| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
వారి నెఱుంగుదు నేనును; | వారలు న న్నెఱుఁగుదురు; భవత్సాహాయ్య స్ఫార బలోద్ధతి గలుగఁగ | వారే తప్పింపఁ జాలువా రీపూన్కిన్? |
305 |
| వ. | ఏను జయద్రథుం జంపుటకుం దమకించి తఱుమునప్పుడు నాకు నెవ్వరడ్డంబు సొచ్చి రేనియు. | 306 |
| మ. |
పటు నారాచ పరంపరా ప్రసర దర్పం బేర్పడం బేర్చి త ద్భట సంఘంబును ఘోటక వ్రజము శుంభత్‌స్యందనౌఘంబు ను ద్భట కుంభి ప్రకరంబునుం బొదివి విధ్వంసంబు గావించి నె త్తుట జొత్తిల్లెడునట్లు సేయుదు సమిద్భూభాగ మత్యుగ్రతన్. |
307 |
| క. |
కౌరవ సైన్యంబులఁ గల | వీరుల యస్త్రములు నాదు వివిధాస్త్రగతి క్రూర ప్రవాహముల కెదు | రే! రాజీవాక్ష! యాదరింపకు వారిన్. |
308 |
| క. |
వెఱఁగుపడి కుంభభవుఁడుం | బెఱరథికులుఁ జూచుచుండ బీరము లావున్ మెఱయఁ జలము నెఱయఁగఁ దల | దఱిఁగెద సైంధవుని; నేల తలఁకెదు కృష్ణా! |
309 |
| క. |
కురుపతి బలముల యేలా, | చరాచరములైన భూతజాలము లెల్లం దరతరమ యడ్డపడినం | దెరలిచి పడవైతు సింధుదేశాధీశున్. |
310 |
| ఆ. |
గురుని యలవుఁ జలము వెరవును గలఁచి నీ | యాన, గాండివంబు నాన, దివ్య శరము లాన, యెల్లి సైంధవు తల యెల్ల | భంగిఁ దునిమివైతుఁ బగఱు దలఁక. |
311 |
| చ. |
కనియెదు సైంధవుం గడచి క్రందుగ నాకు నెదుర్చు రాజులం దునుమఁగ భూషణోత్కరముతోఁ బదహస్తశిరంబు లుర్విపైఁ బెనఁగొని చారు భంగియును భీషణ రేఖయుఁ దాల్ప, నెత్తురున్ నెనడును గ్రోలి భూతములు నిక్కుచు నీల్గుచుఁ జొక్కుచుండఁగన్. |
312 |
| క. |
అవ్వలి సైనికు లడలఁగ | నవ్వుచు మనవార లార్వ నారాయణ! న న్నెవ్వరు మార్కొన లేమికి | నొవ్వం గురురాజు నేఁ దునుముదును ద్రోహిన్. |
313 |
| తే. |
సాధనము గాండివం బటె! సమరకర్త | యర్జునుం డటె! సారథి యబ్జనాభుఁ డటె! మరల్పఁగ వచ్చునే యా రథంబు | హరునకైనను నెఱుఁగక యంటిగాక, |
314 |
| క. |
పూనఁగ రాదే నాకె | ద్దానిం? బూనినను నీవు దలకొని తీర్చం గా నునికి గలుగ నే నీ | చే నుండఁగ నిట్టు లేల చెప్పెదు చెపుమా! |
315 |
| క. |
ఈ ప్రతిన యెట్టి తెఱఁగున | నప్రతిహతవృత్తి నెగడునట్టి తెఱఁగు లో క ప్రభువ! నీవ చేయ న | తిప్రకట పరాక్రమ ప్రదీప్తుఁడ నగుదున్. |
316 |
| క. |
మమ్ము నరయు భరమున నీ | విమ్మెయిఁ దలపోసి; తింక నిచ్చట నేలా నెమ్మది నిద్రింపంగాఁ | బొమ్ము; ప్రభాతమున రథముఁ బూన్పఁగ వలయున్. |
317 |
| వ. | అని యివ్విధంబున సల్లాపంబులు సేయుచు నరనారాయణు లత్యంత కుపితాంతఃకరణు లగుచుఁ బాములు రోఁజు పోల్కి నిట్టూర్పులు నిగిడించుచున్నం, బురందరాది బృందారకులు భయంబుగొని దీన నేమి పుట్టునో! యని చింతాక్రాంతు లైరి; వారిధులు సంక్షోభించె, సరిత్ప్రవాహంబులు ప్రతిగమన వ్యాకులంబు లయ్యెఁ, గాననశైల సహితంబుగా మహి సంచలించె, మఱియు మాతంగ తురంగ నరనికరంబుల నాశంబులు దెలుపునుత్పాతంబు లనేకంబులు దోఁచె, విశేషించి కౌరవస్కంధా వారంబున దారుణ వాయువులు విషమ గతులం జరించుటయు, నుల్కానిర్ఘాతంబులు నలుగడలం బడుటయుఁ, గరిహరి నికరంబులు బహుళంబులగు బాష్పజలంబులు విడుచుటయు మొదలుగాఁ బెక్కుదుర్నిమిత్తంబులు పుట్టినం బోటుమగ లగు భూపతులు లోనుగా నెల్లజనంబులుం బుల్లపడి యుండి’ రనవుడు సంజయునకు ధృతరాష్ట్రుం డి ట్లనియె. | 318 |
| తే. |
‘అట్లు దమలోనఁ దగుమాట లాడి యాడి, | కోపరసవేగమునఁ గుంది కుంది, వగలఁ బొంది పొంది పురందరనందనుండు | నచ్యుతుండు నా రాత్రి యెట్లైరి చెపుమ!’ |
319 |