| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘సత్యవ్రతంబును శాత్రవదుర్దశా | పాదనంబును మహాభాగతయును నీకు నైజంబులు నాకుఁ బెద్దయుఁ గూర్తు | గావున ని న్నేను గారవించి వినతుండనై వేఁడికొనియెద రాజుల | నడుమ నీ దగు సౌమనస్య మెఱిఁగి యర్జును ననిఁ దెగటార్పఁగ వలయుట | యూహించి సంభృతోత్సాహలీలఁ |
|
| ఆ. |
గావు మితని ననుచుఁ గర్ణునిఁ జూపి యీ | తనిరథంబు గడపు మనఘ! యిట్టు లైన నితఁడు వగఱఁ బో నీక పొదివి య | స్ఖలితగతుల నొంపఁ జంపఁ జాలు. |
245 |
| చ. |
గురుఁడును భీష్ముఁడుం జనినఁ గొంచెపు మూఁకలతోడ నేను సం గరవిజయంబు గోరి భుజగర్వమునన్ సడిసన్న పాండుభూ వరసుతవర్గముం దొడరువాఁడనకా మది నిశ్చయించు టె వ్వరిఁగొని యింత నీ వెఱుఁగవా? నినుఁ గర్ణునిఁ గాదె? నమ్మితిన్. |
246 |
| క. |
ఇ మ్మివ్వరమ్ము సార | థ్య మ్మితనికిఁ జేయు మినున కరుణుఁడు సాహా య్య మ్మొనరిచినట్లుగఁ దిమి | రమ్ము క్రియన్ రూపుసెడి యరాతు లడంగన్. |
247 |
| క. |
అనిన విని కెంపుసొంపునఁ | గనుఁగవ యుగ్రముగ బొమలు గదియఁగ ఫాల మ్మునఁ జెమటవొడమ నీ సుతుఁ | గనుఁగొని యిట్లనియె నతఁడు కటము లదరఁగన్. |
248 |
| సీ. |
‘ననునింత నీచపుఁ బనికిఁ బంపఁగ నీకుఁ | దగునె? భూవర! వర్ణధర్మవిధము లెఱుఁగవే? శూద్రుల కే నాఁటఁ బరిచర్య | సేసిరి? మూర్ధాభిషిక్తులైన రాజులు సూతజు రాధేయు దొరఁజేసి | కొని యేను సారథ్యమునకుఁ జొరఁగఁ జాల నీతని బలశాలిగాఁ దలచెదు | నాకంటె నిట్టిబన్నంబుఁ గలదె? |
|
| ఆ. |
పగఱలోన నొకనిఁ బాల్పెట్టు మెట్టి వాఁ | డైన సమయఁజూచి యరుగువాఁడ నట్టిభంగి సాలదంటేనిఁ దరవాయి | గొని వధింతు శత్రుకోటి నెల్ల. |
249 |
| క. |
విను మేను విక్రమింపఁగఁ | గనుఁగొనియెడునంతవాఁడుఁ గలఁడే? కులశై ల నికాయంబు వగల్తును | వననిధులు గలంతు ధరణి వ్రత్తుం గలయన్. |
250 |
| చ. |
నరవర! చూడవే తెలియ నాదగు బాహులు మద్బలంబు నీ వరయక పల్కితే నొకని కక్కట! సారథినై రథిత్వ వి స్ఫురణము దక్క నోపుదునె? సూతతనూజుఁడు షోడశాంశమున్ దొరయఁడు నాకు వాసవసుతున్ మురమర్దనుఁ జీరికిం గొనన్. |
251 |
| వ. | ఇట్లగుటెఱుంగక చెప్పితి వెఱింగియుం గర్ణుపక్షపాతంబున నన్నవమానించెదేని మా భూమికింబోయి వచ్చెద’ నని పలికి రాజమధ్యంబున నుండి వెడలిపోవం జూచినం గురుపతి సప్రణయబహుమానంబునం జని నిలువరించి సాంత్వన స్వరంబున ‘మధురాక్షర విన్యాసంబుగా నతనితోఁ ‘గర్ణుండ యేల తక్కునీకెక్కుడయిన రథికులుం గలరే? కడిందిపగఱకు హృదయశల్యం బగుటఁగాదె! నీకు శల్యుండను నభిధానంబయ్యె నాయభిప్రాయంబు వినుము ధనంజయునకు రథికగుణంబులం గర్ణుండు మిక్కిలి కృష్ణునకు నశ్వహృదయజ్ఞానంబున నీ వధికుండవు ధనంజయునకుఁ బ్రతివీరుంగా మనము కర్ణుం జాలించితి మది కృష్ణుండు సెల్లనీ కునికిం జేసి కృష్ణువర్తనంబునకుఁ బ్రతివిధానం బాచరింప నిన్నుం గోరితి నింతపని నీకుందక్క నొరులకు శక్యం బగునే’ యనిన విని ముదిత హృదయుండయి మద్రేశ్వరుండు. | 252 |
| క. |
‘ననుఁ గృష్ణుకంటె నధికుం | డని యిమ్మనుజేంద్రకోటి యాకర్ణింపం గొనియాడితి విమల యశో | ఘనుఁ డగు కర్ణునకు రథము గడపెద నధిపా!’ |
253 |
| వ. | అని యా సూతనందను నుద్దేశించి వెండియు నిట్లనియె. | 254 |
| క. |
‘జనవల్లభ! యొకసమయము | విను మీతనితోడ నేను విచ్చలవిడిఁ దోఁ చిన మాట లెల్ల నాడుదు | నను నెగ్గులు వట్ట కుండినం బొం దొనరున్.’ |
255 |
| క. |
అనుటయు గారవమున నీ | తనయుఁడు రాధేయుఁ జూచి తగు ని ట్లగుఁగా కని పలికి శల్యునిం గనుఁ | గొని యిది గడులెస్స యనియెఁ గురువంశనిధీ! |
256 |
| వ. | ఇట్లభినందించి యన్నరేంద్రుం డమ్మద్రపతి మనం బురియాడునో యని శంకించి యతనితో మఱియు నిట్లను ‘నివ్విధం బాచరించుటకు విచారంబు వలవదు తొల్లింటి పెద్దల వృత్తాంతంబు వినుము మార్కండేయ మహాముని మాతండ్రి కేను వినుచుండఁ జెప్పినయది నీకుం జెప్పెద సురలతోడి దురంబున నసురవరుండగు తారకుండు దెగిన పిదపఁ దదీయ తనయులు విద్యున్మాలియుఁ దారకాక్షుండును గమలాక్షుండును నను వారలు వారిజాసను నుద్దేశించి. | 257 |