పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
దుర్యోధనుఁడు భీమునితో యుద్ధము సేసి మూర్ఛిల్లుట (సం. 6-54-15)
చ. తదవసరంబునం బతి యుదగ్రత భీమునిఁ దాఁకి విస్ఫుర
త్ప్రదరము లేసినన్‌ నగుచుఁ బాండవవీరుఁడు రాజుమేన బె
ట్టిద మగుబాణ మొక్కటి వడింగొని తూఱఁగ నేయఁ దేరిపైఁ
జదికిలఁ బడ్డ మూర్ఛ నృపసత్తము లేవఁగనీక కప్పినన్‌.
110
ఆ. సంభ్రమమున నపుడు సారథి యచ్చోటు | దొలఁగ బెలుచఁ దేరు దోలుటయును
గని భయంబు నొంది కలఁగి యొక్కుమ్మడి | బలములెల్లఁ దెరలి పాఱఁ జొచ్చె.
111
క. వెనుకొని విఱిగిన సైన్యము | గనుకనిఁ బాఱంగఁ జేసి క్రౌర్యోద్రేకం
బున ధృష్టద్యుమ్నుండును | దన కెలనం దఱుమ వాయుతనయుం డెగిచెన్‌.
112
క. అదలిచి ద్రోణుఁడు భీష్ముఁడు | మదమున నిలునిలు మనంగ మఱియును మొగ క
ట్టద సేన భీమసేనుఁడు | గదిసి పిఱుఁద నంట నార్వఁ గౌరవనాథా!
113
క. సభయ మయి శకుని సైన్యం | బభిమన్యుఁడు సాత్యకియు రయంబునఁ దోలం
బ్రభ సెడి పఱచుట గని యా | ప్రభువు చలం బెడలి విఱిగె బంధులుఁ దానున్‌.
114
క. ఊర్జితశాత్రవసేనా | దుర్జయుఁ డగునర్జునుండు దోర్బల లీలా
స్ఫూర్జితుఁ డై యొక్క దెసన్‌ | గర్జారౌద్రముగఁ దోలెఁ గౌరవబలమున్‌.
115
తే. అంతఁ దెప్పిఱి నీ కొడు కనికి రథము | దొలఁగఁ దెచ్చుట గనుఁగొని యలిగి సూతుఁ
బలికి సరభసముగ నడుకలని కేఁగి | యెలుఁగు సూపిన బలములు నిలిచి పొదివె.
116
తే. ఉన్నచోటన కదలకయున్న ద్రోణ | భీష్ములును గోలుతలసేయఁ బెఱిగి సేన
చంద్రుఁ డుదయింపఁ బెఱిగిన శరధియట్లు | దోడుతోడుతఁ బొంగారి చూడనొప్పె.
117
వ. ఇట్లు బలంబుల నిలిపి సుయోధనుండు సత్వరంబుగా భీష్మద్రోణుల పాలికిం జని వారలతో నిట్లనియె. 118
ఉ. ‘ఉక్కున మూఁడు లోకములు నొక్కటఁ దాఁకెన యేనిఁ బోర మీ
రొక్కఁ డొకండ గెల్చుటకు నోపుదు రశ్రమవృత్తి నిట్టి మీ
ముక్కున నూర్పు గల్గ మనమోహర మీ దురవస్థఁ బొందునే?
యక్కట మున్న పాండవుల కల్గఁగ నొల్లమిసెప్ప రైతిరే!’
119
వ. అని పలికి గాంగేయుం గనుంగొని. 120
ఆ. ‘నాఁడె చెప్పఁగన్న నాకు రాధేయున | కెట్లు సూడఁ బోలె నట్లు వోలెఁ
బడినపాటుఁ బడుదు మడియాస నీచేత | భంగపడితి మింకఁ బలుకు లేల?’
121
వ. అనిన విని చిఱునవ్వు నవ్వుచు మీతండ్రి నీ కొడుకును బ్రియభాషణంబులం దేర్చి యిట్లనియె. 122
క. పురుహూతసహితమగు ని | ర్జరబలమున కైన గెలువ శక్యమె? సమర
స్థిరులగు పాండుతనూజుల | నరనాయక! నీకు నిట్లనం దగ వగునే?
123
క. వృద్ధులు గతాయువులు దు | ర్బుద్ధులు నగువారిచేతఁ బోదురె శస్త్రా
స్త్రోద్ధతియు బాహుగర్వ సమృ | ద్ధియుఁ గల పాండు సుతు? లమిత్రధ్వంసీ!
124
క. ఐనను నోపిన భంగిని | భూనాయక! పాండు రాజపుత్ర సముద్య
త్సేనలఁ గూల్చెదఁ గనుఁగొను | మీ! నీవును బంధులును సమీపస్థులరై.
125
వ. అని పలికి సంరంభంబున విజృంభించిన ధార్తరాష్ట్రులు ముదితమానసులై శంఖంబులు పూరింప భేరీ మృదంగాదితూర్యస్వనంబులు సెలంగుటయును. 126
క. విని పాండు నందనులు శం | ఖ నినాదము లుల్లసిల్లగా బహుతూర్య
ధ్వను లడరఁగఁ దిరమై తమ | మొన నిరతముగా నొనర్చి ముదము దలిర్పన్‌.
127
వ. నడచి రనిన విని సంజయునకు ధృతరాష్ట్రుం డిట్లనియె. 128
క. దుర్యోధనుమాటకు భుజ | వీర్యోద్ధతి భీష్ముఁడేచి విక్రమలీలా
ధుర్యతఁ గడఁగినఁ గయ్యం | బార్యస్తవనీయ! యెట్టులయ్యెం జెపుమా.’
129
వ. అనిన విని సంజయుం డతని కి ట్లనియె నప్పుడు ప్రభాకరుండు నభోమధ్యంబునకు వచ్చి వెలుంగుచున్న నతనితోడిపురుడునం దేజోమహిమ దలకొన్న తెఱంగునం దనమెఱుంగువాలమ్ము లనుకిరణమ్ములు వరఁగించుచుఁ బ్రతాపదీపితుండగు దేవవ్రతుండు దేవేంద్రసుతుం దాఁకిన . 130
చ. కడఁగి సుయోధన ప్రభృతి కౌరవవీరులు భీష్ముతోన బె
ట్టడరిన భీమముఖ్యులగు నక్కడి యోధులు నొక్క యుమ్మడిన్‌
వడిఁ దలపడ్డ సైన్యము లవారణ రెండును నేచి త్రోచి య
ప్పుడు రభసంబునన్‌ బెరసి పోరె వియచ్చరకోటి మెచ్చఁగన్‌.
131
వ. అట్టియెడ. 132
క. హుంకారములు నదల్పులు | జంకెలు ధిక్కరణములును సంస్తుతులును వీ
రాంకోక్తులు నిస్సాణజ | ఢాంకృతులును గలిసి యుద్భటంబుగఁ బెఱిగెన్‌.
133
క. తునిసిన బాహామస్తక | తనుచరణంబులును బాణ తరవారి గదా
ధనువులుఁ గిరీట కంకణ | కనదంగదములును దఱచుగా ధరఁ దొరఁగెన్‌.
134
తే. సగము సచ్చిన యొడళులు జలచరములు | రక్త పూరంబు దోయంబు ప్రచురమాంస
పటలి పంకంబుగాఁగల బహునదీ ప్ర | వాహములు వాఱె సంగరావని నృపాల!
135
క. అఱవఱ లైన రథంబులు | నెఱిదప్పఁగఁ బడిన యశ్వనికరంబులుఁ బెం
దఱచుగఁ గూలిన కరులు | న్గిఱిగొనియెన్‌ సమరమేదినీతల మెల్లన్‌.
136
వ. ఇవ్విధంబున విషమం బగు రణభూభాగంబునం జరియింపం జతురులు గాక రథికజనుఁ లంతంత గుంపులు గట్టిరి గాంగేయుండు ప్రతియోధులం బేరువేరం బిలుచుచు నుక్కుమిగిలి దిక్కు లమ్ములం బిక్కటిల్లం జేయుచు నెక్కడఁ జూచినం దానయై మెఱుంగు మెఱసిన తెఱంగునం గొఱవి ద్రిప్పిన యొప్పున నింద్రజాలంబు సూపిన చందంబునం దన రథంబు నెఱయ శక్తి శౌర్యంబులు నెఱయ నెవ్వరికి నిలువరింపరాక యెదిరిన రూపంబులం బెక్కింటి నొక్కబాణంబునం బెక్కుబాణంబుల నొక్కంటిఁ గూల్చి కేళి సలుపుచు నఱిమి పయింబడినవీరులం గీలెడలినజంత్రంబులుం బోలె నేలం గూల నేయుచు దృఢత్వలక్ష్య శుద్ధిలాఘవంబులకు వియచ్చరులు పిచ్చలింప ననేక ప్రకారంబు లగు క్రూరశరంబులఁ జతురంగంబులుం దునియలుం బఱియలుం దుమురులుం గుదులు నై బడలువడం జేయుచుం గార్చిచ్చు పొదివిన పోలిక మాయ గావించిన మాడ్కి మంత్రించి పడవైచిన పగిదిం గసిమసంగి కౌంతేయసేనం గనుపుకొట్టుచుఁ బ్రళయ కాలతాండవ ప్రవర్తి యైన ఫాలలోచనులీల నాజిరంగంబునం బరాక్రమనృత్యంబు సేయుచున్నం బాంచాలయాదవాదియోధులు వెఱఁగుపడి చూచుచుండఁ బాండవులునుం జేయునదిలేక చేష్టలు దక్కినం దదీయసైన్యంబులు రూపఱి భయభ్రాంతంబు లై దీనదశకు వచ్చె నప్పుడు శౌరి యుగ్యంబుల పగ్గంబులఁ బట్టి పార్థునితో ని ట్లనియె. 137
చ. కృపగురుభీష్మయుక్తముగ గెల్తు సుయోధనుసేన నంచు నీ
వపరిమితోగ్రశక్తి మెఱయం దఱి గోరుచు నుండు దెప్పుడుం
గుపితయుగాంతరుద్రుగతిఁ గోలుమసంగినవాఁడు భీష్ముఁ డే
చి పటుభుజాబలంబు విలసిల్లఁగ మార్కొన కున్కి యొప్పునే?’
138
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )