పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము
ద్రోణాచార్యుని మరణంబు విని ధృతరాష్ట్రుండు పరితపించుట (సం. 7-8-1)
సీ. ‘అస్త్రశస్త్రంబుల నధికుండు, వెరవరి, | భుజబలవిక్రమంబుల ఘనుండు
గురుఁ; డట్టివానిఁ దేఁకువలేక కదిసిరే | పాంచాలు? రతని చాపంబు దునిసె
నో! తేరు విఱిగెనో! సూతుండు వడియెనో! | యేమఱి యలసత నెదిరి సరకు
సేయమి మఱ పాత్మఁ జెందెనో! హీనాత్ముఁ | డైన ధృష్టద్యుమ్నుఁ డతనిఁ జంపె
 
తే. నట్టె! యచ్చెరు విది; దైవ మగ్గలంబు; | పౌరుషము కంటె ద్రోణుని పాటు వినియు
వేయిపఱియ లై పోవదు ఱాయి గాఁగ | నోపు నా గుండె; యే మని యుమ్మలింతు?’
80
వ. అని యడ లూని పొగిలి వెండియు. 81
తే. ‘మేరు వొఱగుట యినుఁడిలమీఁదఁ బడుట | యబ్ధి యింకుట గాదె ధైర్యమునఁ బేర్చి
ప్రభ వెలింగి గభీరత రాశి కెక్కి | యెందుఁ బొగడొందునాచార్యుఁ డిట్టు లగుట.
82
క. అతిలోక పరాక్రమనిధి | మతి సురగురు మిగులుఁ గురుకుమార గురుఁడు దు
ర్మతులగు మత్సుతులకుఁగా | మృతుఁ డయ్యెఁ బరోపకారమృతి యొప్పుఁ గదా!
83
తే. విల్లు పట్టెడు వారెల్ల వెరవు గఱచి | పోవ నెలవైన ద్రోణుని భుజము నిలువ
రించి పాంచాలనందనుఁ బంచి పార్థుఁ | డిట్లు సేయించెఁగా; కొరుఁ డేల చాలు?
84
క. పాముఁ బొదివి పడఁ దిగిచిన | చీమలగములట్లు ద్రోణుఁ జిక్కు పఱిచెఁ గా
కేమి బహుదేశసైన్యము; | లే మనఁ గల దింక సూత! యెవ్వరు మనకున్‌?’
85
వ. అని పలుమాట లాడి యొల్లంబోయి యాలోనన కొంత దెప్పిఱి, యంగంబులు వడంకుచుండ మఱియు నమ్మానవేశ్వరుండు సూతనందనున కిట్లనియె. 86
తే. ‘ప్రథమ గిరిమీఁదఁ దోఁతెంచు భానుఁ బోలి | ధర్మపుత్రుండు దోఁచినఁ దమము విరియు
నట్లు విరియక గురునకు నడ్డపడఁగ | వచ్చునే? తమ్ము మెఱసి యెవ్వరికి నైన?
87
క. సింధురము మహోద్రేకమ | దాంధంబై వచ్చులీల నాచార్యునిపై
గంధవహుసుతుఁడు గవియ న | మంథరగతి నెవ్వఁ డాఁగు మన యోధులలోన్‌?
88
చ. ఉఱుముచు నెల్లెడం బిడుగు లుగ్రగతిం బడ ఘోరమూర్తి యై
యఱిముఱిఁ గప్పుదెంచు విలయాభ్రము చాడ్పున మౌర్వినాద మే
డ్తెఱఁ జెలఁగన్‌ వడిం దొరఁగు దివ్యశరంబులు ద్రోణు తేరిపైఁ
బఱపు కిరీటి మీ ధరణిపాలకు జోదులచేత నిల్చునే?
89
క. ఎవ్వఁడు దెరలెనొ? తిరుగక | యెవ్వఁడు నిల్చెనొ? కడంగి యెవ్వఁడు బిరు దై
క్రొవ్వునఁ జచ్చెనొ? కుంభజు | నెవ్వఁడు గావంగలేఁడ? యెయ్యది దుదియో?
90
ఆ. గురుఁడు వడిన యపుడ కురుసైన్యములఁ గల | వారణాశ్వసుభట వర్గములును
బడియెఁ గాక; యేల పడకుండు? నా ధర్మ | పుత్త్రుభాగ్య మలఁతిఁ బోవునెట్లు?
91
చ. నడిఁకెడువాఁడు గాఁడు గురునందనుఁ; డక్కట! తండ్రిచావు న
ప్పుడు మొగ తప్పి యొండుఁగడఁ బోరుచునుండెనొ? యడ్డపాటు క
వ్వడికతనన్‌ ఫలింపమి నవారణ నాద్రుపదాత్మజుండు బె
ట్టడరి వధింపఁగా వికలుఁ డై దురపిల్లుచుఁ జూచుచుండెనో?’
92
క. అని పనవి వనట నలఁదురి | ‘నిను నెద్దియు నడుగ నాకు నీవేమియుఁ జె
ప్పను వలవదు సంజయ! మఱి | వినియెద మది గలఁగె’ ననుచు వివశాత్మకుఁ డై.
93
వ. తన కొడుకుల గెలుపు నెడ నాసమాలుటం జేసి. 94
ఆ. సొమ్మవోయి పడిన సుదతు లాక్రందన | రవముతోడ సత్వరముగ నెత్తి
యా నృపాలు సెజ్జయం దిడి మెలపున | శిశిర విధులు సేయ సేద తేఱి.
95
వ. ఆసీనుండై యాతండు సూతసుతున కిట్లనియె: ‘నరనారాయణులు రథిసారథులైన యా రథం బెందు సిద్ధమనోరథం బగుఁ; గవలుగడింది మగలు; సాత్యకి సత్యపరాక్రముండు; పాంచాలోత్తముండగు నుత్తమౌజుం డుదాత్తబలుండు; శిశుపాలతనయుం డగు ధృష్టకేతుండు ధీరుండు; భీష్మపాతన హేతువైన శిఖండి యఖండ పరాక్రముండు; సౌభద్రుండు రెండవరుద్రుండు, యాదవశ్రేష్ఠుండగు చేకితానుండు మానధనుండు; ద్రౌపదేయు లజేయులు; గేకయు లేవురు వేవురపెట్టు; యుయుత్సుండు బహుళ మత్సరుండు; ద్రోణవధంబ పనిగాఁ బుట్టిన ధృష్టద్యుమ్నుండు భుజసారద్యుమ్నుండు; ఘటోత్కచుండు ఘనఘోరమూర్తి; కృష్ణాశ్రితంబైన వృష్ణికుమార లోకం బలోకమాన్యంబన మిగిలిన బిరుదుతనంబునం బేర్చినయది; భీమగదాభీషణుండైన భీమసేనుండు నెవ్వరికి నలవిగాక యుండుఁ; బాండవ సేనఁ గావను గౌరవ సైన్యంబు సమయింపను దాన చాలునట్టి పరికరంబును గలదను కొలంది గాదు; కార్యవివేక శౌర్యోద్రేకధుర్యుండు ధర్మదేవత కొడుకు ధార్మికత్వసత్యాది మహాగుణ గరిష్ఠుండు యుధిష్ఠిరుం; డతని గెలువ దేవతలకు నశక్యంబు; మఱియు నొక్క విశేషంబు సెప్పెద నాకర్ణింపుము. 96
మ. యదు వంశంబున లోకరక్షణ పరుండై పుట్టి వ్రేపల్లె ను
న్మద బాల్యంబు నటించి, కంసముఖ నానాదైత్యులం ద్రుంచి బ
ల్లిదుఁ డా యింద్రుని పారిజాత మిలకున్‌ లీలాగతిం దెచ్చి శి
ష్టదయాళుత్వము వూనియున్న హరి నిష్ఠం జెంది రప్పాండవుల్‌.
97
వ. కావున వారల గెలుచు టరిది; యట్లుంగాక. 98
క. హరి యాత్మ యర్జునున; కా | హరి కర్జునుఁ డాత్మ; హరియు నర్జునుఁడును నా
నిరువు రగుట క్రీడార్థం; | బరయఁగ నది యొక్క వెలుఁగ యతులం బెందున్‌.
99
క. ఆ వెలుఁగు గనువెలుంగుగఁ | దా వెలసిన పుణ్యమూర్తి ధర్మసుతుం డే
లా వెఱచు? రణమునకు; నా | చే వచ్చెం గౌరవులకుఁ జే; టే మందున్‌?’
100
వ. అని వెచ్చనూర్చి యూరకుండి వెండియు. 101
చ. ‘గురుఁడును భీష్ముడుం గలనఁ గూలుదు రట్టె, కిరీటి కింక నె
వ్వ రెదురు? కౌరవక్షయ మవశ్యము నయ్యెడు; వార్త లేమిగాఁ
బురబురఁ బొక్కుచున్‌ వినఁగ బుద్ధిఁ దలంచెద; నైన ద్రోణు సం
గర పరిపాటి యెల్ల వినఁగా వలతున్‌ వివరించి చెప్పుమా!’
102
తే. అనిన సంజయుఁ డిట్లను నాంబికేయు | తోడ ‘నేను దెల్లంబుగ ద్రోణుసమర
మెఱిఁగి వచ్చితిఁ; జెప్పెద నెల్లఁ దెలియ | వినుము దిరమయి; మాటలు వేయు నేల?
103
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )