పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము
ద్రోణుఁడు దుర్యోధనునకు ధర్మరాజుం బట్టి యిచ్చునట్లు వరం బిచ్చుట (సం. 7-11-1)
వ. అట్లు సేనాధిపత్యంబు పూని కుంభసంభవుండు ముదితమనస్కుండై గారవంబునం గౌరవేంద్రునకు నరేంద్రులు విన నిట్లనియె. 104
క. ‘నను భీష్ముని పిదప బలం | బున కెల్లను ముఖ్యుఁ జేసి పూజించితి వీ
వినుతాచరణఫలంబును | గనువాఁడవు; వరము గోరు కౌరవనాథా!’
105
వ. అనిన విని యతండు కర్ణ దుశ్శాసనాది సుహృజ్జనంబులతో నాలోచనంబు సేసి సవినయంబుగా గురున కిట్లనియె. 106
క. ‘వర మిచ్చెదేనిఁ గోరెదఁ | బరమహితము ధర్మపుత్త్రుఁ బ్రాణముతోడన్‌
దురమునఁ బట్టి భుజాభీ | కర! కొని రావలయు మత్సకాశంబునకున్‌.’
107
వ. అని కోరుటయు భారద్వాజుండు నీ కొడుకువదనం బవలోకించి. 108
చ. అకట! యజాతశత్రుఁ డను నప్పలు కిప్పుడు నిక్కమయ్యె వా
నికిఁ గురునాథ! యిట్టు లతనిం దెగఁ జూచుట గోర కాజిఁ బ
ట్టికొనుట గోరి తివ్విధము డెప్పర మెంతయు నిత్తెఱంగు గో
ర్కికిఁ గతమేమి, పాండవుల గెల్చి ధరన్‌ సగ మీఁ దలంచితే?
109
వ. నీదు నిశ్చయంబెట్టిది? యతనిం బట్టిదెచ్చిన నేమి సేయంగల వాఁడ?’ వని యడిగిన నమ్మనుజవరుం డుప్పొంగి తన మనంబున నున్న కార్యం బాచార్యునకుం దక్కటి దొరలకుం దేటపడ నిట్లనియె. 110
సీ. ‘ఆ ధర్మసూనుఁ గయ్యంబునఁ జంపినఁ | గోపించి గాండీవి కురుబలంబు
సమయించు; మన మోపి సర్వపాండవులనుఁ | జంపితిమేనిఁ బ్రచండ చక్ర
ధారఁ గౌరవకోటి తలలేఱి రాజ్యంబు | గోవిందుఁ డీకున్నె గొంతికయినఁ;
గాన యుధిష్ఠిరుఁ గాయంబు నొంపక | తెచ్చి జూదంబాడు తెఱఁ గొనర్చి
 
తే. మగుడ నడవికి ననిచినఁ దగిలి యతని | తోడఁ దమ్ములుఁ బో నంతతోన యెల్ల
దొసఁగు మాలు; నప్రతిహత దోర్విభూతిఁ | బెద్దకాల మే నేలుదుఁ బృథివి యెల్ల.’
111
వ. అనిన విని కుటిలంబగు నతని యభిప్రాయంబునకు రోసి, యస్త్రగురుం డవ్వరంబునకు నేమేనియు నెడవెట్టియిచ్చువాఁడుగా నూహించి, యొక్క తెఱంగుఁ గాంచి, యన్నరనాథున కిట్లనియె. 112
చ. ‘నరుఁ డెడ సొచ్చెనేని విను నా కది దుష్కర మేనొకండనే
సురగణమైన వ్రేలఁ గొని చూపఁగఁ జాలరు వాఁడు లేనిచోఁ
దిరమయి పోర నిల్చిన యుధిష్ఠిరు ద్రౌపది పుట్టినింటి వే
వురు వెఱఁగంది చూడ నలవుం జలముం జెడఁ బట్టి తెచ్చెదన్‌.’
113
తే. అనుడు బాలిశులైన నీ తనయు లెల్ల | ధర్మజుఁడు పట్టువడున కాఁదలచి రపుడు
పాండుసుతులకు మొగమోడకుండ గురుని | ప్రతిన యెల్లెడఁ జాటించె రాజరాజు.
114
వ. ఇట్లు శిబిరంబునను, సేనాస్థానంబునను గలయ నాఘోషణంబు సేయించినం జెలంగి, సకల సైనికులును సింహనాదంబులు సేయ, శంఖభేరీరవంబు లుల్లసిల్లం గౌరవ సైన్యంబు వొంగె; నది యంతయుం గౌంతేయాగ్రజుండు దన చారుల చేత విని యనుజులం గూర్చి వినిపించి, వివ్వచ్చు నాలోకించి. 115
ఆ. ‘గురుని ప్రతిన వింటె? వెరవున లావునఁ | జేసి దీని బొంకు సేయవలయు;
నెఱుఁగు నతఁడు నిన్ను నెడవెట్టి పలికిన | వాఁడు గానఁ జెప్పవలసె నీకు.
116
క. నాయున్నచోట నెప్పుడుఁ | బాయక కనుగలిగి నిలిచి భండనము దగం
జేయంగవలయు నక్కురు | నాయకు కోరికి ఫలంబునకు విముఖముగన్‌.’
117
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )