పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ప్రథమాశ్వాసము
దుర్యోధనుఁడు శల్యునకుఁ ద్రిపురాసురుల వృత్తాంతంబు సెప్పుట (సం. 8-24-1)
క. ‘దమమున నియమంబున ను | త్తమమును ఘోరంబు నైన తప మతినిష్ఠం
బ్రముదితులై చేయఁగ న | క్కమలభవుఁడు దోఁచి పరమకారుణ్యమునన్‌.
258
వ. ‘వరంబులు గోరికొం’ డనవుడు వారందఱు ‘నొక్కమాటయకా సకలభూతంబులవలనను సర్వకాలంబుల యందును నవధ్యత్వంబు మాకు నీయవలయు’ నని యడుగుటయు నయ్యజుండు. 259
క. ‘ఆ చంద మెందుఁ గల దది | గోచరమే? యిచ్చుటకును గొనుటకుఁ దగుమై
సూచి యడుగుండు శుభదం | బై చెల్లెడునట్లుగాఁ బ్రియంబున నిత్తున్‌.’
260
వ. అనవుడు నయ్యసుర ‘లట్లేని మాకు మువ్వురకు మూఁడు పురంబు లెల్ల సుఖంబులుం గలిసి కామగమనంబులై దేవదానవ యక్షోరగాది జాతులకుం జెఱుపరాక విలసిల్లునట్లుగా నొసంగు మేము భవత్ప్రసాదంబు సొంపున నిర్భయులమై పెంపొంది సంచరించెద’ మనుటయుఁ బద్మభవుం ‘డిది లెస్స దీనికిఁ దుది యిట్టిద’ యని నుడివి ‘యట్టిది గాకుండ నప్రమత్తులరై వర్తిలుం డనిన నద్దనుజేంద్రు ‘లప్పురంబు లప్పు డొక్కెడం గూడెనప్పుడు బలియుండగువాఁడు సెఱుపం దలంచినం జెడునదిగా నొడంబడితిమి త్రిపురంబులు సంగతంబులు గాకున్న నసాధ్యంబులై వెలయువలయు’ నని పల్కిన న ద్దేవుండు ‘మీరు పురత్రయంబును సంపాదించుకొనుం డే నమ్మహానుభావంబులం బొందునట్లుగా నిచ్చితి నని నిజస్థానంబునకుం జనియె నిత్తెఱంగున.’ 261
తే. వరము వడసిన యాదైత్యవరులు దమకుఁ | బురము లొనరింప దానవపూజ్యు మయుని
వేఁడికొనుటయు నాతఁడు విపులతపము | కలిమి నొప్పారు పురవర్మములు ఘటించె.
262
వ. అవియుం బ్రాకార గోపురప్రాసాదప్రముఖ వివిధావయవంబులు పసిండియు వెండియు నినుమును నై నాలుగు దిక్కులు నూఱేసి యోజనంబులు గలిగియుండు నందుఁ బసిండిం జేసినయది దివంబునను వెండి నొనరించినయది యంతరిక్షంబునను నినుమునం గావించినయది భూమిని సంచరింపను వరుసన వానికిం దారకాక్షుండును గమలాక్షుండును విద్యున్మాలియు రాజులయి దివ్యంబులగు నంబరంబులను నాభరణంబులను మాల్యానులేపనంబులను మఱియు ననేక విధంబుల నుజ్జ్వలులై నెగడుదు రిట్లు పురత్రయ విహారంబున జగత్త్రయంబును నాక్రమించి యసురత్రయం బప్రతిహత విభూతిమై వర్తించు నమ్మువ్వురుం దన్ను నాశ్రయించుటం జేసి వారల యోగక్షేమంబు లరసికొని యెవ్వరికి నెయ్యది యిష్టం బయ్యదియెల్లం దన మాయా బలంబున మయుం డొదవించుచుండు నవ్విధంబునఁ బరమసౌఖ్యంబు లనుభవించుచుండ బహుకోటి సంవత్సరంబులు సనియె నట్టియెడ. 263
సీ. తారకాక్షున కొక్క తనయుండు హరియన | జనియించి వారిజాసను గుఱించి
తపము సేయంగఁ బ్రత్యక్షమై యద్దేవుఁ | డడుగుము వరమన్న నతఁడు త్రిపుర
ములవార లాయుధంబులు దాఁకి చచ్చినఁ | బీనుఁగుల్‌ నీరలోఁ బెట్టి తడుప
నొక్కఁడు వదుగురై యెక్కుడు లావును | బీరంబు మెఱయ సంప్రీతి నుల్ల
 
ఆ. సిల్లునట్టి బావి చిరతరతోయమై | మా పురములఁ జిత్ర మహిమ వెలయ
నావహిల్ల వలయు ననిన నిచ్చితి నని | యమ్మహాత్ముఁ డరిగె నదియుఁ గలిగె.
264
వ. ఇట్లు మహా ప్రభావంబైన యబ్బావి వడసి యప్పురంబులవారు పోరికి శంకింపక నిర్జర భయంకరులగుచు భువనంబులన్నియు బాధించుచుం బెఱిగి లోభమోహావశతం బొంది విచ్చలవిడిం దిరుగం దొడంగిన దేవ పితృమునిజనస్థానంబులకు హానిపుట్టినం బురందరుం డఖిల బృందారకులుఁ బరివేష్టింప నప్పురంబులపై నెత్తిచని పెనంగి భేదింపంజాలక విషణ్ణుండయ్యె నంత నతండు దివిజులుం దాను సంయమి సహితుండై చతురానను పాలికిం బోయి ప్రణామపూర్వకంబుగా నద్దానవుల తెఱంగెఱింగించి తద్వధోపాయం బడిగిన నతండు వారల కిట్లనియె. 265
ఉ. ‘ఏచిన యా పురత్రయము నేకశరంబున రూపుమాపఁగాఁ
జూచినఁ బోవుఁగాని పెఱచొప్పునఁ బోవదు సంగరోన్ముఖుం
డై చనుదెంచె నేని మదనాంతకుచే నదిసెల్లు నొండ్లకు
న్గోచర మెట్లగుం? జనుఁడు గొబ్బున నమ్మహితాత్ము పాలికిన్‌.’
266
ఆ. అనిన నట్లకాక యని దివ్యవర్ష స | హస్రకంబు వారలధిక నిష్ఠ
నతుల తపముసేసి యత్యంత శుద్ధాత్ము | లై మహేశుకడకు నరుగునపుడు.
267
వ. అ వ్విరించి బ్రార్థించి పురస్సరుం జేసికొని యరిగి. 268
క. వరదు శరణ్యు శశాంక | స్ఫురితశిరోభాగు సర్వభూతేశ్వరు శం
కరు సాంఖ్యయోగ నిష్ఠా | పర సులభు ననంగదమనుఁ బరమాత్ము శివున్‌.
269
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )