| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
పలకయు వాలును గొని ఱె | క్కలు గల పెనుఁబాము పగిదిఁ గవిసినఁ గౌంతే యులు సూచి వెఱగుపడి రా | బలమును నీ బలముఁ బొగడెఁ బటు శౌర్యంబున్. |
191 |
| వ. | ఇట్లు గవిసి. | 192 |
| క. |
వెరవున ధృష్టద్యుమ్నుని | శరనికరం బెల్లఁ బలక జడియుచుఁ గిరణ స్ఫురణాతిభీషణం బై | కరవాలము మెఱయఁ జిత్రగతులం గవిసెన్. |
193 |
| తే. |
కవిసి వ్రేసిన గ్రక్కున గద యమర్చి | యాఁగి వజ్రప్రహారంబు ననుకరింప ద్రుపదనందనుఁ డడిచినఁ దునియలయ్యెఁ | బలక రెండవవాటునఁ బగిలె శిరము. |
194 |
| క. |
తల వ్రయ్య లైనఁ బ్రాణం | బులును గృపాణంబు విడిచి భువిఁ ద్రెళ్ళె నతం డలుకొంది కురుబలం బా | కులతం బొందంగఁ గొండ గూలినభంగిన్. |
195 |
| తే. |
ఇత్తెఱంగున నిజపుత్రుఁ డీల్గుటయును | గ్రోధదీప్తుఁ డై శల్యుండు ద్రుపదసూతి మీఁదఁ గవిసిన నాతఁ డమేయ బాణ | పంక్తి వరఁగించె నుజ్జ్వల ప్రభలు నిగుడ. |
196 |
| వ. | అనిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె: | 197 |
| క. |
‘మానుష మేటికిఁ దైవా | ధీనము సర్వంబు నస్మదీయస్ఫాయ త్సేనలఁ బాండునృపాలక | సూనులు గెల్చెదరు కంటె? సూతతనూజా! |
198 |
| క. |
చావును నోవును మన యో | ధావలికిన్ గెలుపునుబ్బు నావలికిని నీ చే వినియెదఁ దుది నెట్టులు | శ్రీవిభవము పాండవకులకుఁ జేపడున కదే! |
199 |
| వ. | దుర్యోధను దుర్ణయంబున నేను దుర్వార్తలు వినుచు దుఃఖంబులనుభవించువాఁడ నైతిఁ గౌంతేయుల గెలుచునుపాయం బెద్దియుం గన్నవారముగా’ మనిన సంజయుం ‘డది యట్టిద నీసైన్యంబుల సేనాంగంబు లనేకంబులు వొలిసె దొరలు మడిసెదరు దిర మై విను’ మని యి ట్లనియె నట్లు శల్యుచేత బహుబాణంబులం బొదువంబడి పార్షతుం డతని నపరిమిత నిశితశరంబులం బొదువ నతం డతనివిల్లు దునిమి వివిధాస్త్రంబుల వెగడు వఱచిన నాధృష్టద్యుమ్నుండు నొచ్చుటయుఁ జూచి సుభద్రాసూనుండు మద్రపతిం దాఁకె నప్పుడు కురుపతి పురికొల్ప దుర్ముఖుండును దుస్సహుండును దుర్మర్షణుండును సత్యవ్రతుండును జిత్రసేనుండును బురుమిత్త్రుండును వివింశతియును వికర్ణుండును నయ్యభిమన్యు మార్కొనుట కలికి పాంచాల నందనుపై నడరి యొక్కొక్కండ పెక్కమ్ము లేసిన నా పృషతపౌత్రుండు చలింపక యొక్కొక్కరినిం బెక్కమ్ము లేసి కరలాఘవంబు నెఱపి యందఱకుం జాలి సమరంబు సేయుచుండె. | 200 |
| క. |
నకులుఁడు సహదేవుఁడు మా | మకు నచ్చెరువాటుఁ బ్రియము మదిఁ దలకొన నం బకవృష్టి గురియ నస్త్ర | ప్రకరంబునఁ బొదివె మద్రపతియును వారిన్. |
201 |
| వ. | వారికి బాసట యై పాంచాల మత్స్య పతులు సైన్యోపేతంబుగాఁ దఱిమిన మనయందుఁ గలదండిమగలు శల్యునకు సాహాయ్యంబు సేసి రంత దినమణి యంబరమధ్యం బలంకరించె నట్టియెడ. | 202 |
| తే. |
భీమసేనుండు నేఁడు సంగ్రామమునకుఁ | దీఱుదల యగుఁ గా కని తీవ్రకోప దీప్తుఁడై గద సూచుచుఁ దేరు నీదు | తనయునకు సమ్ముఖంబుగఁ దఱుముటయును. |
203 |
| క. |
నీ కొడుకు లందఱును వెఱ | నాకులతం బొంది రప్పు డగ్రజుఁడు గదా నీకఘను మగధు వీరో | ద్రేకంబునఁ బనిచె మారుతిం దలపడఁ గన్. |
204 |
| వ. | పనుచుటయు నతం డురవడించిన. | 205 |
| చ. |
గజఘటలం గనుంగొని వికాసము మోమునఁ బల్లవింపఁగా భుజశిఖరంబునందు గద పూన్చి మదంబునఁ దేరు డిగ్గి వా యుజుఁడు గడంగి భీషణసముద్ధతిమైఁ దలపడ్డఁ బర్వత వ్రజముపయిన్ వెసం గవియు వాసవుచందము దోఁచె నత్తఱిన్. |
206 |
| క. |
నిజసింహనాదమున న | గ్గజములు గుండియలు వగిలి కలగుండువడన్ విజయాగ్రజుఁ డి ట్లేచి ది | విజవర్గము పిచ్చలింప విస్ఫురితగతిన్. |
207 |
| వ. | విక్రమవిహారంబునకుం జొచ్చె నప్పుడు ద్రౌపదేయులు నభిమన్యుండును గవలును ధృష్టద్యుమ్నుండును గరిసముత్కరంబుపై శరనికరంబులు నిగిడించుచు భీముని నిరుగెలంకులం జేరి కవిసి రందు నకుల నందనుండగు శతానీకుండు హస్తికులమస్తకంబులు భల్లంబుల డొల్ల నేయుచు నడరె నట్టియెడ. | 208 |
| చ. |
మగధమహీశుఁ డేచి యభిమన్యునిపైఁ గరిఁ గొల్ప నుజ్జ్వలం బగు నొక నారసంబు దొడి యాతఁ డుదగ్రత ఫాలకుంభ సం ధిగతము గాఁగ నేయ నది దీనత మ్రొగ్గఁగ నప్పుడక్కజం బుగ వెస మాగధుం దునిమె భూస్థలి నయ్యిరు పీనుఁగుం బడన్. |
209 |
| క. |
ధృష్టద్యుమ్నుఁడు నుజ్జ్వల | దష్టాపదపుంఖ మార్గణావళి నయ్యు త్కృష్టగజఘటలఁ గలఁచె న | వష్టంభ విజృంభణంబు వైరులు వొగడన్. |
210 |
| ఉ. |
కొన్నిటి హస్తముల్ సదియఁ గొన్నిటిఁ గొమ్ములు దుమ్ము ధూళిగాఁ గొన్నిటిఁ గుంభముల్ వగులఁ గొన్నిటిఁ గాళులు నుగ్గునూచగాఁ గొన్నిటిఁ బార్శ్వముల్ నలియఁ గొన్నిటి వీఁపులు పిండుపీఁచుగా నన్నిటి భీముఁ డుద్భటగదాహతి నేనికవేఁట లాడఁగన్. |
211 |
| క. |
అభిమన్యుద్రుపదసుత | ప్రభృతు లతనితోన మెలఁగి బడలువడఁగ న య్యిభచయము నిశితవిశిఖ | క్షుభితముగాఁ జేసి రేపు సొంపారంగన్. |
212 |
| క. |
ద్విరదము లొఱగెడివియు నె | త్తురు గ్రక్కుచుఁ గూలెడివి గదుపు లై కలయం దిరుగుడువడియెడివియు భువిఁ | బొర లెడివియు నయ్యెఁ బవనపుత్రు మునుమునన్. |
213 |
| క. |
ఏనుఁగు నెత్తుట గదయుం | దానుఁ దడిసి విలయ కాలదండధరుని చం దానం బావని మాగధ | సేనం బీనుంగుపెంటఁ జేసి చెలంగెన్. |
214 |
| క. |
శరములవేగంబున గద | పరుసదనంబునను గలఁగఁబడి చేడ్పడ నా కరులం దోలెను భీముఁడు | వెరవున గోపకుఁడు గదుపు వెలిచిన మాడ్కిన్. |
215 |
| క. |
పెనుగాలిఁ దూలు మొగిళులొ | యన నిభములు విఱిగి నిజబలావలి సదియం దనమీఁదఁ బాఱ దుర్యో | ధనుఁ డదలిచి సర్వసైన్యతతిఁ బురికొల్పెన్. |
216 |
| క. |
పతి పురికొలిపిన నమవస | నతిశయముగఁ బొంగు జలధి యనఁ గ్రమ్మిన యు ద్ధతబలము నిలిపె నమ్మా | రుతి సెలియలికట్టక్రియ నిరూఢస్థితి యై. |
217 |
| వ. | ఇట్లు నిలిపి యార్చి తఱియం జొచ్చువృకోదరునకుం దోడయి ధృష్టద్యుమ్న సౌభద్ర ప్రముఖులగు రథికజనంబులు. | 218 |
| క. |
విడువక దాపట వలపటఁ | గడిమి మెఱయ నిలిచి యపుడు కౌరవ సేనం గడుఁ జిక్కు వఱిచి రొక్కు | మ్మడి నమ్ములవానఁ గురిసి మదమెలరారన్. |
219 |
| క. |
అడవి దరికొనిన పావకు | వడువున భీముండు గౌరవవ్యూహంబుం బొడిసేయుచుఁ బేర్చెం దన | యొడలు మనము నంతకంత కుబ్బుచునుండన్. |
220 |
| క. |
ఉరమునఁ గటిమైఁ దొడలం | జరణములం గౌరవేంద్రు చతురంగంబుల్ ధరఁ జాఁపకట్టు వడ ని | ష్ఠురగతిఁ దాఁకుచు సమీరసుతుఁడు చరించెన్. |
221 |
| తే. |
తుంగ మడువున నాడు మాతంగవిభుని | భంగి భవదీయసైన్యంబు బడలువడఁగ లీల నిస్సంభ్రముం డయి కేలి సలిపె | గాలిచూ లప్డు గగనచరాలి వొగడ. |
222 |
| క. |
వెఱచఱచి వెగడువడి ని | వ్వెఱఁగందుచుఁ గురుబలంబువీరు లతని డ గ్గఱ కంతనంతఁ జూడఁగ | నుఱక నదీసుతుఁడు దాఁకె నుద్భటభంగిన్. |
223 |
| క. |
అరదంబురవము సెలఁగఁగ | శరములు వాయుజునిమీఁద సాంద్రముగ వెసం గురియుచు నడరెడు భీష్ముని | సరభసముగ మాఱుకొనియె సాత్యకి గడిమిన్. |
224 |
| వ. | ఇట్లెదిర్చినం జూచి. | 225 |
| క. |
అంబరము వగుల నార్చి జ | నంబు వొగడఁ గృష్ణుననుజునకు మార్కొని తీ వ్రాంబకములు పదియింట న | లంబుసుఁడు దదంగకం బులం గీలించెన్. |
226 |
| వ. | ఇవ్విధంబునఁ దాఁకి బెట్టు నొప్పించినం గోపించి. | 227 |
| చ. |
శినిమనుమండు నద్దనుజు శీఘ్రమ నాలుగు నారసంబులన్ వెనుక కొదుంగఁజేసి పటువిక్రమ మొప్పఁగ నార్చె నార్చినన్ విని కనుఁగ్రేవఁ గెంపడర వీరరసోద్ధతిఁ జూచి సోమద త్తునితనయుండు బి ట్టతనితోఁ దలపడ్డ నుతించె సైన్యముల్. |
228 |
| వ. | ఇత్తెఱంగునం దలపడి. | 229 |
| క. |
భూరిశ్రవుండు దొమ్మిది | నారాచము లతనిమేన నాటించిన నా కౌరవ్యునిఁ బటు విశిఖా | సారంబున ముంచి నొంచె శైనేయుండున్. |
230 |
| ఉ. |
ఈసునఁ దానుఁ దమ్ములు నరేంద్రుఁడు గ్రందుగ సౌమదత్తికిన్ బాసట యై కడంగ నట పాండవులున్ హరితమ్ముఁ గూడి పె ల్లేసిరి వారిపై నధిప! యేడ్తెఱమీఱ బకారి యప్డు సం త్రాసన భాసురుం డగుచుఁ దాఁకి తెరల్చె భవత్కుమారులన్. |
231 |