| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
మనసేన పేర్చి పెల్లా | ర్చినఁ జూచి ఘటోత్కచుండు సెలఁగి జనకుఁ జే కొని ‘యిది మాయ ఘటింపఁగ | ననురూపం బైన వేళ’ యని తలఁచి వెసన్. |
244 |
| వ. | కైలాస శైలాకారంబును జతుర్దంతసారోదారంబును నుద్దామ గమన దుర్వారంబును నగు వారణంబు నెక్కి వజ్రజ్వాలాభీల బాహుదండుం డగుచు నయనసహస్రం బొప్ప నప్పాండవులకుం దోడుపడ నైరావణారూఢుండై యింద్రుండు చనుదెంచె ననుబుద్ధి వైరులకుం బుట్టునట్టుగా నంజనవామనాది దిగ్గజంబు లెట్టెట్టివి యని వినంబడు నాభంగి మత్తేభంబుల నెక్కి తక్కటి దిక్పాలురపోలికం దోడి దానవులు గెలంకుల నేతేరం గురుపతిపైఁ దోఁతెంచి యతని కడ్డుపడుభగదత్తుదంతిం బొదివి. | 245 |
| క. |
అమ్ముల నేనుఁగు కొమ్ముల | నమ్మత్తగజమ్ము నొంచి యఱిముఱి మనసై న్యమ్మెల్లఁ జదియఁ బఱచె భ | యమ్మున మొగతిరిగి దిక్కు లద్రువ నొఱలుచున్. |
246 |
| వ. | ఇ ట్లాభీలంబుగా భగదత్తుశుండాలంబుఁ దోలి యురవడించి. | 247 |
| క. |
దనుజపతి యేచి దుర్యో | ధనుదెస కడరుటయుఁ దత్పితామహుఁ డాచా ర్యున కిట్లనుఁ హైడింబుఁడు | దనమాయా గర్వమున నుదగ్రుం డయ్యెన్. |
248 |
| క. |
భగదత్తు నెగిచి కౌరవ | జగతీశ్వరుమీఁదఁ గవిసె సరభసవృత్తిం దగ నడ్డపడక తడయుట | మగఁటిమియే? పొదువవలయు మనుజాశనునిన్. |
249 |
| చ. |
తలఁ కెడువాఁడు గాఁడు భగదత్తుఁడు భీమతనూజుతోడ ని ట్టలముగఁ బోరఁ జాలు నకటా కరి యోరువదేమి సేయు? వి చ్చలవిడి భూవిభుం గవిసె సామజమున్ వెసనేయుఁ’ డంచు జో దులకును జేయి వీచి మును దోలె నతండు రథంబు బల్విడిన్. |
250 |
| వ. | ఆచార్యప్రభృతులగు రథికవరులునుం గూడికొని కురుభూపతి కడ్డపడి హిడింబానందనుపైఁ గ్రందుకొని వివిధాస్త్రంబులు పరఁగించి రంత నక్కడ నతనికిఁ దోడై యుధిష్ఠిరాది పాండవులును బాంచాలమాత్స్య ప్రముఖదండనాయకులును బ్రతివీరులపై ననేక విశిఖంబులు గురియ నప్పుడు పోరు ఘోరంబయ్యెనందు మందాకినీనందనుం డమంద పరాక్రమ క్రీడం గౌంతేయబలంబులం గనుపు గొట్టె నట్టియెడ నా ఘటోత్కచుం డుత్కటోద్దామవిక్రమాభిరాముం డగుచు సింహనాదంబు సేయ బృంహితోదాత్తంబు లైన తదీయ దంతావళంబులు నలిరేఁగి నీ సైన్యంబుల బడలువడం జేసినం గని గాంగేయుండు గుంభసంభవున కిట్లనియె. | 251 |
| క. |
‘ఈయనతో రణ మిప్పుడు | సేయఁగ మది గొల్ప దస్తశిఖరికిఁ జేరెం దోయజమిత్రుఁడు నేఁటికిఁ | బోయి మనము వత్త మెల్లిప్రొద్దున ననికిన్.’ |
252 |
| ఆ. |
అనిన నట్లకాక యని ధనురాచార్యుఁ | డప్పు డాత్మపక్షమైన రథిక కోటి కెఱుఁగఁ జెప్పికొని యని సేయుట | నిలిపి తివియఁ బంచె బలము నెల్ల. |
253 |
| వ. | ఇవ్విధంబున. | 254 |
| క. |
కౌరవ బలములు దిరిగిన | భేరీ శంఖాది తూర్య భీషణరావో దారపటు సింహనాద | స్ఫారవిలాసంబు లయ్యెఁ బాండవ బలముల్. |
255 |
| తే. |
చిన్నఁబోయి నీకొడుకులు సేయఁగలుగు | దొరలు విడిదల కరిగిరి పరఁగభీమ సేనుకొడుకు నగ్గించుచుఁ జెలఁగి వారు | చెన్ను సొంపారఁ జని రాత్మశిబిరములకు.’ |
256 |
| వ. | అని యిట్లు నాలవనాఁడు ధార్తరాష్ట్రులు దూలపోవుట సెప్పిన విని సంజయునకు నాంబికేయుం డిట్లనియె. | 257 |
| చ. |
‘అనితల నీవు పాండుతనయావలి కెప్పుడు మేలుచేయు నా తనయులకుం బరాక్రమము తక్కువయుం బ్రకటింప విందు; భీ ష్ముని గురు శల్యుఁ దక్కుఁగల శూరుల నెల్లను వారు సీరికిం గొన కిటు లింతవా రగుటకుం గత మెయ్యది? నాకుఁ జెప్పుమా.’ |
258 |
| క. |
అనుటయు నాతం డిట్లను | విను మౌషధగుణము మంత్రవీర్యము మాయా జనితసమగ్రోద్ధతి గా | దనఘా! నీ కేను మున్న యది యెఱిఁగింతున్. |
259 |
| ఉ. |
పాడియు సత్యముం గలరు పాండుతనూజులు నీదుపుత్త్రుల ప్పాడికి నోడ; రత్తెఱఁగు పాపము సేయఁగఁ జూచితీవు; న క్కీడిటు సేయ కే లుడుగు? గెల్వదె ధర్మువు? వారిగెల్పు మీ యోడుటయున్ ధ్రువంబు విదురోక్తులు వింటిమి గాదె! యేర్పడన్. |
260 |
| క. |
నీయడిగిన భంగిన గాం | గేయు నడిగె నట్లు వారు గెలిచి చనిన యా రేయి కురునాథుఁ; డాతని | కాయన సెప్పినవిధంబు నభివర్ణింతున్. |
261 |
| వ. | భీష్ముండు దుర్యోధనున కి ట్లనియెఁ దొల్లియుం బలుమాఱుంజెప్పుదుఁ బాండవులకు వాసుదేవుండు సహాయుండై యుండు నట్లగుట నెయ్యదియు నసాధ్యంబు లే దప్పరమేశ్వరు మహత్త్వం బున్నరూ పెఱింగెడు వారు పెక్కండ్రు లే రెఱింగినవారల కాపదలు లేవు కౌంతేయు లతని నెఱింగి యాశ్రయింతురు నీవు సరకుసేయవు వినుము చెప్పెద మానససరస్సు నుత్తరపర్వతంబు నగ్ర ప్రదేశంబున దేవతామునిగంధర్వాప్సరోగణంబులు గొలువం గొలువుండి కమలసంభవుండు. | 262 |
| తే. |
మణిగణోజ్జ్వలమైన విమాన మొకటి | యంబరంబునఁ గాంచి సర్వాత్ముఁ డందు సన్నిహితుఁ డగు టెఱిఁగి హర్షంబు సంభ్ర | మంబుఁ దలకొన లేచి నమస్కరించి. |
263 |
| క. |
‘లోకోత్పత్తి స్థితి విల | యాకలనవినోద! మునిగణార్చిత! గుణర త్నాకల్ప! నిర్గుణాత్మక! | శోకభయాపహపదాబ్జ! శుభకరమూర్తీ!’ |
264 |
| వ. | అని మఱియు ననేక ప్రకారంబుల సంస్తుతించి యి ట్లని విన్నవించె. | 265 |
| క. |
‘నారాయణ! నీకేఁ గడు | గారవమునఁ బుట్టి యిజ్జగము లన్నింటిన్ సారమతిం గావించితి | నీ రక్షణ వీని కెల్ల నిలుపై యుండున్. |
266 |
| క. |
ఇత్తఱి మనుష్య భువనం | బుత్తలపడుచున్నయది మహోగ్రాసురదు ర్వృత్తముల నీవు కరుణా | యత్తమతిం బుట్టవయ్య! యదువంశమునన్. |
267 |
| క. |
నరసఖుఁడ! నీవు సఖుఁడును | నరలోకమునన్ జనించి నానాదైత్యే శ్వరుల దెసఁ బీడ లుడుపుము | ధరణీభారంబు వాయఁ దాత్పర్యమునన్.’ |
268 |
| వ. | అని వేఁడికొని వినతుండయి యద్దేవుని తోడినీడయుం బోని నరనామధేయుం డగు మహాపురుషుం బ్రార్థించిన నన్నారాయణుండునుం గారుణ్యార్ద్రకటాక్షంబున వీక్షించి యట్ల యయ్యెడుం గాక! యని యానతిచ్చి యంతర్థానంబు సేసిన నక్కొలువువా రెల్ల నచ్చెరువంది. | 269 |
| క. |
‘పరమేష్ఠి! నీవు గడుఁ ద | త్పరతను వినయంబు సేసి ప్రార్థించితి వె వ్వరొకో వీరలు? నావుడు | సరసిరుహాసనుఁడు సెప్పె సంప్రీతిమెయిన్. |
270 |
| క. |
‘పరమమును లాదిపురుషులు | నరనారాయణులు వీరు నా కారాధ్యుల్ నరహితముగఁ బ్రార్థించితి | ధరఁ బుట్టుం డనుచు దానిఁ దలకొనిరి దయన్. |
271 |
| క. |
ఇలఁ గ్రీడగఁ బుట్టిన వీ | రలఁ గేవల మర్త్యులని సరకు సేయనివా రలు సెడుదు రెఱిఁగి భక్తిం | గొలిచిన వారలకు శుభ మగును వినుఁ డెందున్.’ |
272 |
| వ. | అని యెఱింగించి బ్రహ్మ దనలోకంబున కరిగెఁ గొలువువారలు నిజస్థానంబులకుం జని రిక్కడ నీకథ నారదజామదగ్న్య వ్యాసాదులచేత వింటిం దొల్లియు మహామునులు నిన్ను నరనారాయణుతోడి వైరంబు వలవ దని వారించిర కాదే? నీవు మదాంధుండవై మానవైతి వింకనైనను గృష్ణు నాశ్రయించి పాండవులతోడి పొత్తున మెలంగి బ్రదుకుమని చెప్పి భీష్ముం డూరకుండెఁ గౌరవపతియు నప్పలుకులు పెడచెవులం బెట్టె మీరు దగువారు సేయు హితోపదేశంబు లాచరించెదరె?’ యని పలికి సంజయుం డమ్మహీపతి కిట్లనియె. | 273 |