పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
కాకము హంసముతో సముద్రముమీఁదఁ బఱచి భంగపడుట (సం. 8-28-27)
వ. అనుటయు విని ము న్నాహూతం బైన హంసం బక్కాకంబు నాలోకించి. 62
ఆ. ‘నూఱుగతుల నీవు వాఱుదే నన్నియు | నెఱుఁగఁ బులుఁగు లెల్ల నెట్లు వాఱు
నడరి యాకసమున నిడుబాట నట్ల పా | ఱుదము రమ్ము జలధి చదల’ ననిన.
63
వ. అయ్యెడం గూడిన కాకంబు లపహసించి ‘శతప్రకారగతి యగు దీనితో నేకయాన పర్యవసానహీన సముత్సాహ దోహలి వగు నీ వెట్లు మచ్చరించెదవు; పఱచి భంగపడియెదవు గాక’ యనుటయు, నమ్మరాళం బా గమిం బాసి పఱవఁ దొడంగినం దోన యవ్వాయసంబునుం బఱచె; నిట్లు రెండును మున్నీటిపై మిన్ను దఱిసి పాఱునట్టియెడ. 64
క. రాయంచ మందగతిఁ జను | వాయస మతితీవ్రభంగి వలను మెఱసి లీ
లాయితము లొప్ప బహుగమ | నాయాసము నొంది పఱచు నగ్గలిక మెయిన్‌.
65
ఆ. ఎలమిఁ గడచి పోవుఁ బిలుచుఁ గ్రమ్మఱి వచ్చి | ముక్కు ముక్కు మీఁద మోపుఁ జుట్టు
నేచి తిరుగు నీఁక లీఁకలతో రాయు | నోరయుఁ జిత్రగతుల మురియు నవ్వు.
66
వ. ఇ వ్విధంబునం గాకం బనేక ప్రకార ప్రసరణ చతురంబై సంచరించుటం జూచి ముదితంబు లైన వాయసంబు లధిక స్వరంబుల మెఱయుచు హంసంబుల గేలికొని నవ్వుచుఁ దరువులపయిం ద్రుళ్లి త్రుళ్లి యాడుచు ‘మరాళంబు పరాభవంబుఁ బొందెడుఁ జూడుం’ డని పెద్ద యెలుంగునం బలుకుచుండఁ దదీయ కలకలం బాలించి హంసంబు భరితోత్సాహం బై. 67
క. పొడవునకు నెగసి యెప్పటి | పడమటి దెస నిగిడి పెలుచఁ బఱచినఁ గూడం
గడు రయమునఁ జని యంచం | గడవంగా కీలకఱచి కాకము పాఱున్‌.
68
వ. పాఱిపాఱి డయ్యుటయు నయ్యంచ యుదంచిత త్వరితగమన కళా వైదగ్ధ్యంబు మెఱయం బఱచిన బీఱువడి కాకం బాకులాంతరంగంబును వికలాంగంబును నై యిట్లని వితర్కించు. 69
క. ‘నేరక తొడరితిఁ గాల్కొన | భూరుహములు లతలు గిరులుఁ బొద లేమియు లే;
వారయ బహుసత్త్వ మయము | వారిధి డిగి సోఁకినపుడ వలయుం బొలియన్‌.’
70
వ. అనుచు దీన మానసం బయి భయంబునం గలంగి డప్పి సొగసి యవశత నంతకంతకు డిగుచున్న యక్కాకిం గనుంగొని కలహంసం బి ట్లనియె. 71
ఆ. ‘నీ వనేకగతులు నే ర్తిది యే గతిఁ | జనుట చెపుమ వాయసంబ! యేను
గడవ నరిగి పిలువఁగా నేల తడసెద? | వెఱక లేటి కిట్టు లెడల విడువ?’
72
వ. అనియె నట్టియెడ. 73
క. తలకొని జలములు పక్షం | బులు దుండము దోఁక సోఁక బొరిఁబొరి నెగయన్‌
బలమఱి మెయి దిగఁబడఁగా | సొలసి యెగయలేక వాయసుఁడు వెగడొందెన్‌.
74
వ. ఇట్లు మున్నీటి నీటి పయింబడి యగ్గలం బగు దురవస్థకు బెగ్గలంబు నొందు కాకంబు నాలోకించి ‘పలుకనగుం గాక; పలికినట్ల యెవ్వరికిఁ జేయఁ దీరుఁ? బని తీరెంగదా’ యనిన రాయంచకు న క్కాకం బి ట్లనియె. 75
క. ‘ఎంగిళులు గుడిచి క్రొవ్వునఁ | బొంగిన మెయితోడ గర్వమునఁ దిరుగుచు నా
కుం గలదె యెందు నెదురు? వి | హంగమ పతి నైన గెలుతు’ నని మును దలఁతున్‌.
76
క. నా కొలఁది యిప్పుడెఱిఁగితి | నీ కరుణాలోకనంబు నిగిడించి శర
ణ్యా! కావు నన్ను; మగుడం | గాకులలోఁ గలుపఁ దగవు గాదే నీకున్‌?’
77
వ. అని యిత్తెఱంగున. 78
క. ఆకులతఁ బొంది పలుకుచుఁ | గా కా యని చంచుఁ దెఱచి కడు నఱచుచు నీ
రాకరమున మునిఁగెడు న | క్కాకిం గని హంస పరమకారుణ్యమునన్‌.
79
క. వెరవునఁ దత్తనువుం దన | చరణంబుల నిఱికి యెత్తి చా వుడిపి బల
స్ఫురణంబు మెఱయ వీఁపున | ధరియించుచు వచ్చెఁ బక్షితతులు నుతింపన్‌.
80
వ. ఇవ్విధంబునం దెచ్చి యెప్పటి నెలవున డించి, రాయంచ యక్కాకి దెప్పిఱిన, దానితో నచ్చటి కాకులు విన ‘నింక నిట్టి యవినయంబు లెన్నండును జేయకు’ మని పలికి నిజ సహచరంబు లగు మరాళంబులుం దానును వలయు చోటికిం జనియె; నీవు నా కోమటి కొడుకుల యెంగిలి కూటం బెరిఁగిన యక్కాకంబు చందంబునఁ గురుకుమారుల యెంగిళులు గుడిచి క్రొవ్వి, యెక్కుడువారల ధిక్కరించెదవు; నీ కొలఁది యెఱుంగవు; దీనం జేటు వాటిల్లుఁ గాన తేటపడ నెఱింగించెద నాకర్ణింపుము. 81
చ. ‘విరటుని గోవులన్‌ మరల వెల్చి మదంబున నీదు తమ్మునిం
బొరిగొనఁ బార్థుఁ దాక కెటుపోయితి నాఁ డల ఘోషయాత్రలోఁ
గురుపతి డించి క్రీడి కృపకుం దగు పాత్రము సేసి యెక్కడన్‌
సురిఁగితి చెప్పుమా నిజము సూతతనూభవ! నాకు నేర్పడన్‌.’
82
వ. అని వెండియు. 83
చ. ‘పనివడి జామదగ్న్యుఁడు సభన్‌ వినిపింపఁడె మీకు నెల్ల న
ర్జును భుజవైభవంబు మధుసూదను పెంపును నాఁడ ద్రోణ శాం
తనవులుఁ జెప్పరే బహువిధంబుల? వారల గెల్వరామి మున్‌
వినమె? యెఱింగియున్‌ మఱియు వీఱిఁడి మాటలు వేయు నేటికిన్‌?
84
క. ఒంటి మెయిఁ దాఁక నా ము | క్కంటికి వశమగునె కృష్ణ గాండీవుల ని
ట్లంట యుడిగి తగు రథికుల | జంటగొని రణమ్ము సలుపు శత్రులు దలఁకన్‌.
85
తే. గొంతికొడుకును దేవకికొడుకు మనము | గనియెదము దినకర నిశాకరులుఁ బోలె
వెలుఁగ; నయ్యెడ ఖద్యోత విలసితంబు | తోడి దగుఁ గాక నీ పెంపు దోఁపఁగలదె?
86
వ. అనిన విని కర్ణుండు ‘గమలనాభుని పెంపును బార్థు బలిమియు నెఱుంగక యే నేల వారిఁ దొడరెద? నీ వెట్లు చెప్పినను దొడరుదుఁ, దొడరి వారొండె నేనొండె నగుదు నింతియ నీవు వెడమాట లాడక యుడుగు’ మని పలికి యచ్చటి మహీపతులు విన నమ్మద్రపతి కి ట్లనియె. 87
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )