| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | దేవా, వైశంపాయనుండు జనమేజయునకిట్లనియె; ‘నట్లు మహాప్రాజ్ఞుండగు సంజయుండు దండుననుండి హస్తిపురంబున కరుగుదెంచి, ధృతరాష్ట్రు మందిరంబు ప్రవేశించి, యంతఃపురంబున నున్న యన్నరనాథుం గనుంగొని, కృతప్రణాముం డగుటయు నతం డాదరించిన నాసీనుండై. | 2 |
| క. |
బలవిక్రమములు వినుతం | బులుగా మనమొనలుఁ బాండుపుత్రానీకం బులు రెండునాళ్ళు వోరుట | దెలియంగాఁ జూచి వచ్చితిం గురునాథా! |
3 |
| వ. | అని పలికి కర్ణునిం బ్రశంసించి. | 4 |
| చ. |
సరకుగొనండు పాండుసుత సైన్యనికాయము నించుకేనియుం గరులు రథంబులున్ హరులుఁ గాల్బలముల్ దనవీఁక విచ్చియున్ మరలియుఁ దూలియుం బిలుకుమాఱియు నల్గడఁ బాఱియున్ వియ చ్చరులకు వేడ్కసేయ భుజసారము శౌర్యముఁ జూపె నేపునన్. |
5 |
| వ. | చూపి, యక్కౌంతేయులం గలంచి యాడి, పదంపడి. | 6 |
| తే. |
తనకుఁ బిమ్మిటియైన యర్జునునిబాహు | లీల నెమ్మెయిఁ ద్రోవంగలేక తెగియె నధిప! యాఁబోతు బెబ్బులి కగ్గమైన | పగిదియై పాండవులకును బగ యడంగె. |
7 |
| వ. | అనుచు శోకోపహతుండై సూతసూనుండు నిట్టూర్పు నిగిడించి, డగ్గుత్తిక వెట్టి యిట్లనియె. | 8 |
| చ. |
అది యొకఁ డేల? కౌరవ చయంబు జయాశ యడంగి పోవ బె ట్టిదుఁ డగు భీమసేనుఁడు గడింది మగంటిమి దుస్ససేను దు ర్మద మడఁగించి పేరురము వ్రచ్చి మహోగ్రతఁ ద్రావె నెత్తు ర య్యది దుది నింత వుట్టు నని యాప్తజనంబులు మున్న చెప్పరే? |
9 |
| తే. |
కొడుకులంత రాజ్యంబును గొనఁగ శక్తు | లను దురాశను వారల యవినయములు నీ వుపేక్షింతు; మానునే? యా విరుద్ధ | కర్మమున ఫలమొందక కౌరవేంద్ర! |
10 |
| వ. | అనిన విని, యాంబికేయుండు, దుర్యోధనుండును దెగియెన కాఁదలంచి, విహ్వలించి, మూర్ఛిల్లినం; దల్లడిల్లి, యార్తనాదంబులతో వివశంబులయి, వనితాజనంబులు గన్నీరుగ్రమ్మ, వసుంధర నొఱగిన; నంతకుమున్న వచ్చియున్న విదురుండును, నా సూతనందనుండును జేరి, చేసేత, శీతల జలసేచన మృదువ్యజనవీజనంబుల నన్నరనాథుని, నారీ సముదయంబును సేదదేర్చిన; నాసీనుండై యతండు దీర్ఘ నిశ్వాసంబు లడరం జింతిల్లి. యంతర్గతంబున దైవంబు గర్హించి, పాండవుల నగ్గించి, తన బుద్ధియు, శకుని వెరవును నిందించి; తన్నుందాన యుపశమించుకొని, ధైర్యంబు సిక్కంబట్టి. | 11 |
| క. |
‘తెలియ విన నీవు సెప్పిన | పలుకులు దుర్యోధనుండు వడఁడు గదా? వై రుల విక్రమమున సంజయ! | కల రూపెఱుఁగంగఁ జెప్పు క్రమ్మఱ నాకున్’. |
12 |
| చ. |
అనుటయు నాతఁ డిట్లనియె ‘నమ్మనుజేంద్రున కాజిఁ గర్ణుఁడుం దనయులుఁ దమ్ములుం బడిరి దారుణ విక్రమకేలి సల్పి నె ట్టన బలుపారఁ బట్టి వికటంబుగ వక్షము వ్రచ్చి దుస్ససే నుని రుధిరంబు మారుత తనూజుఁడు ద్రావె మదం బెలర్పఁగన్’. |
13 |
| క. |
అనిన విని ‘యంత కేమియు | నన కూరకయుండు సంజయా! నీ మాటల్ విననేరదు విభ్రాంతిని | మునిఁగినయది చిత్త’ మని విమూఢాత్మకుఁడై. |
14 |
| వ. | ధృతరాష్ట్రుండు మ్రానుపడి యుండి కొండొకసేపునకు సేదదేఱి యాసూతనందనున కిట్లనియె. | 15 |
| క. |
‘నా దుర్ణయమునఁ జేసియు | నా దుర్యోధనుని బుద్ధిహాని వలననుం గాదె? యిటులగుట మర్మ వి | భేదన మగు శోకమింత పెల్లయి యున్నే! |
16 |
| వ. | దుఃఖంబు నిస్తరింపనోపుదునొకో యని తలంచుచున్న నాదు సంశయంబు వాయ నింతకు మున్ను కయ్యంబునం గడచనిన మనవారిని వారి వారిని నేర్పడం జెప్పు’ మనిన నతనికి సంజయుం డిట్లను; ‘మనయందు భీష్మ ద్రోణ కర్ణ వికర్ణ వృషసేన దుశ్శాసన లక్ష్మణాదులును వారలలోన విరాట శతానీక ద్రుపద ఘటోత్కచాభిమన్యు పాండ్యప్రముఖులును బేరువేర నిట్టిట్టి వారిచేత నిట్టిట్టి వారు దెగి’ రని యేర్పడ నెఱింగించిన, నమ్మహీపతి ‘గురుసేన నింక నెవ్వరు గల’రని యడుగుటయు నతండశ్వత్థామ కృతవర్మ శల్య శకుని కృపాచార్యులం బేర్కొని బ్రదికియున్న కురుకుమారులను గర్ణు కొడుకులలో నున్న వారలను మరియుంగల యోధులను జెప్పి వీరలంగొని యనికి నుత్సహించి పొనుఁగువడ్డ యగ్గి వేఁడిమి వోని వాఁడిమితో దుర్యోధనుండు ధైర్యంబవలంబించి జయార్థియై యున్నవాఁడనిన విని కొడుకుకడిమికి వెడవెడ యూఱడిల్లిన యుల్లంబునం దనవారు పెక్కండ్రు వొలిసిన యలమట మునింగి యొక్కింత ప్రొద్దూరకుండి రాధేయుదెగుట దలపోసి యమ్మనుజనాథుండు. | 17 |
| తే. |
‘ఆలలోని యాఁబోతును బోలె నొప్పు | గురు బలంబులో నున్మదద్విరదమూర్తి సింహసంహననుండు నిస్సీమ విక్ర | మాభిరాముండు వోయెనే? యక్కటకట!’ |
18 |
| వ. | అని తొడంగి హాహాకారంబు లెసంగ రోదనంబు సేయుచు. | 19 |
| క. |
‘సంజయ! మురభంజనుని ధ | నంజయునిం జీరికింగొనఁడు కర్ణుం డిం ద్రుం జెనకియైన గెలుతు న | నుం జచ్చెనె? యట్టివాఁడునుం గయ్యమునన్. |
20 |