| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| సీ. |
కర్ణుండు పది చండకాండంబు లర్జును | తనువునఁ జొనుప, నర్జునుఁడు దీప్త ఘనబాణములు పదునెనిమిది కర్ణు మైఁ | బరఁగింప నయ్యంగపతి దశోగ్ర చక్రమార్గణముల సరభసంబున నొంచె | నన్నరు, నాతండు నట్టి వన్ని శరములు రాధేయు నురమున నాటించె | నతఁడు దొమ్మిది వాలుటమ్ము లతని |
|
| తే. |
వక్షమునఁ గ్రుచ్చి సాయకద్వయము శౌరి | మేన నిగిడింప, బీభత్సుఁ డేను మెఱుఁగు తూపు లా సూతపుత్రు నెత్తుట మునుంగ | నేసె బాహాసముల్లాస మెసక మెసఁగ! |
284 |
| చ. |
అలిగి కడంగి సూతసుతుఁ డచ్యుతపార్థులఁ దీవ్రబాణపం క్తులఁ బొదువం పరాక్రమ కుతూహలి య వ్విజయుండు పిన్న న వ్వొలసి ముఖాంబుజంబునకు నొప్పుగఁ దద్రథ రథ్య కేతు సూ తులను దదీయగాత్రమును దూపులవెల్లి మునుంగఁ జేసినన్. |
285 |
| క. |
ఆతఁడును దురగ సారథి | కేతుయుతము గాఁగ ముంచెఁ గ్రీడయపోలెన్ శాతశరవృష్టి నన్నరు | నీతెఱఁగున మఱియుఁ బెనఁగి రిద్దఱుఁ గడఁకన్. |
286 |
| శా. |
ఆయుగ్రాహవకేలి నిట్లు నిపుణుం డై యొప్ప, నప్పార్థుఁ డా గ్నేయాస్త్రం బరివోసి దారుణ మహాగ్ని జ్వాలికల్ భీషణ స్ఫాయద్భంగి నభస్స్థలిన్ నిగుడ, దర్పస్ఫూర్తి శోభిల్ల రా ధేయాంగోద్దహనాభిలాష మెడఁదన్ దీపింప బె ట్టేసినన్. |
287 |
| ఉ. |
అంతక కోపవహ్ని విపులాకృతి గైకొని వచ్చినట్లు, మి న్నంతయుఁ దాన యై కవియు నవ్విశిఖంబు మనంబులోన నా వంతయు శంక లేక, సముదగ్రత వారుణ మార్గణా హతిన్ శాంతముఁ జేసె విక్రమ విశాలుఁడు గర్ణుఁడు మాకు నుబ్బుగన్. |
288 |
| ఆ. |
ఫల్గునుండు మేఘబాణ మేసిన, భూన | భోంతరంబు సంభృతాంధకార మయ్యె; సూతసూనుఁడనిలాస్త్ర మేయుడు | నా తమంబు విరిసె నా క్షణంబ! |
289 |
| ఉ. |
అర్జునుఁ డైంద్రబాణము సమంచిత భక్తి ధరించి మంత్రవి స్ఫూర్జిత గాండివుం డయి రిపుప్రకరంబులు సంచలింప న త్యూర్జితశక్తి నేయుడు, మహోగ్రబహు ప్రదర ప్రకారతా దుర్జయ లీల నిర్మథన దోహలి యై యది కర్ణుఁ గిట్టినన్. |
290 |
| క. |
అతఁ డభిమంత్రిత బాణ | ప్రతతిఁ దదుద్రేక మడఁచి పార్థుని మేనన్ శిత శరములు నినిచిన మా | రుతపుత్రుఁడు గనలి, యన్నరున కి ట్లనియెన్. |
291 |
| ఉ. |
‘సూతసుతుండు నీయెదుర స్రుక్కక నిల్చుట కాక, నీశర వ్రాతము నిల్వరించి యనివారణ నొంపఁ దొడంగె; ఖాండవం బే తెలివొంది కాల్చితి మహేంద్రుఁడు నివ్వెఱఁగందియుండఁగా నా తెలి వాత్మ నూల్కొలిపి యగ్గలికం దెగటార్పు మీతనిన్. |
292 |
| చ. |
తెగి మన కగ్గమై యరుగుదెంచిన వాఁ డితఁ డల్కి యింక నొం డుగడకుఁ బోవకుండఁగఁ గడున్ వెస డగ్గఱి, యేఁ గపాలముం బగులుతునో గదానిహతిఁ బార్థ! భవత్ప్రకటప్రతిజ్ఞకై తగ దని మాన్చె దేని, నిశిత ప్రదరంబులఁ ద్రుంపు కంఠమున్.’ |
293 |
| వ. | అని పలికె నప్పుడు. | 294 |
| సీ. |
పుండరీకాక్షుండు గాండీవితో ‘నీదు | దివ్యబాణములు రాధేయుచేతఁ దూలపోవుటయు, బల్ దూపుల నాతండు | నిను నొంచి యిట్లు పేర్చిన విధంబు నుత్సాహ మెడలి నీ వునికియుఁ గని, కురు | సంతతి యార్వఁ బాంచాలకోటి పిఱుసనిపోవంగ నెఱుఁగవో? యెఱిఁగియుఁ | దగఁ జేయునది లేక వెగడుపడితొ? |
|
| తే. |
చక్ర మిచ్చెద నతని మస్తకము దునుము’ | మనిన నగుచుఁ గిరీటి, బ్రహ్మాస్త్ర మధిక నిష్ఠమై నేయ నది బహునిష్ఠుర ప్ర | దీప్త శరమూర్తిఁ గర్ణుని దెసకు నడరె. |
295 |
| క. |
ఆ రథికుఁడు దలఁకక నియ | మారూఢ ప్రౌఢభావుఁ డగుచుఁ దదస్త్రో దారతర బలమునన త | ద్దారుణ సంరంభ ముడిపె ధరణీనాథా! |
296 |
| తే. |
ఉడిపి, తోడన కవ్వడి యొడలఁ గృష్ణు | మేన మూఁడుమూఁ డడరించె మెఱుఁగుఁదూపు లన్నరుఁడు గర్ణుతనువు శల్యాంగకములుఁ | జించెఁ దొమ్మిది తొమ్మిది శితశరముల. |
297 |
| ఆ. |
మొనసి క్రీడి మఱియు మూఁడు నెనిమిదియు | రెండు నాల్గు పదియుఁ జండమార్గ ణములు గ్రుచ్చె; సూతనందనుమై నతఁ | డుఱక యతని మౌర్వి యూడ నేసె! |
298 |
| వ. | ఏసి మఱియు శితశరంబులం బొదువం బొలివోవక, పార్థుం డా గుణంబు సమాహితంబు సేసి పెల్లేసిన రయంబున రాధేయుం డతని శింజిని శిథిలంబు గాద కాక యని తలంచె; నాధనంజయుం డతని వింటినారి వికలంబుఁగాఁ జేసి. | 299 |
| క. |
చిఱునగవుతోడ మైమఱువుఁ | వఱువుళ్ళుగఁ జేసి యతనియంగము దోఁగం బఱపె రుధిరంబు, బెడిదపు | మెఱుఁగు వెడఁద యంపగమి నమిత్రులు దలఁకన్. |
300 |
| చ. |
తెరలక కర్ణుఁ డవ్విజయుఁ దీవ్ర శర త్రయవిద్ధుఁ జేసి, మం దరధరు నస్త్రపంచక నితాంతహతిం గడు నొంచె నా శరో త్కరము వరప్రభావకలితం బగుటన్ మగుడంగ వచ్చె ని ష్ఠుర రభసం బెలర్ప మధుసూదనుఁ గ్రమ్మఱ నేసె నాతఁడున్. |
301 |
| క. |
అలఘు పటుభల్ల పంచక | ముల రెంటం గ్రీడి చిత్రముగ నయ్యస్త్ర మ్ములు మూఁడు మూఁడు శకల | మ్ములుగాఁ దునుమాడె, జనులు పొగడ నరేంద్రా! |
302 |
| క. |
కర్ణునిమెయి నాలోనన | కర్ణాంతాకృష్ట చండకాండము లధికో దీర్ణక్రోధంబున న | భ్యర్ణగతుం డగుచుఁ గ్రుచ్చె నతఁ డే పలరన్. |
303 |
| చ. |
మఱియు నరుండు సూతసుతు మర్మవిభేదన మాచరించిన న్మెఱుఁగులు గ్రమ్మునమ్ముల వినిశ్చలధైర్యము పేర్మి నాతఁ డు క్కఱక పెనంగె దానఁ గన లగ్గలమై వెస నమ్మహాభుజుం డఱిముఱిఁ జీఁకటుల్ గవియు నట్లుగ రోదసి నించెఁ దూపులన్. |
304 |
| తే. |
వెగడువడి చక్రరక్షకుల్, వెనుక దిక్కు | గాచు రథికులుఁ బార్శ్వసంగతులుఁ దమ్ము విడువఁ జాలక లజ్జ వో విడిచి రపుడు | గర్ణువారలు వాఱుట గని, విభుండు. |
305 |
| క. |
ఆ దిక్కువారు భీముం | డాదిగ నని సేయకుండు నన్నియతి యెడం దా దైన్యమొంది తప్పం | గా దని యూహింపనీని కలఁక కతమునన్. |
306 |