| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
పాండుసూనులతోడి పగకోర్చె నెవ్వని | యుత్సాహమూఁది సుయోధనుండు వైదేహపౌండ్రాదివసుధేశు లెవ్వని | కడిమి సొంపున నరిగాఁపులైరి మనమూఁక లెవ్వని పెనుఁ బ్రాపుగాంచి గ | ర్వితములై సంగరక్రీడ సలుపు నద్భుతం బొనరించు నమరుల కెవ్వని | యసమాన వివిధ దివ్యాస్త్ర మహిమ |
|
| ఆ. |
యట్టి కర్ణుఁ డీల్గెనట్టె! యింకెక్కడి | బ్రదుకు మనకు నేటి భండనంబు? దీని వినియు నాదు మానసం బేమియుఁ | గాదు వజ్రమయము గాఁగనోపు. |
21 |
| వ. | అని విలాపించి మఱియును. | 22 |
| క. |
పొరి బంధు పుత్త్ర మిత్త్రుల | పరిభవములు వించునిట్లు ప్రాణముతో నె వ్వరు నుండుదురే? యే నొ | క్కరుఁడును దక్కంగ నింత కష్టం బగునే?’ |
23 |
| వ. | అని పలికి మరణోద్యుక్తుండై జలాగ్ని విషప్రాయోపవేశాదు లుగ్గడించిన విని సంజయుం డతని కిట్లనియె. | 24 |
| చ. |
‘కులమును శ్రీయుఁ దేజము నకుంఠితకీర్తియుఁ జూడఁ దొంటి రా జులకెనవత్తు నీ విటులు శోక సమాకుల చిత్తవృత్తిమైఁ గలఁగుట యొప్పునే? శ్రుతము గౌరవముం బొగ డొందునట్లుగా నిలువుము ధీరతాతిశయ నిష్ఠఁ జలింపక యుండు భూవరా!’ |
25 |
| వ. | అనుటయు నాంబికేయుండు సంజయున కిట్లనియె. | 26 |
| తే. |
‘శోకవారిధిపారంబు నాకుఁ బొంద, | నేల వచ్చుఁ? జిత్తంబునఁ గీలుకొని య సహ్యమై కర్ణ మరణోపజనితమైన | పరిభవం బను శల్య మాతురతఁ జేయ. |
27 |
| క. |
పౌరుష మేటికి దైవం | బేరూపునఁ జూడ ఫలద మే మందము దో స్సార నితాంతోజ్జ్వలుఁ డగు | నారాధేయుండు సచ్చె నర్జునుచేతన్. |
28 |
| క. |
అలఘుతరాయువు నాకుం | గల దది యెట్లనినఁ బోరఁ గర్ణుని పా టేఁ దెలియవినఁగ నా డెందము | పలువఱియలు గాక యున్న భంగి నెఱిఁగితిన్. |
29 |
| క. |
మును లోకముచే సత్కృతి | గని నెగడెడు వాఁడ నాకుఁ గలవారెల్లం జన శోచ్యుఁడ నై దుర్దశ | నునికి మనికి యగునె? దీని కోర్వఁగ వశమే? |
30 |
| సీ. |
దుఃఖ పరంపర ద్రొక్కునఁ బెట్టె నా | చిత్తంబు ననిమిషసింధు తనయు పడుటయు ద్రోణుండు పరలోకమున కేఁగు | టయు సూతజుని తెగుటయును వినియు నందుఁ గర్ణుఁడు లేమి యత్యంత దుఃఖంబు | సేసె దుర్యోధను నాస మానె నతఁ డేడుగడయును నైయుండు నతనికి | నెవ్వరు గలరు దిక్కింకఁ జెపుమ |
|
| ఆ. |
మన బలంబుచేవయును వైరిసైన్యంబు | భయముఁ జెడఁగ రాధపట్టి గొంతి పట్టిచేత సమసి పడియున్న వాఁడె? వా | సవుని కడిమిఁ బడిన జంభునట్లు. |
31 |
| క. |
‘విను పిచ్చుకకుం టతిరయ | మునఁ బోకకుఁ బడుట, పేదముదుకఁడు వేశ్యా జనముం గోరుట దుర్యో | ధనుఁడింక జయంబు గొనఁగఁ దలఁచుట యరయన్. |
32 |
| క. |
మనలోఁ గయ్యం బేటికి | నని ధర్మసుతుండు సెప్పె నది మీ పతి గై కొనఁ డయ్యె రోగి పథ్యా | శనమునకుం జొరని భంగి సంజయ! యెట్లున్. |
33 |
| సీ. |
శరతల్పమున నుండి శాంతనవుండు బీ | భత్సు దివ్యాస్త్ర వైభవము దెలుపఁ దివిరి జలంబట్లు దెప్పించుకొని యప్డు | పాండుసూనులతోడి బాంధవంబు నడపుము సిరి పంచి కుడుచుట మే లింత | తోఁ గయ్యముడిగి శాంతుఁడవు గమ్ము బ్రదుకుము నీవన్న పనుపుసేయఁడు సుయో | ధనుఁ డిప్డు శోకాబ్ధి మునుఁగకున్నె? |
|
| ఆ. |
పడుచు లీఁక లూడ్చి పట్టి యాడెడు నట్టి | పులుఁగు చందమయ్యెఁ దలఁప నాయ వస్థ యెందుఁ జొచ్చువాఁడ? నీ యలమట | దీర్ప నెవ్వరింక దిక్కు గలరు?’ |
34 |
| వ. | అని పెక్కు భంగుల నివ్వటిలు నెవ్వగలు బయలుపడం బలు మాట లాడి రాధేయు తెగిన తెఱంగు తెలియ వినం దలంచి యిట్లనియె. | 35 |
| మ. |
‘విజయుం దాఁకి పెనంగుచో నతని దోర్వీర్యంబు సైరించెనో భుజ దర్పోద్ధతిఁ జూప నోపెనొ చలంబుం జేవయున్ సైన్య యు గ్మజనంబుల్ వినుతింపఁ బేర్చెనొ తొలంగం బాఱెనో తెంపు న క్కజపుంబెంపును దీఱ డింపఁడు గదా! కర్ణుండు దీనాకృతిన్. |
36 |
| క. |
తక్కటి సైనికు లని న | య్యొక్కని దిగవిడిచి పాఱిరో? లావుం బే రుక్కును మెఱయఁగఁ దోడ్పడి | పెక్కండ్రురు వడిరొ? బెరసుఁ బీనుంగులుగాన్. |
37 |
| వ. | అని మఱియును. | 38 |
| క. |
ముందర శిఖండి నిడి సం | క్రందననందనుఁడు సేరి గంగా తనయున్ మ్రందించెఁ గపటమున నా | చంద మొకటి కర్ణునందుఁ జర్చించిరొకో? |
39 |
| క. |
సామజము వడిన నశ్వ | త్థామవడియె ననఁడె? ధర్మతనయుఁడు గురునిం దా మడియించుటకై య | ట్టే మేని యొనర్చి రొక్కొ? యితఁడు వడుటకున్. |
40 |
| క. |
మాయోపాయంబుల గాం | గేయుండును గురుఁడు ననిఁ దెగిర కాక రణ న్యాయంబు దప్పకుండఁగ | నా యిరువుర నోర్వ నెవరికైనను వశమే? |
41 |
| సీ. |
పరశురాముని చేతఁ బడసిన వాఁడు బ్ర | హ్మాస్త్రంబు సర్పముఖాస్త్ర మలఁతిఁ బోవునె? దివ్యాస్త్రములు పెక్కు మఱియును | గలవు రాధేయున కలవుమెఱసి యభిమన్యు విల్ దునుమాడఁడె నాగాయు | తత్రాణు ననిలనందనుని బాడు దలఁబట్టె సహదేవుఁ జులుకన మర్దించి | మందల విడువఁడే మాయలాని |
|
| తే. |
మేటిమగని ఘటోత్కచు గీ టడఁపఁడె | యట్టి జెట్టికిఁ బోరఁ జావెట్టి భంగి నయ్యెఁ? దేరికి సూతున కంచితాస్త్ర | ములకు దైవోపహతిఁ జేటు మూఁడెనొక్కొ? |
42 |
| క. |
రథ మవితథమైనను సా | రథిపని నెఱపిన మహాస్త్ర రాజి విధికృతిన్ వృథగాకున్నను గర్ణునిఁ | బ్రధనంబున గెల్వ దేవపతికిన్ వశమే? |
43 |
| ఉ. |
సారథి యెవ్వఁడాతనికి శల్యుఁడు ద్రోణ తనూభవుండు గాం ధార విభుండునుం గృపుఁడుఁ దత్సమయంబున నేమిభంగిఁ దో డైరి? సుయోధనుండు హృదయంబునఁ దాఁ గృతవర్మదర్పము న్బీరము నచ్చియుండుఁ దగ నెయ్యము సూపెనె? యాతఁ డత్తఱిన్. |
44 |
| క. |
వారలు గెలఁకుల నడవఁగ | రారాజు పిఱుందఁ గదిసి రా నెబ్భంగిం గారణము లేదు చావఁగ | నా రాధేయునకుఁ జోద్య మయ్యెడుఁ దలఁపన్. |
45 |
| ఉ. |
పాండవకోటి సూతసుతుపై నడతెంచిన చందమెట్టు? లా ఖండలసూతి సర్పముఖ కాండము తాఁకున రూపుమాసి పో కుండుట యెట్లు కల్గె? సమరోద్ధతి దక్కటి నల్వురందు నె ట్లుండె? బలద్వయంబు నెటులోపి పెనంగె? దినద్వయంబునన్’. |
46 |
| వ. | అనిన విని సంజయుండు ధృతరాష్ట్రున కిట్లనియెఁ‘గయ్యంబు తెఱంగు మొదలుకొని చెప్పెద నాకర్ణింపుము. ద్రోణుండు దెగిన నశ్వత్థామ దనయోపినంత సమరంబు సేసి చాలించి సేనలఁ దివియించి మరలి వచ్చిన దుర్యోధనుం డప్పుడు గొలువిచ్చియుండి యశ్వత్థామ లోనగు దొరలం గలయం గనుంగొని మనకు నిటమీఁదఁ జేయంగల పని యెయ్యది? యని యడుగుటయు న గ్గురుసుతుండు. | 47 |
| క. |
‘విను మాదర ముత్సాహం | బనూన ధార్ష్ట్యంబు నీతి యను సద్గుణముల్ పని సఫలం బగునట్టుగ | జననాథ! యొనర్చు దైవ సాహాయ్యమునన్. |
48 |
| చ. |
తలఁపఁగ సద్గుణంబులకుఁ దావలమై పెనుపొందు నుజ్జ్వలా త్ములు సనిరైన చేభరము దోఁపఁగ నీదగుదొంటి శౌర్యముం దలకొని నిర్వహింపు ముచితంబుగ దైవము తోడుపాటునుం గలిగెడుఁ గాక యున్న రథికప్రవరుల్ దలపోయ నల్పులే? |
49 |
| క. |
మనము బలశౌర్య ఘనుఁ గ | ర్ణుని సేనాముఖము సేసి నూల్కొని యరిమ ర్దన మొనరింత మితని యం | దనూనతం బొల్చు సద్గుణావలియు నృపా! |
50 |
| క. |
వైవస్వతు చందంబున | నీ వీరుఁడు రిపుబలంబునెల్ల నడంపం గా వలఁతి దివ్యశర శి | క్షావైభవ పరమనిష్ఠ కలిమి నరేంద్రా!’ |
51 |
| వ. | అని సూత పుత్రుం జూపిన భవత్పుత్రుండు ప్రీతుండయి యతండు పాండవుల జయించు నను నాస యగ్గలంబైన యంతరంగంబుతో న య్యంగపతి కిట్లనియె. | 52 |
| శా. |
‘నీవిక్రాంతియు నా పయింగల యతి స్నేహంబుఁ బ్రఖ్యాతముల్ గావే? భీష్ముఁడు ద్రోణుఁడుం దెగుట నీ కౌరవ్య సైన్యంబులం గావంగాఁ దగు నీకు వారల యుపేక్షం గాక యిన్నాళ్ళు లే లా? వైరం బడఁగింప నీ వయిన లీలన్ గెల్తు కౌంతేయులన్. |
53 |
| వ. | నీవు ప్రాజ్ఞుండవు ప్రబలుండవు విశేషించి నాకేడుగడయు నీవ కావున నీకు మదీయ హితంబవశ్య కర్తవ్యం బట్లుంగాక మన మా భీష్మద్రోణుల నవమానింతుము. వారలు భండనంబునం బడిన నొదిఁగియుండ నేర్తుమే? కడంగుము పగఱకు నీకడంక చీఁకటికి సూర్యునుదయంబెట్టిదట్టి దయ్యెడుంగాక బృందారక సేన సేనాని నడపిన కైవడిం గౌరవ సైన్యంబు నడపి నన్ను గెలిపింపుము నిన్ను నీవ సర్వసేనాధిపత్యంబునకుఁ బట్టంబుగట్టి కొ’మ్మ నినం బ్రీతుండయి రాధేయుండు గాంధారేయునకుం బ్రహర్షంబుగా భూవల్లభు లెల్ల నాకర్ణింప ని ట్లనియె. | 54 |
| మ. |
‘విను నీ కిచ్చిన బాస యే మఱతునే? ‘వీరంబు బాహాబలం బును ధైర్యంబును నస్త్రవీర్యమును నీ భూలోక సంచారు లె ల్లను గీర్తింపఁగఁ బాండుపుత్రుల మదోల్లాసంబు మర్దింతు నీ వనుమానింపక నిల్చి చూడుము మదీయంబైన సంగ్రామమున్. |
55 |