పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ప్రథమాశ్వాసము
దుర్యోధనుఁడు ధర్మజునితో యుద్ధముచేసి మూర్ఛిల్లుట (సం. 8-20-30)
క. అత్తఱిఁ గడుఁ బెల్లుగఁ గ్రొ | న్నెత్తురు వడియుటయు నతఁడు నిర్భరమూర్ఛా
యత్తుఁడగుడుఁ గృతవర్ముఁ డు | దాత్తత నెడసొచ్చె బాహుదర్పము నెఱయన్‌.
196
ఉ. ఆతనిఁ దాఁకె వీఁక ననిలాత్మజుఁ డప్డు బలంబు మారుతో
ద్ధూతపయోధివోలె వడిఁ దోడ్పడియెం గృతవర్మ కంత ను
ద్ద్యోతితభంగి వచ్చి విజయుండు వెసం దునుమాడె లీలమైఁ
జేతులతీఁటవోవ రథసింధురవాజి భటోత్కరంబులన్‌.
197
వ. అంత. 198
క. కురుపతి దెప్పిఱి బాహు | స్ఫురణంబు దలిర్ప నింద్రజుని మార్కొని ని
ష్ఠురవివిధవిశిఖవినిహత | శరీరుఁ జేయుటయు నతఁడు సక్రోధుండై.
199
తే. కార్ముకముఁ గేతువును ఘోటకముల సూతు | వెడఁదబలుతూపులేడింటఁ బుడమిఁ గూల్చి
భల్ల మొక్కట నతని పెన్విల్లు దునిమి | ప్రాణముల్‌ గొనఁ జాలెడు బాణమేసె.
200
క. కని యాఱమ్ముల నెడ నది | దునియలు గావించె గురుసుతుం డాతని వి
ల్లును హరులఁ దునిమి పార్థుఁడు | దను మార్కొను కృపుని చాపదండము ద్రుంచెన్‌.
201
చ. వడిఁ గృతవర్మ దాఁకిన నవారణఁ దద్ధనువున్‌ హయంబులున్‌
సిడమును రూపుమాపి విలసిల్లి యెదిర్చిన దుస్ససేనువిల్‌
నడిమికిఁ ద్రుంచి గాండివగుణధ్వని దిక్కులు పిక్కటిల్ల నె
క్కుడు మదమొప్పఁ గర్ణుదెసకుం జన నా రథికుం డుదగ్రుఁడై.
202
క. అన్నరుని మూఁడు శరముల | వెన్నుని నిరువదినిశాతవిశిఖముల వెసన్‌
భిన్నాంగులఁ జేసి విజయు | మున్నేసినయన్ని బాణముల బిట్టేసెన్‌.
203
వ. అంతకు మున్ను సాత్యకితోడం బోరిపోరి యారాధేయుండు దనదెస కడరిన కవ్వడిం గని యక్కడ మొగం బయి యిటుపరాక్రమించినం జూచి యేచి యా సవ్యసాచి కడ్డపడి యక్కేశవానుజుండు. 204
తే. నవతిశరముల నవమార్గణముల శత శి | లీ ముఖంబుల నేసి దోర్లీల మెఱయ
సారథి ధ్వజహయరథసహితముగ ను | దీర్ణదర్పుఁడై కప్పె నక్కర్ణుఁ డధిప!
205
వ. అప్పుడు యుధామన్యుండును శిఖండియు ద్రౌపదేయులు నుత్తమౌజుండును యుయుత్సుండును గవలును ధృష్టద్యుమ్నుండును జేకితానుండును బ్రభద్రకచేది కరూశ మాత్స్య కేకయవత్సబలసమేతంబుగా ధర్మనంద నోత్సాహదీపితాటోపశోభితులయి కవిసి వివిధాస్త్రశస్త్ర వాతము లూసూత సూనుపయి నడరించిన నవ్వీరుండు. 206
మ. అవి వేగంబ మరల్చి భూరిపవనవ్యాపారనిర్శర్దితా
టవులం బోలఁగఁ జేసి దంతిభటఘోటస్యందనశ్రేణులన్‌
దివిజవ్రాతము పిచ్చలింప రభసోద్రేకంబు రౌద్రంబుఁ బెం
ప విజృంభించె ధనుర్గుణధ్వని నభోభాగంబు భేదింపఁగన్‌.
207
మ. కని గాండీవధరుండు దర్ప మెసఁగం గర్ణాస్త్రజాలంబు నీ
సున వారించి శిలీముఖార్చులు పరిస్ఫూర్జత్ప్రభం బర్వఁ బే
ర్చినఁ గార్చి చ్చడరన్‌ మృగంబులు భయోద్రేకంబునం బాఱు చా
డ్పున నీమూఁకలు నల్గడం బఱచె నుద్భూతభ్రమార్తంబులై.
208
వ. అంత నంశుమంతుం డపరగిరియవులకుం జనుటయు ధరాధూళికిఁ దోడు సంధ్యారాగ మిళితంబైన తిమిరంబు గవిసిన నెద్దియుం గానరామిం జిత్తంబులు గలంగ రాత్రి యుద్ధంబునకు నోహటించుటంజేసి మన దొరలఁ బాండవసైనికులు దఱిమినం దాల్మి వాటింపక తిరిగిపోయిరి. జయంబుసేకొని వీరి నవ్వుచు వారు గవ్వడిం గమలనాభునిం బ్రశంసించుచుం జని రవ్విధంబున నుభయసైన్యంబులు నిజశిబిరంబుల కరిగి విశ్రామంబు నొందె’ నని చెప్పుటయు సంజయునకు ధృతరాష్ట్రుం డిట్లనియె. 209
ఉ. ‘తెల్లము మిమ్ము నందఱ వధింపఁగ నయ్యమరేంద్రనందనుం
డొల్లక పోక వాఁడు దన యుగ్రత సూపెద నన్న మీమహీ
వల్లభు వారి కేల? యమవహ్నుల కైనను రూపుతోడఁ బోఁ
జెల్లదు గాన తద్భుజవిశేషము రూఢము గాదె సంజయా!
210
సీ. యాదవ వీరచయంబు నాటోప స | ముద్రేక ముడిపి సుభద్రఁ దెచ్చె
ఖాండవం బాహుతిగా లీల నొనరించి | సప్తార్చి నత్యంత తృప్తుఁ జేసె
శబరవేషముఁ దాల్చి చనుదెంచి తొడరిన | శివునితోఁ బెనఁగి మెచ్చించె నతని
గంధర్వుచేఁ బడ్డ కౌరవసత్తము | విడిపించె లావును వెరవు మెఱయఁ
 
ఆ. గాలకేయకులముఁ గాలునిప్రోలికి | ననిచె నఖిల నృపుల ననికి నియ్య
కొలిపెఁ గ్రీడి జగము గొనియాడ నేక కో | దండ చండ విలసితమునఁ గాదె!
211
వ. కావున మనవారికి నోటమి యక్కిరీటి వలనం గలిగె నను కలుచ వారి గర్హింపం దగ దట్టి జెట్టితోడం బెనంగుటఁ బ్రశంసకుందగుదురు పదంపడి వారేమిసేసి’ రనిన ధృతరాష్ట్రునకు సంజయుం డిట్లనియె. 212
ఆ. అట్లు దివిసిపోయి యాటుఁ బోటు నొడళ్ళఁ | గలయఁ గలిగి డప్పి గదిరి సొలయు
దొరలుఁ దాను నపుడు దుర్యోధనుఁడు విచారాభి యుక్తినున్న యవసరమున.
213
వ. పార్థుదెసఁ బలుకుపుట్టినం గ్రోధంబున నూర్పులు సందడింపఁ గర్ణుఁడు భగ్నదంష్ట్రంబయి విషంబులేని భుజంగంబునుం బోల్పం దగి పరాజయంబు నొంది దీనదశకు వచ్చియున్న యారథిక వరులం గలయం గనుంగొని కౌరవేశ్వరున కిట్లనియె. 214
ఆ. ‘అలవు వెరవుఁ దలఁపఁ గలఁ డితం డన వాసి | కెక్కి నట్టి రథికుఁ డక్కిరీటి
వలయు నెడల నతని వాసుదేవుండు బో | ధించు నెల్ల తెఱఁగుఁ దేటపడఁగ.
215
క. అనిమిషనాథుం డిచ్చిన | ఘనశక్తికి నసుర నొడ్డి గాండివిఁ దొలఁ గిం
చిన హరి వంచన పదపడి | మన మెల్లను దెలియ వినమె? మనుజాధీశా!
216
క. అగుఁగాక యతని నాతని | మగఁటిమియును నేర్పునెల్లి మాన్చెద నీ కుం
బగ యనియెడు మాటయు ని | జ్జగమునఁ గలుగంగనీను జగతీనాథా!’
217
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )