| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
పాండవ సైన్యంబుల వే | దండంబుల ఘోటముల రథంబుల భటులం జండగతి మగధపతి నిజ | శుండాలముఁ బఱపి యేపుఁ జూపి తెరల్చెన్. |
311 |
| వ. | అ వ్విక్రమ విహారంబు వీక్షించి. | 312 |
| తే. |
మాగధుని కోల్తలకుఁ గాక మనబలంబు | విఱిగెఁ బొద పొదమని తాను దఱిమెఁ దేరు హరియుఁ బఱపంగ నర్జునుం డడ్డపడియెఁ | జండ చేష్టితోద్దండ వేదండమునకు. |
313 |
| క. |
అగ్గలిక దండధారుఁడు | దిగ్గజనిభ నిజ గజంబుఁ దీవ్రత మెఱయన్ డగ్గఱఁగఁ బఱపి హయముల | నగ్గరుడధ్వజుని నరుని నమ్ములఁ గప్పెన్. |
314 |
| చ. |
అలిగి కిరీటి మాగధధరాధిపు బాహులు ద్రెంచి, గ్రక్కునం దలయును ద్రుంచి, యేనుఁగు నుదగ్రతఁ బీనుఁగుఁ జేసె; నప్డు గొం దల మొకయింత లే కతని తమ్ముఁడు దండుఁడు దాఁకి తోమరం బులు వరఁగింప గేలు శిరముం గరటిం దునుమాడె నుగ్రతన్. |
315 |
| క. |
తదనీకంబు గజంబులు | పొదివిన బలుగాలి మేఘములఁ దీవ్రగతిన్ జెదరించు పగిది నరుఁ డు | న్మదుఁడై నలుదెసలఁ దోలె మనుజాధీశా! |
316 |
| వ. | ఇవ్విధంబున మగధ సైన్యంబు మర్దించి సంశప్తక సైన్యంబుపైఁ గవిసి కపికేతనంబు మెఱుంగులు మెఱయ మధుమథను వెరవున వెలిమావుల గతు లక్కజంబుగా నుక్కునఁ బార్థుండు భల్లనారాచ ప్రముఖ ప్రదర పరంపరల సొంపును బాహువీర్య ధైర్యంబుల పెంపును నిలింప నికరంబు వర్ణింప నందు మహార్ణవంబునం దిరుగు మందరనగంబు చందంబున నిజస్యందనం బొప్ప నప్పటప్పటి కెక్కు డొదవు మదంబునం ద్రిగర్తాదులగు నమ్మార్తురు పైపయిం గ్రమ్మికురియు నస్త్రశస్త్రంబులు విదళితచ్ఛిన్న చూర్ణితంబులు సేయుచుఁ దదీయ గాత్రంబులం గరటి ఘోటక తనువులుం దునియ లయ్యును నుగ్గు లయ్యును బఱియ లయ్యును గుదులయ్యును ధరం దొరఁగఁ దామరబావిం గేలి సల్పు సామజంబు చాడ్పున విహరించి యవిహతి ధృతి వ్రతమహితు లగు నహితుల నత్యుత్తమ లోకంబులకుం బుచ్చినం గొంచెపు మూఁక విచ్చినం బెద్ద వెనుకొనక యరదంబు మరల్చి వచ్చునెడ నచ్యుతుం డర్జును నుద్దేశించి ‘భవద్విక్రమ విహార స్థలంబు సూచితే?’ యని పలికి వివిధాయుధ ఖండంబులను వేదండాశ్వ రథ పదాతి శకలంబులను భూషణాతపత్రకేతు చామరాంశంబులను జక్షుశ్చమత్కరణపరిణతం బగు రణస్థలంబు సూపె; నప్పుడు గొఱ ప్రాణంబులతో నొఱలు నర తురగ ద్విరదంబులను గొందఱు దమవారిం గానక కన్నీళ్ళు నించుచు నాలింగన రోదన ప్రముఖంబు లైన కరుణా భాషణంబు లగు నవస్థా విశేషంబులం బొందువారలం గృపాళురై యాలోకించుచు నయ్యిరువురుఁ దమ మోహరంబున నెసంగు కలకలంబు విని యుదీర్ణగమనంబునం జనుదెంచుచుండి; రటమున్న కౌరవ్యుల మొనయును గర్ణుని మొగ్గరంబును రెండు ముఖంబులం బెనంగుచుండి కయ్యపు టుచితత్వంబునం గలసె; నట్టియెడ రారాజు పురికొల్ప రాధేయునకుఁ బ్రాపయి పుళింద బాహ్లిక టేంకణాంధ్ర భోజానీకంబు గవిసినం గౌంతేయ బలంబునకు భరం బగుటయు. | 317 |