పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
కర్ణుఁడు శల్యునిపైఁ గోపించి యతని దురాచారంబు లుగ్గడించుట (సం. 8-27-68)
సీ. ‘విను పాపదేశ సంజనితుండ వగు నీకు | దుర్బుద్ధి గాక సద్బుద్ధి కలదె?
క్షత్రియాధమ! నీచ! కలదు లోకంబున | నా బాల గోపాలమైన వాక్య
మతి కుటిలుండు సంగతుఁడు గాఁ డేమిటఁ | జెలికిఁ గీడొనరించుఁ జెట్ట వలుకు
దుష్టాత్మకుఁడు గడుఁ గష్టుఁడు మద్రకుం | డనునంత వట్టుఁ బ్రత్యక్షమయ్యె;
 
ఆ. వావి లేక యెల్ల వనితలుఁ బురుషులుఁ | గలయమీకు నెగ్గుగాక యుండు
మున్నుగల్లు పిదపఁ జన్నుబాలై పెరుఁ | గుదురు సెప్ప నేల గుణము లింక?
47
క. పలువురకుఁ బుట్టి నిచ్చలుఁ | గలు ద్రావుచుఁ బెరిఁగి యెట్లు గఱతురు శీలం
బులు నుచితము లగు భాషణ | ములు, నీ విమ్మాట లుడిగి పొదపొద మనికిన్‌.
48
చ. మఱియొకఁ డేను జెప్పెద, నమానుష విక్రమలీల నల్గడం
బఱపియుఁ జంపియున్‌ రిపునృపాలక సైన్యము రూ పడంచి మై
దొఱఁగుట యొప్పదే? తనువు దూఁటులుగాఁ బెఱవారి గెల్పుకో
లుఱ దొకొ! నాదు పెం పుడుప నోపుదురే నిను బోఁటు లెమ్మెయిన్‌?
49
వ. కినియించి గదం దలవగుల వ్రేటువడక యూరక తేరువోని మ్మనవుడు మద్రపతి యతని నవలోకించి. 50
ఆ. ‘హితము సెప్పఁదగనె యే నీకు? నదియును | గాక నీ రథంబు గడపుచుండి
కౌరవాధినాథ కార్యార్థి నగు నాకు | నున్నరూపు సెప్పకుండ నగునె?
51
ఉ. సారథి దక్షుఁడై రథికసారము రథ్యబలంబు నాయుధో
దారత మానమున్‌ రణవిధంబు నిమిత్త శుభాశుభత్వ ని
ర్ధారణమున్‌ మదిం గని హితం బెఱిఁగించుట నీతి; గాన నీ
వీరసమెత్త నోఁబలికితేనియుఁజెప్పుదు సూతనందనా!
52
వ. ఏ నేమి తప్పు సేసిన గదం దలవగుల వ్రేసెదవు? నీ విట్లంటివి గదా యని హితోపదేశంబు సేయ మాన నేర్తునే? యిది యొక దృష్టాంతంబు వివరించెద వినుము; విని నీవు నా చెప్పినట్ల చేసితేనియు మేలు, సేయకుండినం గడు మే లని యి ట్లనియె. 53
సీ. ‘అంబుధిలో నొక్క యలఘుతర ద్వీప | మున ధర్మవర్తినాఁ జను నరేంద్రు
పురమున నొక వైశ్యవరుఁ డధ్వరాది స | త్కర్మఠుఁడును శాంతిదాంతియుతుఁడుఁ
గరుణాపరుఁడు దాననిరతుండు ధన ధాన్య | శోభియు బహుపుత్ర లాభ విలసి
తుండు నై వర్తించుచుండఁగ నిలు సేరె | నొక కాకి; యతని పుత్రకులు దాని
 
తే. కెంగిళులు పెట్టి కొనియాడ నెలమిఁ బెరిఁగి | క్రొవ్వి కడుమీఱి యెట్టి పక్షులును దన్నుఁ
బోల వనియెడు దుర్మానమునఁ దృణీక | రించి యది పెక్కు భంగులఁ గ్రీడ సలుపు.
54
వ. ఇట్లు విహరించుచుండ నొక్కనాఁడు గొన్ని హంసంబులు పక్షబలంబున సుపర్ణుతో సరిసేయం దగునట్టివి సముద్రంబు చేరువఁ జనం గని యా కోమటికొడుకు లక్కాకంబునకు వానిం జూపి యి ట్లనిరి. 55
క. ‘పులుఁగులలో నీ వెక్కుడు; | విలసద్గతి నంచ లిట్లు వినువీథిఁ గరం
బెలమిం జనియెడు వీనిం | గలసి పఱచి గెలువవలదె గతుల బహులతన్‌?’
56
వ. అని తారతమ్య జ్ఞానహీను లగు నయ్యల్పబుద్ధులు సెప్పిన, నుచ్ఛిష్ట దర్పితం బగు నదియును మౌర్ఖ్యంబునం దానంతటి దాన నని తలంచి వానిదెసకుం జని మనంబున వీనిలో మేటి యెయ్యదియో యనుచుం జేరి, తన చూడ్కికి వచ్చిన యంచం బురుడించి, పఱతము రమ్మని పిలిచిన, నయ్యంచలన్నియు నిలిచి పెలుచ నవ్వి యవ్వాయసంబున కి ట్లనియె. 57
క. ‘మానససరసి వసింతు మ | హీనబలము జవముఁ బక్షు లెల్లను బొగడం
గా నెందుఁ దిరుగుదుము; ద | వ్వైనను ఖేదంబు లేదు హంసల మగుటన్‌.
58
వ. ఇట్టి మాయందును. 59
క. బలశాలి యైన హంసముఁ | బిలిచితి పురుడించి పాఱ బేలతనమునన్‌;
గలవే యింతకు మును హం | సలతో బురుడించు వాయసంబులు జగతిన్‌.
60
సీ. అనుటయుఁ గాక మిట్లను హంసములతోడ, | ‘గతులు నూటొక్కటి గలవు వాన
నొక్కటొక్కట శతయోజన వ్యాప్తి నే | మెఱయుదుఁ బొడవుగా మీఁది కెగసి
చనుట యచ్చటినుండి చక్క నేలకుఁ జోడు | వట్టి డిగ్గుట దూరపాత భంగి
సంగతి పరువడి చారులీలా గతి | వక్రయానము వలయక్రమంబు
 
ఆ. లోనుగాఁగ నెట్టు లైనను మీకోరి | నట్ల పఱచి మేటి యంచ యైన
దాని నిపుడ గెలుతుఁ; దక్కటి యంచలు | భయము వొందఁ గాకి పదుపు వొంగ.’
61
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )