పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము
అర్జునుండు ధర్మరాజుతో ద్రోణుని ప్రతిజ్ఞకు వెఱవకుండునట్లు సెప్పుట (సం. 7-12-7)
వ. అనుటయు నర్జునుం డతని కిట్లనియె. 118
క. ‘గురుని వధియించుటయు, భూ | వర! నీ వని నొవ్వ నొండువలను సనుటయుం
బరికింప నొక్కరూ; పవి | దురితంబులు; వీనిఁ జేయుదునె యే; నెందున్‌?
119
క. క్షోణీవల్లభ! విను మేఁ | బ్రాణముతో నుండ నిన్నుఁ బట్టి కొనఁగ నా
ద్రోణునక కాదు సగణ | స్థాణున కైనను వశంబె? తలఁ కేమిటికిన్‌?
120
చ. అలవి యెఱుంగ కిమ్మెయి దురాశఁ దలంచిరి గాక, ధార్తరా
ష్ట్రులు ద్రిజగంబులుం గొని పటుస్ఫురణం జనుదెంచి రేనియున్‌
బలవదరాతి పుంజ మదభంజన! నీ వని భంగపడ్డ నీ
యిల శకలంబులై చెడదె, యింకదె వారిధి, నింగి గూలదే?
121
ఆ. వారి తలఁపు వొసఁగ నేరదు, పోరఁ బ | రాభవంబు మనకు రా దెఱుంగు
కలుగ దద్దురాత్మకులచేత; నాతలం | పిట్టు’లున్నయది, నరేంద్రముఖ్య!
122
వ. అని పలికిన విని యుధిష్ఠిరుండు సంతుష్టాంతరంగుండై, శంఖభేరీ మృదంగాది సంగర మంగళ తూర్య స్వనంబులు సెలంగ సకల సైన్య సమేతంబుగా వెడలి, నడచి, మొగంబున నెలమి నెలకొనం గ్రౌంచవ్యూహం బమర్చె; నం దగ్రభాగంబున. 123
మ. ధవళాశ్వంబులఁ బూని కేతన కపీంద్ర స్ఫూర్తి మార్తాండ మూ
ర్తి విడంబింపఁగఁ జక్రగాండివధరుల్‌ దేజోమయాకార వై
భవమారం దనపై వెలుంగ నతి దీప్తంబైన తే రొప్పె శా
త్రవ సంఘంబు మనంబునన్‌ భయము గూరం గాలచక్రాకృతిన్‌.
124
క. ఆ రథముకెలన నుజ్జ్వల | ధీరోద్భట రేఖ మెఱసె ధృష్టద్యుమ్నో
దారస్యందన ముద్ధత | సారథికముఁ జారురంగచటులాశ్వమునై.
125
వ. మఱియు వృకోదరాది సోదరులను, నభిమన్యు ప్రభృతి కుమారులను, బాంచాలపతి ప్రముఖ బాంధవులను, ధృష్టకేతు ముఖ్యదండనాయకులను, దక్కునుం గల పరివారంబును దగ నయ్యైయెడల బలుపును, బొలుపును గలుగ నిలిపి, యుధిష్ఠిరుం డమ్మోహరంబు నడుమ నుదాత్త సన్నాహంబునను, గంభీరోత్సాహంబునను గొలిచి నిలిచె; నంతకు మున్న యక్కడ. 126
క. మనవారును రణకౌతుక | జనితోద్యమ తీవ్రు లగుచు శకటవ్యూహం
బొనరించిరి యొప్పును బెం | పును దర్పము నుల్లసిల్ల భూవరముఖ్యా!
127
వ. అందు వలపట సింధురాజ కళింగపతి సంగతుండయిన వికర్ణుండును, నతనికి బాసటయై చటుల హయ బహుళంబగు బలంబులతో నక్కెలన సౌబలుండును, డాపటఁ గృతవర్మ వివింశతి చిత్రసేన సమేతుండై దుశ్శాసనుండును, నతనికిఁ బ్రాపై తత్పార్శ్వ ంబునఁ గాంభోజ, శక, యవన మహీశ్వరులును, నడుమం ద్రిగర్తమద్ర శిబి శూరసేన దేశాధీశ పరివృతుండును, గుంభసంభవపురఃసరుండునునై కురువిభుండును, నా ముందట నంగ జనపద చతురంగ ప్రధాన సేనా సముదీర్ణుండై కర్ణుండును నిలిచిరి; వెండియుం గలవార లెడనెడం బన్ని; రట్టియెడ. 128
తే. దర్పదుస్సహతేజు రాధాతనూజుఁ | దిలకమై సైన్యముఖమునఁ బొలుచువాని
సైనికులు సూచి కడుసంతసమున నేచి | యెలుఁగు లడరంగఁ దమలోన నిట్టు లనిరి.
129
మ. ‘అని రాధేయుఁడు పాండునందనుల బాహాశక్తి మాయించు; నీ
తని దేవావలియైన మార్కొనునె? దుర్దాంతుండు భీష్ముండు పో
రిన యన్నాళ్ళును బక్షపాతమున వారిం బట్టి పాలార్చెఁ గా
క నిజం బల్గ నితండు ధీరులగు టింకం జెల్లునే వారికిన్‌?’
130
వ. అని యుబ్బుచుండి; రివ్విధంబున సన్నాహంబు సువిహితంబైన యనంతరంబ. 131
చ. తగ మన సైన్యమున్‌ గురుఁ డుదగ్రగతిన్‌ నడపింపఁ జొచ్చుడున్‌,
గగనతలంబు నెత్తురులుఁ గండలు నెమ్ములు నొక్క యుమ్మడిన్‌
మొగిళులు లేకయుం గురిసె మొత్తములై పెనుగ్రద్దలాడె, బె
ట్టుగ వినిచెన్‌ శివారుతము, డుల్లెఁ గడున్‌ వడి నుల్క లెల్లెడన్‌.
132
తే. అమ్మహోత్పాతములకు భయంబు గొనక | కౌరవులు శంఖములు మ్రోయ భేరు లులియ
నగ్గలిక సేన నడిపించి; రంత సమద | గమనమున వారి సేనయుఁ గదియ నడచె.
133
వ. అప్పుడు. 134
క. నరుఁడును రాధేయుఁడు నొం | డొరువులతోఁ బెనఁగు వేడ్క లుల్లంబులలో
గురువులు వాఱగ నిలిచిరి | యిరుదెఱఁగుల సైనికులకు నేడ్తెఱ మిగులన్‌.
135
తే. ఇట్టు లొండొంటిఁ గదియంగ నెలమి నడచి | బలము లొక్కింత సేపు నిశ్చలతఁ బొలిచె
మవ్వమెసఁగు వనంబుల మావు లెంత | యైనఁ జెలువార సొగసి యున్నట్ల పోలె.
136
క. తదనంతరంబ ద్రోణుం | డుదితార్కునిఁ గ్రేణిసేయు నుజ్జ్వల రథ మె
ల్ల దిశలు వెలిఁగింపఁగ బె | ట్టిదముగ మును గవిసె మొన గడిమితోఁ గదియన్‌.
137
క. మన బలము గదియు బలువిడిఁ | గనుఁగొని యర్జునుఁడు దొలుతఁ గవియఁగఁ బేరు
బ్బునఁ దాఁకె వారి సైన్యము | వినువీథి నమర్త్య గణము వేడుకఁ జూడన్‌.
138
సీ. రథకరి తురగోత్థ పృథివీ పరాగంబు | దెసల నాకసమున దీటుకొనఁగ,
బాణాది హేతి సంపాత జాతములగు | మంట లర్కాంశుల మరలఁ ద్రోవ,
హస్తికపాల రథావయవములు భ | గ్నములగు రవము లుగ్రముగఁ జెలఁగ,
వివిధ సేనాం గాంగ విదళనంబునఁ గ్రమ్ము | రక్తపూరములు ఘోరంబు గాఁగఁ
 
తే. గలయ బెరసిన పాండవ కౌరవ ప్ర | చండ సైన్యద్వయంబు నుద్దండ సమర
గతులు వెక్కస మొనరించె ఖచరసాధ్య | సిద్ధులకు; ననుబోంట్లకుఁ జెప్ప నేల?
139
వ. ఇవ్విధంబునం దొడంగి చెల్లు సంకుల సమరంబునం దన కనకరథం బరుణ తురంగంబుల చటుల చిత్ర సంచారంబులం గొఱవి ద్రిప్పిన తెఱంగున నేదిక్కు సూచినం దానయై పెక్కు రథంబులను బుద్ధి పాండవ పాంచాల యోధులకుఁ బుట్టునట్లుగా విహరించి, వివిధ విశిఖనిచయంబులు నిగిడించుచుఁ గుంభ సంభవుండు. 140
క. కూల్చుచు గజముల నెత్తుటఁ | దేల్చుచుఁ దురగముల వీఁకఁ దేరులు మరలన్‌
వెల్చుచుఁ గాల్బలములఁ బొరి | మాల్చుచు రౌద్రముగ మారిమసఁగిన భంగిన్‌.
141
వ. సంగర క్రీడ సలుపు నయ్యవసరంబున. 142
క. పాయవడు రథచయంబులు | సాయక హతిఁ జెదరుఁ బ్రళయ జలధర పటు గ
ర్జాయత తర్జన లీలఁ బ | లాయిత మగు పాండుసుత బలంబు నరేంద్రా!
143
క. పొదువుచు విచ్చుచు బలువిడి | నెదురుచుఁ బాఱుచును మఱి మహీభాగము గ్ర
క్కదలం గార్ముక విద్యా | విదుఁ డగు గురుతోడఁ బోరె వివిధ బలంబుల్‌.
144
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )