పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
ధృష్టద్యుమ్నుఁడు దుర్యోధనుం దాఁకి విరథునిఁ జేయుట (సం. 8-40-21)
ఆ. ఇరువదేను నిశిత శరముల నొప్పింప | నలిగి యాతఁ డతని యంగకముల
నఱువదేను తూపు లడరింప నఱకె న | క్కౌరవేశ్వరుండు గార్ముకంబు.
266
మ. బలువి ల్లుగ్రత నెత్తి యొక్క మొగి నప్పాంచాలవర్యుండు దీ
ప్తులు గ్రమ్మం బదియేను మార్గణము లా భూమీశుపై నేసినం
గలయం బూచిన కింశుకంబు చెలు వంగం బొందఁ దచ్చాపముం
బెలుచం ద్రుంచి యతండు ఫాలమున గుప్పించెన్‌ దశోగ్రాస్త్రముల్‌.
267
క. కాలాయసనారాచము | లోలి నుదుట నాటి యున్న నొప్పారెం బాం
చాలవరు ముఖము మధుకర | మాలికచేఁ బొలుచు తమ్మి మాడ్కిం జూడన్‌.
268
సీ. కనలి యవ్వీరుండు గార్ముకాంతరమునఁ | గ్రూర భల్లంబుల ఘోటకముల
సారథిఁ జాపంబుఁ దేరును గొడుగును | దునుమాడఁగా భవత్పుత్రుఁ డేపు
గుందక శక్తి నిగుడ్పఁగఁ ద్రుంచె నే | డ్తెఱఁ గృపాణము గొన నుఱుము సేసె;
గద యెత్తఁ బఱియలు గావించె; నుబ్బి ర | త్నమయాహి కేతువు నఱకి వైచె;
 
తే. నిట్లు హయసూత కోదండహీను దళిత | రథుని విగతాతపత్రు నిర్భగ్న శక్తి
ఖడ్గ ముద్గర కేతు విఖండితాపి | ధానుఁ జేసె నప్పార్షతుం డా నరేంద్రు.
269
తే. వికల సాధనుఁ డైన యవ్విభుని నతని | తమ్ముఁ డగు దండధారుండు దనదు తేరి
మీఁద నిడుకొని శత్రు సమీప భూమి | వాయఁ గొనిపోయెఁ జూచి రాధేయుఁ డపుడు.
270
క. శినివంశవరునితోడం | బెనఁగి పెనఁగి యతని విడిచి పెలుచ ద్రుపదనం
దనుని రథమునకు నెదురుగఁ | దన యరదము సనఁగ నిచ్చె ధరణీనాథా!
271
వ. సాత్యకియును శరంబులు గురియుచుఁ దోన తవిలె; నుభయసేనాపతులగు నా సూతనందన ధృష్టద్యుమ్ను లట్లు దార్కొనిన నయ్యిరువాఁగునందు నొక్కరుండైన నోలమాసగొనక కడంగినం బోరు ఘోరంబయ్యె నట్టియెడఁ బాంచాలకుమారులు వ్యాఘ్రకేతు సుశర్మ శుక్ల చిత్రోగ్రాయుధులును, జయరోచమాన సింహసేనులును, బలుదేరుల మొత్తంబులతోఁ దన్నుం గవిసినం గర్ణుం డయ్యెనమండ్రు వీరుల నెనిమిది భల్లంబులం దునిమి, తత్సహచరుల బహుసహస్ర రథికుల సమయించినం జేది రథిక ప్రవరులు జిష్ణు జిష్ణు కర్మ దేవాపిభద్రులును దండ చిత్ర చిత్రాయుధులును హరిసింహ కేతు రోచమాన శలభులును సబలంబుగాఁ దలపడిన నా పదునొక్కొండ్ర నొక్కపెట్ట బెట్టిదంపు టంపఱ పాలుచేసి మఱియును బిరుదులయి పయింబడిన దొరలను వారి పరివారంబులను వసుధం గూల్చియు నలంచియుం గలంచియుం గడిమి మెఱయుచు నిట్టిచందంబు భీష్మద్రోణులయందుఁ జూడమని జనంబులు వెక్కసపడ వివిధ సమరవిహారంబు సలిపి, వెండియు. 272
సీ. సింహంబుబారిఁ జొచ్చిన గజంబుల భంగిఁ, | బులి కగ్గమైన జింకల విధమున,
జ్వలనంబుఁ గిట్టిన శలభంబులట్లుఁ, బాం | చాల యోధులుఁ జేది సైనికులును
దనుఁ దాఁకి పొలియ రాధాతనూభవుఁ | డనిఁ దనివోక ధర్మనందనుని యున్న
చక్కటి కడర ధృష్టద్యుమ్నుఁడును ద్రౌప | దీపుత్రులును సహదేవుఁడును శి
 
తే. ఖండియును సాత్యకియు నకులుండు జేయఁ | గల మహీశులుఁ బొదివి రక్కర్ణు; నతఁడు
పెక్కు పాములు వొదివినఁ బెనఁగు గరుడు | ననువు దోఁపగఁ బోరాడె మనుజనాథ!
273
వ. ఆ సమయంబున భీమసేను బారింబడిన కౌరవసైన్యంబునం బ్రబల చతురంగంబు లొక్కమొగిన్‌ బడలువడి రణాంగణంబు మూసికొనియెం; బెఱమూఁకలు వెఱఁగునం జెయ్వేది కర ళ్ళడంగిన మున్నీటియ ట్లుండె గాండీవి సంశప్తకుల ననేకుల మేటిమగల గీటడంచి హతశేషంబగు బలంబు విచ్చుటయు, వాసుదేవు నాలోకించి. 274
ఆ. అమరులకు నజయ్యు లగునట్టి సంశప్త | కులు మదీయ బాణ ఘోర భంగి
కోహటించి పాఱుచున్నారు; భీముని | మునుము కౌరవులును మొనయ లేరు.
275
క. కర్ణుం డొక్కరుఁడును సము | దీర్ణుండై సిడము మెఱయఁ దిరిగి బలువిడిన్‌
ఘూర్ణితము సేసె మనసై | న్యార్ణవమున మంథనగము నను వమరంగన్‌.
276
చ. ‘అరదము పోవనిమ్ము రయ మారఁగ నాతని దిక్కు’ నావుడున్‌
దరహసితంబుతో నలిననాభుఁడు భీమునిచేతఁ బోదు నీ
శరముల వేఁడిఁ గౌరవుల సంగరవాంఛ యడంపు మన్న న
న్నరుఁడును నియ్యకొన్నఁ గురునాథుని యోధులు బెగ్గడిల్లఁగన్‌.
277
ఆ. అమ్మురారి ధవళ హయములు మెఱయ న | ల్దిక్కు సత్వరముగఁ దేరు పోవ
నిచ్చుటయును జూచి విచ్చె నబ్బలము సిం | గంబుఁ గనిన లేడిగమియుఁ బోలె.
278
వ. అప్పుడు నీ కొడుకు సంశప్తకులం బురికొల్పిన రెండు వేల రథంబులును మున్నూ ఱేనుంగులును జతుర్దశ సహస్ర తురంగంబులును లక్ష ద్వయ పదాతులును నప్పార్థుపయిం గవిసిన, నతండు శింజినీ టంకారంబునం బటు శరాసారంబున నింగి నించి పదివేవు రుద్భటక్షత్రియులం బొలియించి, యక్కెలనం గాంభోజ బలంబు దోఁచిన నం దుఱికి తదీయ సైనికుల కరంబులు శిరంబులు నఱకిన, నది మహావాతనిహతవిటపంబైన యారామంబు చందం బయ్యె; నట్టియెడ. 279
క. అడరి సుదక్షిణు తమ్ముఁడు | గడువడి నేయుటయు, నతని కరశాఖలు గ
వ్వడి యర్ధచంద్రశరముల | వెడంద తూపున శిరంబు వ్రేల్మిడిఁ ద్రుంచెన్‌.
280
క. యవన శక సైన్యములు పైఁ గవిసినఁ దద్రుధిర జలము గాలువలై పా
ఱ వెసం బఱపెను వివిధా | స్త్ర వితానము ల క్కిరీటి ధరణీనాథా!
281
మ. కని సంశప్తకు లేచి యొక్క మొగి నా కౌంతేయునిం జుట్టుము
ట్టిన సేనాంగ చతుష్టయాంగములు ఖండీభూతముల్‌ సేసె నా
తని బాణోత్కర వేగ ముత్కట మరుత్సంక్రీడ జీమూత పా
టనముం జేసిన భంగిఁ జిత్రబల గాఢస్ఫూర్తి శోభిల్లఁగన్‌.
282
క. హరి వెరవున ధవళాశ్వ | స్ఫురణమున రథంబు మెఱయఁ బొలుపారెడు న
న్నరు నత్యద్భుత విక్రమ | పరిణతి సూడఁ గనుదోయి పదివేల్‌ వలయున్‌.
283
క. నను బోఁటుల మనములు మె | చ్చునఁ గరఁగె ననంగ నేల? సురతతి గృష్ణా
ర్జునులం గని దుందుభి ని | స్వనములతోఁ గురిసె విరుల వాన వొగడుచున్‌.
284
వ. అ య్యవసరంబున నాకసంబున నశరీరవాణి యయ్యిరువుర నుద్దేశించి యఖిల జనంబులు నాకర్ణింప వీరు చంద్రార్కులం గడచిన కాంతిదీప్తుల నుల్లసిల్లెదరు; తొల్లి యేక రథస్థు లైన బ్రహ్మేశానుల విధంబున వెలింగెదరు గంటిరే! వీరలు పరమ మునులగు నారాయణుండును నరుండునుజుండీ యనియె; నిట్లు మహనీయాశ్చర్యంబులు గనియును వినియును మాత్సర్యధుర్యుం డగునాచార్యనందనుం డరిగి యమ్మహాత్ముల మార్కొని మార్గణోజ్జ్వలం బగు దక్షిణ కరంబున నా ఫల్గునుఁ బిలిచి హాసభాసిత ముఖుండగుచుఁ గుపితుండగు నతని కిట్లనియె. 285
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )