| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
‘దృష్టాంతము సెప్పెద నని | కష్టాత్మా! నీవు నన్నుఁ గాకము నరు ను త్కృష్ట మరాళము గాఁగ ని | కృష్టంపుఁ గథఁ జెప్పి; తిది సఖిత్వము తెఱఁగే? |
97 |
| ఆ. |
నీచులకు బలంబు నెట్టన పరుసని | కాఱు లఱచు చున్కి గాన యిట్లు పలికి తింతఁ జేసి భయ మయ్యెనే నాకు? | నట్టిమాట లింక నాడ కుడుగు. |
98 |
| క. |
అడిగితినే నిను నా క | వ్వడి భుజబల మెట్టిదని? యవారణ నీ వి ప్పుడు నృపు లెల్లను విన వా | విడిచి పొగడె దిట్లు వంది విధమున నతనిన్. |
99 |
| చ. |
అని మొన శత్రులం బొగడు టారయ మూర్ఖతగాదె? యిట్టి దు ర్జనుల సహింతురే? పెలుచఁ జంపక; సైరణసేయుకాల మై నినుఁ దెగఁ జూడనైతి ధరణీపతి కయ్యముపై భరంబునన్ గొనకొని సూతకృత్యమునకుం దగఁ బంచినవాఁడు గావునన్?’ |
100 |
| వ. | అని వెండియు. | 101 |
| తే. |
‘అకుటిలుం డగు నాకు నత్యంత కుటిల | వృత్తి సహితంబు సేసెద విత్తెఱంగు మిత్త్ర వంచన మారయ మైత్రి సప్త | పద కృతోద్భూతి యనియెడు పలుకు వినవె? |
102 |
| క. |
జను లెట్టిది మిత్త్రవిధం | బని చెప్పుదు రట్టి చంద మఖిలము దుర్యో ధనునందుఁ గలదు నా యెడ | మన మూఱడియుండు నా కమంద ప్రీతిన్. |
103 |
| క. |
జను లెట్టిది శత్రు విధం | బని చెప్పుదు రట్టి చంద మారయఁగా దు ర్జనుఁడ వగు నీకు నాయెడ | వినుము కలిగె; దీన మనసు విచ్చెం గుటిలా! |
104 |
| ఉ. |
కావున నీకు నప్రియముఁ గౌరవ రాజునకుం బ్రియంబునుం గా విధి మెచ్చ బాహుబల గర్వ మఖర్వముగాఁగ లక్ష్మికిం జేవయుఁ గీర్తి కున్నత విజృంభణముం గలుగన్ ముకుంద గాం డీవులఁ దాఁకి గెల్చెదఁ గడింది మగంటిమి యుల్లసిల్లఁగన్. |
105 |
| వ. | అని పలికి మఱియును. | 106 |
| తే. |
‘భండనంబునఁ బార్థుచేఁ బడక నేఁడు | మేలుచేయైతి నేనియు మృత్యువునకు నెన్నఁడును నగపడ నాకు; నివ్విధంబు | సందియము లేక చిత్తంబునందుఁ దోఁచె. |
107 |
| చ. |
వినుత మహాస్త్రముల్ వఱపి విక్రమ సంపద నాకుఁ జూపు న ర్జున భుజలీల కోర్చెద; వసుంధరఁ జక్రము గ్రుంగి నా రథం బునకు నవార్యమై యెడరు పుట్టక తక్కిన శల్య! చూడుమీ! నను విశిఖావలీ విలసనంబున నాతని యేపు మాపెదన్. |
108 |
| వ. | నీకు వెఱపింప నయ్యెడు కొలంది వారిని వెఱపింపుము; కర్ణుండు విక్రమంబునకుం గీర్తికి నా స్పదంబగుటకు జనియించిన వాఁడు గాని భయంబు గొనుటకుం గాదు కురుపతి సన్నిధి నీవు సారథ్యంబునకుం బూనుచుండి పలికికొన్న బాసకతంబున బ్రదికిపోయి’ తనిన విని శల్యుం డీ ‘యనర్థ ప్రలాపంబులం బ్రయోజనం బేమి? వినుము; కర్ణ కర్ణులు వేవురైనం గిరీటిని గెలువం జాలుదురే?’ యనుటయు నతండు గినుక నెఱ్ఱనైన కన్నుంగవతోడి నవ్వు నవ్వుచు నిట్లను ‘ధృతరాష్ట్ర మహీపతి సన్నిధి నుత్తమ ద్విజుల గోష్ఠి నఖిల దేశాచార విదుండైన వృద్ధ బ్రాహ్మణుండు సెప్పవింటి బాహ్లిక దేశంబునవారు గోమాంసంబు నంజికొని మద్యపానంబు సేసి నగ్నులై యసంగత దురాలాపంబు లాడుచుఁ దిరుగుదు రని తొడంగి యనేక ప్రకారంబుల బాహ్లిక దేశ నిందోపన్యాసంబు సేసె; నట్టి బాహ్లికుల కొడయుండవు తత్కృతంబులగు పుణ్యపాపంబుల నాఱవపాలు నిన్నుం జేరు; నట్లుంగాక వారి యనాచారంబులు వారింపమిం జేసి యా కల్మషంబు లెల్లను నిన్నుం బొందు; బాహ్లికుల కంటెను మద్రదేశ జాతు లవినీతులని యార్యులు సెప్పుదురు; ని న్నేమి సెప్పంగల? దింతవట్టు నెఱింగి నాలుక యడంచి యుండు’ మనవుడు నమ్మద్రేశ్వరుండు. | 109 |
| క. |
‘లావులు రథాతిరథ సం | ఖ్యావేళం దెలియఁ జెప్పెఁగాదే భీష్ముం డా వచనమ్ములు మనమున | భావింపుము క్రోధ మేల బలియుఁడ! నీకున్? |
110 |
| తే. |
విడుతు రాప్తుల బంధుల వెలలుగన్న | నమ్ముదురు కులకాంతల నంగదేశ జనితులగువారు విభుఁడ వజ్జనుల కిట్టు | లేలొకో నొడ్ల చరితంబు లెన్న నీకు? |
111 |
| క. |
పరదోషము సెప్పఁగ నే | ర్తురు గా, కాత్మీయమైన దోషంబు మదిం బరికింపఁగ నధములు నే | ర్తురె? తలఁపక యంటి వలుకతో నుండకుమీ!’ |
112 |
| వ. | అని యుల్లసంబాడి మఱియును. | 113 |
| ఆ. |
‘సకల దేశములను సన్మార్గ వర్తులు | గలరు దుష్టతతియుఁ గలిగియుండు; మది నెఱుంగ నేర్చు మధ్యస్థు లదియును | నదియు నుగ్గడింతు రెదురు మెచ్చ. |
114 |
| వ. | ఒకదేశంబు దాఁ గీడ యగుట కలుగునే? యట్లుం గాక సదాచార దురాచారంబులు దైవం బెఱింగెడు; నీ వనాత్మజ్ఞుండ వూరకుండు మనియె; నట్లయ్యిరువురు వివాదంబు సేయుట యాలించి చేరి కౌరవపతి సఖిభావం బుపన్యసించి రాధేయు రాజత్వ గౌరవంబు గొనియాడి మద్రవిభుని వారించిన నా సూత నందనుండు నగుచు శల్యునుద్దేశించి పొద పొద రథమ్ము పోనిమ్ము పోనిమ్మని పలికె; నట్లరిగి శల్యుండు సస్మితుం డగుచు వెండియు నర్జును నుగ్గడించి కృష్ణుండు సారథియును గాండీవంబు సాధనంబునునై యప్రతిహత మనోరథుం డగు నా రథికు తోడం బెనంగ నోపితేని నీవు మాకెల్లను రాజ వమ్మేటి మగని యరదంబు మన మొగ్గరంబు సొచ్చి చిక్కు వఱుచుట గలుగు నని ఎఱుంగ నయ్యెడు మన మేమఱక యుండవలయు; నీ తోఁచు దుర్నిమిత్తంబు లనుసంధింపుము. | 115 |