| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
నరుఁడు దీవ్రశరార్చులు వరఁగఁ జేయఁ | గలఁగి హతశేషసంశప్తకవ్రజంబు పలుగడల విచ్చుటయుఁ బొగ వాసి మెఱయు | నగ్నియునుబోలె వెలుఁగొందె నాతఁ డధిప! |
180 |
| ఉ. |
కౌరవరాజు ధర్మజుఁడు గయ్యము సేయునెడం గడంకమైఁ గౌరవరాజు ధర్మజుని కాయమునన్ నవసాయకంబులన్ సారథిమేన నొక్క పటుసాయకమున్ నిగిడింప నాతఁడు న్ఘోరతరాక్షుఁడై యతని నొంచెఁ ద్రయోదశసాయకాహతిన్. |
181 |
| వ. | నొంచి తోడన. | 182 |
| తే. |
తునియలుగఁ జేసె హరులఁ జతుశ్శరముల | సూతుఁ బంచమమున ఘనకేతుయష్టి షష్ఠమునఁ జాపదండంబు సప్తమమున | నలిగి యెత్తిన కరవాల మష్టమమున. |
183 |
| క. |
ఆలోనన యజ్జనపతి | వాలికనారసములైదు వక్షమున వడిం గీలించి ధైర్యసారముఁ | దూలించినఁ దొలఁగి నీ సుతుం డిల కుఱికెన్. |
184 |
| చ. |
వికలరథ ప్రయత్నుఁ బృథివీపతిఁ గన్గొని ద్రోణపుత్ర క ర్ణ కృపులుఁ దక్కునుం గలుగు నాయకులున్ రయమార వచ్చి కూ డికొనుట సూచి యెంతయు వడిం జనుదెంచిరి ధర్మసూను పొం తకు సముదగ్రులై యతనితమ్ములు సంగరకౌతుకమ్మునన్. |
185 |
| వ. | ఇ త్తెఱంగున నపరాహ్ణంబున దొరలమొత్తంబు లొక్క దెసకుం దార్కొనిన నుభయబలంబులు నురవడించి కలయన్ బెరసినం గ్రందుకయ్యంబయ్యె నందుఁ జిందంబుల మ్రోఁతయు నార్పుల యులివును బాణ కృపాణాదిహేతి సంఘట్టనంబునం బుట్టు రణనంబును రథావయవాస్థికపాలభంజనంబున నెసంగు నినదంబునుం గూడి పరఁగిన దిక్కులు పిక్కటిల్లెఁ గరులకొమ్ములం జిక్కివ్రేలు తురంగంబులును సందుకొని సొచ్చిన సుభటులు సెరివిన నొఱగి కూలు శుండాలంబులును నాశ్వికుల మొగంబునంబడి లులాయంబులు సొచ్చిన సరోవరంబుల చందం బగు కాల్బలంబులును రథికులు వోక పెనంగిన నఱవఱలయిన యరదంబులును నెత్తురు కాలువలును గండల తిట్టలును బ్రేవుల ప్రోవులును నెమ్ముల రాసులును నత్యంత రౌద్రంబు నావహించె’ ననుటయు నాంబికేయుండు. | 186 |
| చ. |
‘సమరము పెంపు సెప్పెదవు సంజయ! చెప్పవు నీవు మీమహీ రమణుని భంగి ధర్మజుశరంబులచే విరథత్వ మొంది మా నముఁ జలముం దెగం దొలఁగెనా? మగుడం బురికొంట లేదె? ని క్కము సెపుమా! తనూజు భుజగర్వవిహీనత నొంచెఁ జిత్తమున్.’ |
187 |
| వ. | అనిన నాసూతనందనుం డమ్మానవపతి కిట్లనియె. | 188 |
| తే. |
‘విరథుఁ డయ్యెన కాని యవ్వీరుఁ డాహ | వంబు దక్కక యొండురథంబు వన్ని కొని సముద్ధతివచ్చి సక్రోధమైన | మనముతో సూతునకు నిట్టు లనియె నధిప! |
189 |
| ఆ. |
‘తెల్ల సీవిరులును వెల్లనిగొడుగు నై | యల్లవాఁడె పాండవాగ్రజుండు మెఱసియున్నవాఁడు వఱపు మచ్చోటికి | రథము ఘోటకములరయము మెఱయ.’ |
190 |
| వ. | అనుటయు నతండు నట్లచేయ నయ్యుధిష్ఠిరుండు నిజసారథి నాలోకించి యహికేతుమహితంబై వచ్చుచున్న ధృతరాష్ట్రనందన స్యందనంబునకు సమ్ముఖంబుగా మనరథంబు నడపుమనుటయు నాతం డవ్విధం బాచరింప నయ్యిరువు రతిరథికులకుఁ బ్రకట ప్రధనంబయ్యె నట్టియెడ. | 191 |
| సీ. |
పాండవు చాపంబు ఖండించె నీ కొడు | కొండొక ధనువెత్తి యుఱక యాతఁ డక్కురునాథువిల్ గ్రక్కునఁ దునుమాడె | నతఁడు వేఱొక వింటనతని నేయ నయ్యుధిష్ఠిరుఁడు నానాస్త్రంబు లేసిన | నాచ్ఛాదితంబయ్యె నంబరంబు వారొండొరుల రక్తధారాప్లుతులఁ జేసి | ఫుల్లకింశుక భంగిఁ బొలిచి రేచి |
|
| ఆ. |
ఘోరశక్తి వైచెఁ గౌరవపతి యది | నడుమఁ దునిమి ధర్మనందనుండు నొంచె నిశితవిశిఖపంచకమ్మున నమ్మ | హీశు నురము దర్పమెసకమెసఁగ. |
192 |
| వ. | ఇట్లు కౌంతేయముఖ్యుచేత నొచ్చియు గాంధారీ నందనుండు. | 193 |
| చ. |
బరవసమొప్పఁ గ్రూరనవభల్లవిదారితుఁ జేసె నమ్మహీ శ్వరు నతఁ డల్గి బల్పిడుగుచాడ్పు శిలీముఖ ముచ్చిపోవ న క్కురుపతి నేయఁ గయ్యమునకుం దుది యప్పుడ చేయువాఁడుగా నరదము డిగ్గె నాతఁడు గదాకలనోద్భట బాహుదండుఁ డై. |
194 |
| క. |
డిగి రయమునఁ గదిసిన నా | జగతీపతి యేచి యుగ్రశక్తి నురము బె ట్టుగ వైచిన నీతనయుఁడు | మగుడఁగ రథ మెక్కె వింటమార్కొనువాఁడై. |
195 |