పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
శల్యుఁడు గర్ణునితో నప్పుడు దోఁచు నుత్పాతంబులు సెప్పుట (సం. 8-31-38)
క. వఱళులు మన చేరువఁ బె | ల్లఱచుట బెట్టెదురు గాలి యడరుట గ్రద్దల్‌
తఱచయి యాడుట వికృతపు | టఱపులతో రేఁగి కాకు లఱచుట గంటే?
116
వ. అని వెండియు. 117
ఆ. సిడము కామ సూడు వడఁకెడు మన తేరి | చుట్టు మెఱయఁ గట్టినట్టి చిఱుత
పడగలందుఁ గంటె వెడలెడు మంట లు | గ్రంబు గాఁగ నోపు రణము నేఁడు.’
118
వ. అనియె నప్పుడు రాధేయుండు ధృష్టద్యుమ్నాభిరక్షితంబైన ధర్మతనయ వ్యూహంబు గనుంగొని రథికవరులం దగినయెడల నమర్చి తన మోహరం బాయితంబు సేసికొని యురవడింప నమ్మద్రపతి యఱ్ఱెత్తి యాలోకించి. 119
ఉ. అల్లదె! యర్జున ధ్వజ విహారము గానఁగ నయ్యెడుం గపీం
ద్రోల్లసనంబునన్‌ మెఱసి యుద్భటు లైన త్రిగర్తు లేపు శో
భిల్లఁగ వారె! యన్నరుని బెట్టుగఁ దాఁకి రతండు నంప పె
న్వెల్లి నిగిడ్చి ముంచె నదె! నింగి గుణధ్వని వొంగ వారలన్‌.’
120
ఆ. అనినఁ గర్ణుఁ డిట్టు లనియె ‘సంశప్తక | బలముచేతఁ బొదువఁబడి కిరీటి
మేఘ పిహితుఁడైన మిహిరుని చాడ్పున | వాఁడి లేక యున్నవాఁడు గంటె!|
121
వ. అనుటయు శల్యుఁడు. 122
చ. ‘వరుణుఁడు నీళ్ళ చేఁ జెడునె? వాయుసఖుండు మహేంధనోత్కర
స్ఫురణ నడంగునే? నరుఁడు పోరుల నేపఱు టేల కల్గు? నె
వ్వరికిని వానిఁ గీడ్పఱుప వచ్చునె? గాలిఁ బరాభవింపఁగా
దొరకొనినం జలంబు మెయిఁ దోయధి యంతముఁ ద్రావ వచ్చినన్‌.
123
ఆ. దేవతలకునైన దేవేంద్రపుత్రుని | నాహవమున గెలువ నలవి గాదు;
మనము గెలుతు మిట్టి మాట లాతనిఁ జేరఁ | జనక యాడి దీన సంతసింపు.
124
ఉ. మేరువు వోలె నొప్పిన సమీరణపుత్రుని పేర్మియున్‌ మహో
దారుఁడు ధర్మనందను నుదాత్తతయున్‌ విజయానుజన్ము లే
పారఁగ నున్న సొంపును నహంకృతి యేర్పడ ద్రౌపదీసుతు
ల్వీరల మీఱి పొల్పెసఁగు లీలయుఁ జూడుము సూతనందనా!
125
వ. పాండవులు ధర్మపరు లెవ్వలన ధర్మంబు గలుగు నవ్వలనికి జయంబు గలుగుట దప్ప’ దను సమయంబున సంశప్తక కులంబుం గనుంగొని మన సైన్యంబును సవ్యసాచిం జూచి వారి సేనయును గడంగి యొండొంటితోఁ దాఁకిన గంగా యమునల సంపాతంబు చందంబు దోఁచె; నట్టి యెడం గురురాజు రాధేయుని మద్రరాజుం దగు రాజులను సాదరావలోకనంబున సంభావించి యి ట్లనియె. 126
ఆ. ‘ఎద్ది ప్రియము సేయు నేపారు శూరుల | చిత్తములకు నది యుదాత్తభంగి
నొదవె మీకు బాహుమదమునఁ గొనియాడుఁ | డుగ్ర శౌర్యమహిమ యుల్లసిల్ల.
127
క. బలుపెసఁగఁ బాండుపుత్రులఁ | బొలియించిన నతుల రాజ్యభోగంబును వా
రలచేతం బొలిసిన ను | జ్జ్వల నాకసుఖంబు గలుగు వ్రాలుఁడు పోరన్‌.’
128
వ. అనిన వారలందఱు నుబ్బి సింహనాదంబులు సేయఁ దూర్య నినదంబులు సెలంగ సైన్యంబులు సంతసంబునం బొదలె; నప్పు డశ్వత్థామ రథిక జనంబుల మనంబులం బ్రమదం బెసంగ ని ట్లనియె. 129
క. ‘ఆయుధము విడిచి యుండఁగ | సాయకగురు మీరు సూడఁ జంపిన కష్టో
పాయుని ధృష్టద్యుమ్నుని | మాయించియ కాని తొడినమఱు వే నూడ్పన్‌.
130
క. కడువడి వడముడియును గ | వ్వడియు నతనిఁ గావఁ బూని వచ్చిరయేనిం
జెడుదురు మచ్చాపంబున | వెడలు వివిధ విశిఖ శిఖల వేఁడిమిచేతన్‌.’
131
చ. అన విని యవ్వరిష్ఠ రథికావలి పెల్లుగఁ బాండుపుత్ర యో
ధనులపయిన్‌ వెసంగవియు దర్పము వార లుదగ్ర వృత్తి మా
ర్కొనిన మహోగ్రభంగియును ఘోరపులీలల విస్మయం బొన
ర్చె ననిమిషాంతరంగములఁ జెల్లె రణంబు నుదీర్ణ రౌద్రమై.
132
క. జనసంక్షయంబు పె ల్లే | మనవచ్చుం బ్రళయకాల మయ్యెనొ కా కెం
దును నిట్టివి గలవే? యని | మనమునఁ దలపోయవలసె మముబోఁటులకున్‌.
133
వ. అట్టి యెడ. 134
ఉ. ప్రీతి యెలర్ప వీరుల వరించుటకుం జనుదెంచి యప్సరో
వ్రాతము గంధపుష్ప పరివర్షణకేళి యొనర్ప సౌరభం
బాతఱి సంచరించు లలితానిలుఁ డెక్కుడు సేసి వీచె సం
జాత నవీన ఘర్మజల జాలక సైనిక లాలనీయుఁ డై.
135
ఉ. ఆ సమయంబునం గురుకులాగ్రణి భీమునిఁ దాఁకె సం
త్రాసన మత్త వారణ కదంబ సముద్భటుఁడై యతండునుం
జేసె రణంబు దత్ప్రబలసేన దలంకెడునట్లుగా సము
ద్భాసిత దుర్నివార్య బహుబాణ విసారణ దారుణోద్ధతిన్‌.
136
క. పదపడి రాధేయుం డు | న్మద వృత్తిం గవిసె గుణ నినాదంబును బె
ట్టిద మగు రథనిస్వనముం | జదల నిగుడఁ బాండవాగ్రజన్ముని దెసకున్‌.
137
వ. ఇట్లు గవిసిన మన సైనికు లిట్లని రివ్విధంబున ధర్మనందనుం గదియ నడరిన నరుండు వచ్చి యడ్డంబు సొచ్చునపుడు. 138
చ. నరునకు సూతసూతికి రణం బగు నేఁ డతిఘోరభంగి నం
దరయ నితండు గీ టడఁచు నాతని నన్నటులున్నవాఁడు దు
ర్భర రిపుబాధ దక్కి కురురాజు సుఖిత్వముఁ బొందునిప్డు రం
డరదము సేరి యీతని మహాస్త్ర విలాసము సూత మేర్పడన్‌.
139
క. గెలు పెల్ల భంగి నితనికిఁ | గలుగు నను తలంపు వుట్టఁగా నిపుడు మనం
బుల జనియించు మనోరథ | మలవడుటయుఁ బోర నెఱుఁగనయ్యెడు నదియున్‌.’
140
వ. అనుచుఁ గూడుకొని రథ కరి తురగ సమ్మర్ద నిర్దళిత భూభాగంబుగా నురవడింప రాధేయుం డరిభీషణం బగు రథంబున. 141
తే. మిగిలి యప్పాండవాగ్రజు మగఁటిమియును | జలముఁ గోల్పుచ్చి తూలఁబోఁ బలికి మెఱసె
నధిప! యతినికి వీఁకమై నడ్డపడఁగఁ | గడఁగు నద్దెస యోధుల గర్వ మడఁచి.
142
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )