పురాణేతిహాసములు శ్రీమహాభారతము భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము
దుర్యోధనుఁడు భీముని మార్కొని మూర్ఛఁ బొందించుట (సం. 6-60-7)
ఉ. తమ్ములు వీఁగినం బతి యుదగ్రత భీము నెదిర్చి యార్చుచుం
దొమ్మిది యమ్ములం దనువు దూఁటులు సేసిన సూతుఁ బిల్చి వే
గమ్మ రథమ్ముపై కరిగి కన్నుల నిప్పులు రాల నవ్వి యొ
క్కుమ్మడి నాతఁ డేసె నృపు నుగ్రగతిం బది నారసంబులన్‌.
232
సీ. అంతఁబోవక సూతుఁడగు నందకుని మూఁడుశరముల నేసిన ధరణినాథుఁ
డరువది యమ్ముల నతని నాతనిరథచోదకుం డైనవిశోకు మూఁట
నఱిముఱి నో నేసి మఱియు నొక్కమ్మున ఘనశరాసనముఁ ద్రుంచినఁ బ్రదీప్త
కోపుఁ డై యొండొక చాపంబు గైకొని యుగ్రభల్లమున వృకోదరుండు
 
ఆ. విల్లు దునుముటయును వేఱొక్క వింట వ | జ్రంబుఁ బోని నారసంబు దొడిగి
రాజరాజు వెస నురం బాడ నేసిన | మూర్ఛవచ్చి యతఁడు మ్రొగ్గె నధిప!
233
క. కని కడు నలిగి సుభద్రా | తనయుఁడుఁ బాంచాలరాజతనయుఁడు గృష్ణా
తనయులు నొక్కుమ్మడి నీ | తనయునిఁ బొదివిరి పటుప్రదరపుంజములన్‌.
234
ఉ. అంతకు సేద దేఱి విలయాంతకు నాకృతి భీముఁడేచి దు
ర్దాంతపరాక్రమస్ఫురణఁ దాఁకి నరేంద్రతనూజు శల్యు న
త్యంతరయంబునం బటుశరావలి నొంచిన నీదుసైనికుల్‌
సెంతలఁ జేర రైరి బలు సింగముఁ గన్న గజంబులట్ల యై
235
వ. అప్పు డపరాహ్ణం బయ్యెఁ దత్సమయంబున భవత్సూనులు సేనాపతి సుషేణ జలసంధ సులోచనులు భీమ భీమరథ భీమబాహు దుష్ప్రధర్ష దుర్ముఖులును వివిత్సు వికటోగ్రాలోలు పసములు నీ పదునలువురు బహుశరంబు లడరించుచు నతనిం బొదివిన నజ్జరాసంధమర్దనుండు ఘనశార్దూలంబు బాలమృగంబులం గని కవియు చందంబున నెదుర్కొని సేనాపతి శిరంబు భల్లంబునం ద్రుంచి బాణ త్రయంబున జలసంధు నంతకాలయంబున కనిచి సుషేణువక్షస్‌స్థలంబున వలుఁదనారసంబు నాటించి పడవైచి భీమబాహు నస్త్రపంచకంబునం జంపి యుగ్రునుత్తమాంగంబు వెడఁదవాతియమ్మునం గుండలమ్ములతోఁ గూల్చి భీమ భీమరథుల నొక్కుమ్మడిం బెక్కమ్ములం గూల నేసి నగుచు మిక్కుటమ్మగు నాలుగమ్ముల సులోచనుం గీ టడంగించిన. 236
క. పెఱవార లధికభీతిన్‌ | విఱిగి చనిరి భీష్ముఁ డేచి వీరరథికు లం
దఱఁజూచి రాచకొడుకుల | నఱుమాడెడు భీముఁ డిట్లు నడుఁకం దగునే?’
237
వ. అని పురికొల్పికొని తొడరునట్టియెడ. 238
క. మిగిలి పవమానసుతుపై | భగదత్తుఁడు మత్తగజముఁ బఱపి యతని నా
శుగములఁ బొదవిన నమ్మెయి | మొగిళులు రవిఁ బొదువు దర్పముం దలఁపించెన్‌.
239
చ. కని యభిమన్యుముఖ్యు లవికంపితవృత్తిఁ గడంగి యేసినం
దనువున నెల్ల రక్తజలధారలు గ్రమ్మఁగ వారణేంద్రుఁ డే
పున సెలయేఱు లొక్కమొగి బోరనఁ బెక్కడరంగ లీలఁ గై
కొని ఘనకేళి సల్పు నడగొండగతిన్‌ సముదగ్రమూర్తి యై.
240
క. కవిసి బలముఁ జంపఁగఁ బాం | డవ యోధులు నిల్వరించుటకుఁ జాలక ఱి
చ్చ వడినఁ గని పెల్లుగఁ గౌ | రవ సైన్యము లడరె నుద్ధురస్ఫురణమెయిన్‌.
241
తే. అప్పు డుబ్బి దుర్యోధనుఁ డతిరయమునఁ | దేరు వఱపించి మారుతిఁ దెగువతోడఁ
గదిసి బలునారసంబు వక్షమున నాట | నొల్లఁ బోవుచు సిడ మతఁ డూఁత గొనియె.
242
వ. అయ్యవసరంబున. 243
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )