పురాణేతిహాసములు శ్రీమహాభారతము ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము
శ్రీకృష్ణుండు పుత్రశోకాతురయైన సుభద్ర నూఱడించుట (సం. 7-54-11)
వ. అని యడిగిన నా సూతసూనుం డంబికాసూనున కిట్లను: ‘నమ్మురారి చిత్తం బారాధించి యర్జునుం డట మున్న యొక్కనాఁడు శిబిరంబునకు సుభద్రయుం బాంచాలియు నుత్తరయును వచ్చి యచ్చటన యునికిం జేసి యచ్చెలువల శోకానలంబు లుడుగునట్టి మాట లాడ నతనిం బ్రార్థించి పంచిన. 320
తే. అమ్ముకుందుండు గ్రొత్తయై యడలు దనదు | డెంద మలఁపంగఁ జెలియలి మందిరమున
కరిగి పురపురఁ బొక్కెడు నా సుభద్రఁ | గాంచి యిట్లను నెంతయు గారవమున.
321
క. ‘రాచూలికి నుచితం బగు | నాచారముగాదె రణమునం దరులఁ దెగం
జూచుచుఁ దిరుగని నడపున | నేచి యమరలోకమునకు నేఁగుట తరుణీ!
322
క. నీ కొడుకు తుచ్ఛమగు నీ | లోకంబు దొరంగి పుణ్యలోకమ్మునకుం
బోకకు ని ట్లధికం బగు | శోకముఁ బొందంగ నగునె సుదతీ! నీకున్‌?
323
ఆ. బ్రహ్మచర్యమునఁ దపంబున నుత్తమ | దానములను బడయఁ దలఁచునట్టి
గతులకంటె సౌఖ్యకారిణి యగు గతిఁ | బొందె నీసుతుండు గుంద నేల?
324
ఉ. క్షత్రియకాంత పుత్రకుని గాంచుట వాఁ డతిలోకవీరుఁడై
ధాత్రిఁ బ్రసిద్ధి కెక్కుటకుఁ దా నది గాకయు వీరపత్ని నా
నీ త్రయి నెందునుం బ్రణుతి కెక్కిన నీవు తనూజుబీరమున్‌
శత్రువధోత్సవంబు విని సంతస మందక కుందఁ బాడియే!
325
వ. అట్లుం గాక. 326
క. కాలం బైనం బోవక | యీలోకమునందు నిలువ నెవ్వరి వశ? మి
ట్లేల యవివేకజనముల | పోలిక శోకానలమునఁ బొగులుచు నుండన్‌.
327
క. తగుమాట లాడి కోడలి | వగ పుడుపుము; నీవు ధైర్యవతి; వి ట్లడలం
దగునె? నినుఁ జూచి కాదే | మగుడుం జిత్తముల వగలు మా కందఱకున్‌.
328
ఉ. నీమగఁ డెల్లి సైంధవు ననిం దెగటార్చి శిరంబు దెచ్చినం
గోమలి! నీదు పాదములకుం దగు పీఠము సేయు; మాతఁ డు
ద్దామ భుజాబలాఢ్యుఁ డది దప్పదు; వాని ప్రతిజ్ఞ దప్పినన్‌
భూమి వడంకదే! తరణి పొల్పు దలంకదె! వార్ధి యింకదే!
329
క. నా పలుకు నమ్ము; మర్జునుఁ | డా పాపాత్మకుని నెల్లి యనిఁ జంపి ముదం
బాపాదించుం; గులమున | కీపెంపున కెలమి వొందుఁ డీవును నతఁడున్‌.
330
వ. అని యనేక ప్రకారంబులం బలికె; నప్పు డగ్గోవిందుం గనుంగొనుట నుత్కటం బయిన శోకంబున సుభద్ర యాకులతం బొంది. 331
ఉ. . ‘అక్కట! పుత్త్ర! నిన్నుఁ గని నంతియ పుణ్యమ కాని నాకు నీ
వెక్కుడు భక్తి సేసి నను నెప్పుడు నారయ నీకుమారకు
ల్మక్కువ నాకడం దిరుగ లాలన సేయుచునుండునట్టి యా
మిక్కిలి నోము లేద? యిట మీఁదికి నెవ్వరు దిక్కు సెప్పుమా!
332
ఉ. బాలుఁడ వైన నీ వరిది బంటుతనంబునఁ బ్రౌఢవీర భూ
పాలురఁ గుంభజ ప్రభృతి బాహుబలాఢ్యులఁ గిట్టి నేలకుం
గోలకుఁ దెచ్చి యి ట్లగుటకున్‌ వెఱఁగందుచు వంతఁ బొందుచున్‌
లోలతఁ జూడ కున్నె జనలోకము నీదగు రూపురేఖయున్‌.
333
తే. మేను మృదుశయ్య సగము నా మేనిమీఁద | సగముగాఁ జేర్చుకొని ముద్దు మిగుల నిద్ర
సేయునట్టి నీ విప్పుడు చెనఁటి నేలఁ | దనువు వొందుట కోర్చితే తండ్రి! చెపుమ!
334
క. వంది జనంబులు మాగధ | బృందంబులు సంస్తుతింపఁ బెంపొందుదు మ్రో
లం దిరిగెడు క్రవ్యాదుల | క్రందున నీవీను లిపుడు కటకటఁ బడవే?
335
చ. అనిలతనూజు లావు గలఁ డందురు, సాత్యకి శౌర్యశాలి నాఁ
జను, ద్రుపదుండు సంగరవిశారద భావము పూనియుండు, మా
త్స్యు ని బటు విక్రమాఢ్యుఁ డని చూతురు, పాండవు లింద ఱుండి యొ
క్కనికిఁ గడంగ లేర నినుఁ గావఁగ; నేమన నేర్తుఁ బుత్త్రకా!
336
సీ. ఈలోక మెల్లఁ బాడిల్లును బోలెనై | యున్నది నీవు లేకునికిఁ జేసి;
నీవు వేగమ గండు నెఱసి బంధులఁ బ్రీతిఁ | బొందఁ జేయుట గలవోలె నయ్యె;
జిష్ణుని కొడుకవు కృష్ణునల్లుండ వీ | వరులచేఁ బడుట చోద్యంబు గాదె!
చెలువంపు మేనును జెన్ను మొగంబునై | యెప్పుడు పొడసూపె దింకఁ గుఱ్ఱ?
 
తే. యకట! యుత్తర యొప్పెడు నది మనంబు | దీని కెంతయు మెత్తన; యేను నిన్ను
వేఁడికొనియెద! వచ్చి యివ్వెలఁది వంత | దీపి దళుకొత్తుపలుకులఁ దేర్ప వన్న!
337
చ. అలఘు తపంబులం, బ్రకట యాగములన్‌ మునిచోదిత వ్రతం
బుల మహనీయదానములఁ బుణ్య చరిత్రములన్‌ మహాత్ము లెం
తలు రమణీయ విశ్రుత పదంబుల కేఁగుదు; రంతకంటె ను
జ్జ్వల మగు సద్గతిం బడయు వాసవపౌత్త్ర! పవిత్రవర్తనా!’
338
వ. అని బహుప్రకారంబులం బలవించుచున్న సమయంబునం బాంచాలి యేతెంచి యిరుగేల నుత్తరా సుభద్రలం బొదివి, తానును వారును నడలూని పుడమిం బడి వివశతం బొంది వికలాక్రందనంబు సేయుచున్న నన్నారాయణుండును శోకసంతాపితాంతఃకరణుం డగుచు నుచితవచనంబుల నయ్యువిదల నెట్టకేలకు నూరార్చి, మగుడి పాండవులపాలికిం జనుదెంచె; నప్పుడు ధర్మతనయుం డమ్మాధవ ధనంజయులను భీమసేనునిం గవలను నితరపరిజనంబులను నిజనివాసంబులకుం బోవం బనిచి, తాను నభ్యంతర మందిరంబునకు నరిగె; గృష్ణుండును జిష్ణుతోన తదీయసదనంబునకుం జని, విమల జలంబులం గృతాచమనుం డయి యొక్క వివిక్త ప్రదేశంబునం దర్భశయ్య గావించి దాని నక్షతగంధపుష్పంబుల నలంకరించి యాయుధంబు లర్చించి, చుట్టు నిడి, కవ్వడి నందుండు మని నియోగించి ‘నీవు నిశాసమయంబునం జేయు దేవపూజ యింతకు మున్న చేయ వని తలంపించిన నతండును బాదప్రక్షాళనంబు నుపస్పర్శనంబును నాచరించి, తాను నిత్యంబును నడపు త్ర్యంబక పూజనంబు తెఱంగున మాల్యానులేపన ధూప దీప నైవేద్యంబు జనార్దనునకు సమర్పించిన, నమ్మహాత్ముండు సంభావించి యాప్తులగు దౌవారికజనంబుల శస్త్రహస్తులై కొలిచి యుండునట్లుగా సంఘటించి, యా సవ్యసాచిం జూచి, నీవు సుఖనిద్ర సేయు; మేన నీకు శుభంబు గోరి యుండెదఁ; బోయి వచ్చెద’ నని పలికి దారుకుండు దోడ నరుగ నాత్మగేహంబునకుం బోయి. 339
ఆ. సెజ్జయందు మేను సేర్చి యర్జునకార్య | చింతఁ బలుకకుండి కొంతవడికిఁ
బవ్వళించెఁ గురునృపాలక! జలశాయి | దారుకుండు గొలిచి యూరకుండ.
340
వ. ఆ సమయంబున నవ్వీటివా రెల్లను దమయుల్లంబుల నెవ్వగలు నివ్వటిల్లం గన్నుమూయక విన్ననయి యుండి. 341
సీ. ‘అభిమన్యుఁ డీల్గిన నర్జునుఁ డధిక శో | కావేశ మొంది సాహసికవృత్తి
నతి దుర్ఘటం బైన ప్రతిన యిట్టులు వట్టు | నే? కౌరవులు దీని నెట్టు లైనఁ
దప్పింపఁ జూతురు; దర్పంబు వెరవును | గలవారు వారి కగ్గలము గలరు;
కడు దెప్పరం బైన కార్యంబు వాటిల్లె; | నెమ్మెయి నిది నిర్వహించువాఁడొ
 
ఆ. యకట! దినములోన నాసైంధవునిఁ జంప | నబ్బకున్న నతని కగ్ని సొరఁగ
వలయు; నాతఁ డనృతవాదిగాఁ; డిక్కార్య | మెట్టు లగునొ! మనకు నేది గతియొ!’
342
వ. అని వెండియు. 343
క. ‘మన చేసిన సుకృతంబుల | వినుతఫలము లెల్ల నెల్లి వివ్వచ్చుఁడు సిం
ధునరేంద్రుఁ జంపునట్లుగ | నొనరి యొదవవలయు’ నని దృఢోక్తిఁ బలుకుచున్‌.
344
ఆ. అగ్రపుస్తకంబు లర్చించి చూచుచుఁ | బరమ నియతిమై నుపశ్రుతులకుఁ
బోవుచును శుభంబు లావహించుటఁ గాంచి | చెలఁగి యొండొరులకుఁ జెప్పికొనుచు.
345
క. ‘గురునట్టివారు పదివే | వురు గాచిన నెల్లి సైంధవుని పగలిటిలోఁ
బొరిగొనునట్లుగ నరునకు | వరమిండీ వేల్పులార! వారని కరుణన్‌.’
346
వ. అని ప్రార్థించుచు దైవంబుల కేటికోళ్ళు నిరూపించుచు మఱియు బహుప్రకారంబులం బలుకుచుండిరి; రాత్రి సాలం జనిన మేలుకని దామోదరుండు దారుకు నాలోకించి. 347
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )