| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
రేపకడ రభసమున గం | గాపుత్త్రుఁడు సేనఁ గూర్చి గరుడవ్యూహం బేపారఁ దీర్చికొని ము | క్కై పొలుపును బలుపు మెఱయునట్లుగ నిలిచెన్. |
95 |
| వ. | దానికి ద్రోణకృతవర్మలు కన్ను లయిరి కృపాశ్వత్థామలు శిరం బయి నిలిచిరి త్రిగర్తులతోఁ గూడి భూరి శ్రవశ్శల్య భగదత్తులును సౌవీరజయద్రథులును గంఠత్వంబు నొందిరి మనుజపతి యనుజులుం దానును వెన్నయ్యె విందానువిందులుం గాంభోజుండును శూరసేనుండునుం బుచ్ఛం బైరి మాగధకళింగాదిగణంబులు దక్షిణపక్షం బయ్యును గర్ణాటకోసలప్రముఖనికాయంబులు వామపక్షం బయ్యును బొలిచిరి తక్కునుం గలవారలుఁ గలయం బన్ని రంతం బాండవబలంబులును భండనంబునకు వెడలె నయ్యవసరంబున నర్జునుండు. | 96 |
| క. |
మనమొనఁ గని ధృష్టద్యు | మ్నున కిట్లనుఁ బన్నఁబంపు మోహర మర్ధేం దుని చందంబున దుర్యో | ధనుసైన్యముఁ బొదువుననువు దలకొనవలయున్. |
97 |
| వ. | అనిన విని యతం డట్ల చేసినం బాండ్యమగధబలపరివృతుం డై భీమసేనుండు దక్షిణశృంగంబున నిలిచెఁ దదనంతరంబ విరాటద్రుపదులును మఱియు నీలుండును గాశకరూశగణసమేతుండై ధృష్టకేతుండును నిలిచిరి శిఖండి సహితుం డగు ధృష్టద్యుమ్ను మున్నిడికొని యుధిష్ఠిరుండు శుండాలమాలికాభీలంబుగా మధ్యప్రదేశం బలంకరించె నవ్వలన సాత్యకి మొదలుకొని యోలిన కవలును ద్రౌపదేయులు నభిమన్యుండు ఘటోత్కచుండుఁ గేకయ పతులుం బన్నిరి సకలలోకంబులకు రక్షకుండైన రాజీవాక్షుం డెవ్వానికి రక్షణం బొనర్చు నట్టి రథికశ్రేష్ఠుండు డాపలికొమ్మునం బన్నెఁ దక్కటి దొరలుం గలయమోహరించిరి ట్లుభయసైన్యంబులు సన్నద్ధంబు లయి నడచి నిస్సాణాదుల రావంబులు సెలంగ రౌద్రంబు దలకొనం దార్కొనియెఁ దత్సమయంబున ధనంజయుండు మన పదాతులు బడలువడం దనరథంబు వఱపించి శరంబులు నిగిడించి. | 98 |
| క. |
అరదములు రథికవరులును | హరి సారథి కేతుసహిత మై పొడిపొడిగాఁ గరులును జోదులు డొల్లఁగఁ | దురగంబులు రావుతులును దుత్తునియలుగన్. |
99 |
| క. |
చేయఁ దొడంగిన గాంధా | రేయులు వెస నొక్కపెట్ట రేఁగి యతనిపైఁ గో యని కవిసినఁ గని కౌం | తేయులు నందఱుఁ గడంగి తేరులు పఱపన్. |
100 |
| వ. | కని తమకించి బలంబులు రెండును గలయన్ బెరయఁ గెందూళి యెగసిన. | 101 |
| క. |
నామములఁ బితృపితామహ | నామంబుల నుగ్రబిరుదనామంబుల సాం గ్రామికు లెఱిఁగింతురు దము | నా మొన నీ మొనను జూపు లడరక యున్నన్. |
102 |
| తే. |
ఇవ్విధంబునఁ గ్రందుపా టింతయైన | భీష్ము కడఁక నీ సైన్యంబు భీముబలిమిఁ జేసి యా సేనయును నప్డు సిక్కు వడక | పోరె నేమని చెప్పుదుఁ గౌరవేంద్ర! |
103 |
| క. |
శోణితము వెన్‌ల్లి గవిసిన | రేణు వడంగుటయు మొనలు ప్రియపడి వెస గీ ర్వాణాసురసమరము క్రియ | బాణాదినిశాతహేతిపంక్తులు మెఱయన్. |
104 |
| వ. | పెనంగునట్టియెడ గాంగేయుండును గురుండును బురుమిత్త్రుండును సైంధవుండును సౌబలుండును వికర్ణుండును బాండవసేనపయి నడరిన భీమసేన ఘటోత్కచసాత్యకిశైబ్యచేకితానద్రౌపదేయులు వారిం దలపడినం బోరు ఘోరం బయ్యె నప్పుడు రథబృందంబులతో భవదగ్రనందనుండు వాయునందన తదీయనందను లున్నయెడకు నురవడించినం గని భీష్మద్రోణు లతని మించి వారలం దాఁకినం జూచి సవ్యసాచి యగ్రజు నగ్రభాగంబునకు వచ్చి. | 105 |
| క. |
భూరిశరాసారంబునఁ | గౌరవుల కడంక యుడిపె గాంధారబలాం భోరాశిఁ దఱియఁ జొచ్చిరి | వీరాగ్రణి సాత్యకియును విజయసుతుండున్. |
106 |
| క. |
పొదివికొని శకునిబల ము | న్మదగతి సాత్యకి రథంబు నఱకిన నాతం డది దిగ్గదాఁటి ధైర్యా | స్పదమతి నభిమన్యుతేరిపైకిం జనియెన్. |
107 |
| క. |
వా రిరువురుఁ జలమున గాం | ధారపతి ప్రముఖ రథికతతులను జంచ న్నారాచతతుల నొంచిరి | క్రూరతఁ గవిసెన్ యుధిష్ఠిరుఁడు భీష్ముపయిన్. |
108 |
| క. |
భూరిబలఘోర మగు నా | భూరమణుని కోలుతలకుఁ బోవక భీష్మ స్ఫారబలము ద్రోణుని దో | స్సారంబును నచ్చి నీదుసైన్యము పెనఁగెన్. |
109 |