పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
అశ్వత్థామ యర్జునుం బేర్కొని మార్కొని సంగ్రామంబు సేయుట (సం. 8-40-110)
క. ననుఁ దగియెడు నతిథింగా | మనంబునఁ దలంచి నీవు మన్నించెదవే
నిని వచ్చెద నీ పాలికి | ననఘా! సంగ్రామ మొసఁగు మాతిథ్యముగన్‌.
286
ఆ. అనినఁ గృష్ణుఁ జూచి యర్జునుఁ డాచార్య | తనయు గెలువ కునికి దైన్య మిపుడు
సమయఁ జూడవలయు సంశప్తకులను నీ | మనసు వచ్చు పనికిఁ బనుపు మనుడు.
287
ఉ. తేరు మురారి ద్రోణుసుతుదిక్కునకుం జననిచ్చి ‘మేలు మేల్‌
పోరు ఋణంబు దీర్చు కురుభూపతికిన్‌; నరబాహులీలకు
న్సైరణ గల్గి నిల్వు’ మనినన్‌ విని ‘యట్టుల కాక’ యంచు న
వ్వీరుఁడు షష్టిబాణముల వెన్నుని నేసె నుదగ్రుఁడై వెసన్‌.
288
ఉ. అమ్ములు మూఁడు పార్థుతను వాడఁగ నేసినఁ ద్రుంచివైచెఁ జా
ప మ్మతఁ డమ్మహాద్విజుఁడు భారవహమ్మగు నొండు విల్లు శీ
ఘ్రమ్మున నెత్తి చేతులను గాళ్ళను మోమున వింటి కొమ్మునం
గ్రమ్మిన భంగిగా శితశరప్రతతుల్‌ నిగిడించెఁ బైపయిన్‌.
289
క. కడుఁ బెక్కు వేలు దూపుల | వడిఁ గృష్ణార్జునుల సరథవాహంబుగ నె
క్కుడు మదమునఁ బొదివినఁ జె | య్వెడలి వెఱఁగుపడిరి వార లిద్దఱు నధిపా!
290
వ. ఇ వ్విధంబున వివిధ విశిఖ జాలంబులఁ గాలు సేయార్పరాకుండఁ గప్పి యార్చిన, నప్పార్థుం డతనిచేతఁ దనవిక్రమంబు ప్రతిహతంబయ్యె నని తలంపఁ దత్సైన్యంబున హాహాకారంబు లెసంగం జారణ సిద్ధగణంబు లట్లు నిశ్చేష్టితు లైన యాలోకరక్షకుల నాలోకించి ‘లోకంబులకు బ్రదుకు గలుగునో’ యని పలుక నప్పద్మనాభుండు గనలి య క్కవ్వడి నుద్దేశించి. 291
క. ‘గురుసుతుఁడు నిన్ను మిగులుట | గర మాశ్చర్యంబు! ముష్టి గాండీవము దాఁ
దిరమయి యుండదొ? బాహుల | వెరవు బలుపు గుందెనో? వివేకింపు మెడన్‌.
292
క. ‘గురునికొడు కను తలంపునఁ | బరుసఁదనంబునకుఁ జొరక భంగపడితొ? యు
ద్ధురతఁ గడుఁ జెడియె? ననవుడు | సరోష సంరంభుఁ డై విజయుఁ డాతనితోన్‌.
293
క. ‘వెసఁ బెక్కమ్ములు మనపై | ముసుఁగువడం బఱపి యతఁడు మురభంజన! సం
తస మందెడు; నింతన యేఁ | గసిమసఁగెదఁ జూడు నన్ను గాండీవంబున్‌.
294
మ. అని భల్లప్రకరంబులన్‌ గురుతనూజాస్త్రప్రతానంబుఁ ద
ద్ధనువుం గేతువు నాతపత్రమును జిత్రస్ఫూర్తిఁ దున్మాడి గ్ర
క్కున నవ్విప్రుఁడు శక్తియున్‌ గదయు నుక్కుందాల్మియుం దోఁప నె
త్తినఁ దోడ్తో నవి ద్రుంచి వైచె సమరస్థేమాభిరామాకృతిన్‌.
295
ఆ. ఇట్లు ద్రోణసుతుని యేపు పార్థుఁడు దుహి | నంబుఁ జెఱుచు నినువిధంబు మెఱయఁ
జెఱిచె నంతఁ బొదివె నుఱక యా రథికు సం | శప్తక వ్రజంబు సరభసముగ.
296
క. ఎందఱు వొదివిరి వారల | కందఱకును దమక తమక యర్జున చటుల
స్యందన మెదురైనట్లు మ | దిం దోఁచెఁ దదీయ’ బాణ తీవ్ర బహులతన్‌.
297
క. అప్పుడు గురుతనయాద్రిం | గప్పఁగ వజ్రోపమాన కాండములు వెసం
గుప్పనఁగూర వఱప నరుఁ | డప్పరుసఁదనమున కోర్చి యతఁడుఁ బెనంగెన్‌.
298
వ. అ ట్లశ్వత్థామ పెనంగుచుండ సంశప్తకవ్రజంబునందు. 299
క. చేతులు దలలును బహువిధ | హేతులఁఁ దునియలుగఁ జేసి యిలఁ దొరఁగించెం
జేతుల కసి పోవంగ న | రాతులు బెగ్గిలఁగఁ గ్రీడి ప్రకటస్ఫురణన్‌.
300
క. తురగ ద్విప రథ తూర్యా | భరణ ధ్వజ చామరాతపత్ర శకలముల్‌
పొరిఁబొరి ధరఁ గప్పఁగ నె | త్తురు టేఱులు వానిఁ దొలఁగఁ ద్రోచుచు వచ్చెన్‌.
301
వ. అట్టియెడ. 302
తే. అంగ వంగ నిషాద కళింగ బలము | లర్జునునిమీఁదఁ బెల్లుగ నడరుటయును
గురుతనూభవుఁ డతనిని మురవిరోధి | నంపపెనువెల్లి ముంచి బెట్టార్చి పేర్చి.
303
వ. అ వ్విక్రమవిశేషంబునకు రోషంబు నొంది. 304
క. అ వ్వీరుం డవ్విప్రుని | క్రొవ్వును నా సైన్యసమితి క్రూరోద్ధతియున్‌
నివ్వటిలనీక ఖచరులు | నివ్వెఱపడ సమరకేళి నిపుణత మెఱసెన్‌.
305
వ. మెఱసిన నెఱసినరోషంబున మఱియును. 306
మ. గురుపుత్రుం డసురాంతకున్‌ విజయునిం గ్రూరాస్త్ర సంతాన ని
ష్ఠుర పాతంబున నొంప నాహరి దదాటోపంబు సైరింప క
న్నరుతో ‘నౌషధ మూఁది చేసి తెవులు న్మర్దింపకున్నం దుది
న్భరమై యుండదె యే పడంపుము రిపు న్సంరంభివై నావుడున్‌.
307
క. అతండు విజృంభించి గుణంబు సారించి. 308
చ. శిరమునఁ గంఠదేశమునఁ జేతులయందు నురస్స్థలంబునం
జరణములన్‌ శరంబులు వెసన్‌ నిబిడంబుగఁ గీలుకొల్పుచున్‌
వెరవునఁ బగ్గముల్‌ దునుమ వేగమ యీడ్చెఁ దురంగమంబు ల
గ్గురుసుతుతేరు గయ్యమునకుం గడు దవ్వు దొలంగ భూవరా!
309
వ. ఆ భూదేవుండును భగ్నోత్సాహుండై యల్లన సూతనందను సమీపంబునకుం జనియె; నప్పుడు శౌరి సంశప్తక సైన్యంబు దెసకుం దేరు నడపుచుం దమ సేన దిక్కు కోలాహలం బాకర్ణించి చూడ్కియట నిగిడించి యర్జును నుద్దేశించి ‘వేదండారూఢుండైన దండధారుండు మన బలంబులం గలంచుచున్నవాఁ డమ్మగథోత్తముండు భగదత్తు నంతవాఁడ; యతని మడియించి మఱి చేయంగలపని సూచికొంద’ మని పలికిన న క్కవ్వడి యొడంబడ నక్కడ కరదంబు పోవనిచ్చె; నట్టియెడ. 310
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )