి యాత్మతత్త్వంబు శాశ్వతం బగుట యెఱింగించి యిట్లనియె. | 196 |