పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - తృతీయాశ్వాసము
అశ్వత్థామ దుర్యోధనునకు హితోపదేశంబు సేయుట (సం. 8-64-20)
చ. ‘కలన గురుండు భీష్ముఁడును గాండివిచేఁ బడి, రంగరాజు వా
రల కధికుండె? యాతని దురంబున నోర్వఁ గలండె? పూని యే
వల దని బుద్ధి సెప్పిన నవశ్యము నాతఁడు నిల్చు, నీతనిన్‌
నిలుపుము, నీవు ధర్మసుతునిం దగుమాటలఁ దేర్పఁ జొప్పడున్‌.
267
వ. తెలిసిన దామోదరుండు దెలివి నొందు. 268
క. ఙభీముఁడుఁ గవలును ధర్మజు | చే మరలెడువార, లేను జెప్పెడిపలుకుల్‌
భూమీశ! కురుకులమునకు | నీ మొనరాజులకుఁ బ్రజకు హిత మూహింపన్‌.
269
చ. వలవదు నన్నునుం గృపు నవధ్యులఁగాఁ గొని క్రీడి గెల్వ శ
క్తు లని తలంప; భీష్ముఁడును ద్రోణుఁడు లోక మెఱుంగఁగా నవ
ధ్యుల; హరికల్మి నారథికు దోర్బలలీల నడంగిపోరె! య
చ్చలమొ ఫలంబొ? యింకయిన సంధి యొనర్చుట మేలు వారితోన్‌.
270
చ. హరి సనుదెంచినప్డు మన మమ్మెయిఁ బల్కితి; మింక సంధికి
న్వెర వగు టేల గల్గు? నని నీవు దలంపకు; మాంబికేయు భూ
వరుఁడుఁగ జేయు ధర్మజుఁ డవశ్యముఁ బాండునృపాలుపాల యే
వురకు నమర్చుఁగాని చనవున్‌ వెలిమెచ్చును నొల్లఁ డేమియున్‌.
271
తే. పాండవుల యట్ల రాధాసుతుండు నాదు | పలుకులకు నియ్యకొను; నీవు బ్రదుకు తెరువు
పట్టు; బ్రదికిన నెల్లశుభములుఁ గలుగు; | నీసు మానుము చచ్చిన నేమి గలదు?
272
క. వెడతలఁపు లుడిగి, సంధికి | నొడఁబడు; మిది లెస్స; దీని కొడఁబడమి గడుం
జెడు తెరు; విప్పటి పదనున్‌ | గడవఁబడుట ద్రాటఁ దప్పుకరణియ చుమ్మీ!’
273
చ. అన విని, యమ్మహీరమణుఁ డాతని కిట్లను ‘నిప్డు దుస్ససే
నుని పని దీర్చి, మారుతతనూభవుఁ డాడిన మాట యేర్పడ
న్వినియును సంధి సేయుటకు నీ వభిలాషము సేఁత యొప్పునే?
పెనఁకువ కర్ణుఁ డే లుడుగు? బేలవె? మానుము ద్రోణనందనా!
274
శా. శ్రాంతిం బొందినవాఁడు పార్థుఁ, డపరిశ్రాంతుండు గర్ణుండు; దు
ర్దాంతోదగ్రత నేఁడు గీటడఁచు నీతం డాతనిన్‌; వహ్ని య
త్యంతంబున్‌ శిశిరత్వ మొందినను గోత్రాళుల్‌ వడం కాడినం,
గుంతీసూనునిచేతఁ గర్ణున కనిం గోల్పాటు వాటిల్లునే?’
275
వ. అని పలికి, యజ్జనపతి తన సైనికుల నాలోకించి సమరసముత్సాహ పోషణంబులగు భాషణంబుల ముఖరుం డగుటయు నఖిల తూర్యంబు లొండొండ మ్రోసెఁ బాండవబలంబునను భేరీ పణవాదుల రణనంబులు నిగిడె; నప్పుడు కర్ణుండును నర్జునుండును. 276
క. కరి కరి, గిరి గిరి, నంభో | ధర మంభోధరముఁ బెలుచఁ దాఁకిన క్రియఁ దాఁ
కిరి కడఁగి గగన తటియును | ధరణియు మ్రోయుచు వడంక ధరణీనాథా!
277
క. మెఱయు వెలిమావులును, గడు మెఱుఁ గారెడు నరదములును, మింటను మంటల్‌
వఱపెడు వాలమ్ములుఁ జూ | పఱ నత్తొలుతాఁకు వెఱఁగుపడఁ జేసె నృపా!
278
వ. ఇ వ్విధంబున నవ్వీరోత్తము లుదాత్తభంగిం దలపడి పెనంగం దొడంగిన, నుభయ సేనలవారలు నార్పులు నింగి ముట్టఁ జెలంగి; రట్టియెడ. 279
మ. ‘భరితోత్సాహతఁ బేర్చి, దీప్తు లడరన్‌ భల్లమ్ము లొక్కుమ్మడిం
బరఁగం జేయుము కర్ణు గాత్రములలోఁ బార్ధుండ! వే త్రుంపు మి
క్కురుభూపాలకు రాజ్యకాంక్ష, దొరయే కోదండపాండిత్య వి
స్ఫురణ గర్ణుఁడు నీకు? నీబలుపు నేపుం జూపు మత్యుగ్రతన్‌.’
280
వ. అని పాంచాలురు పార్థజయార్థ సంభాషణంబులు సేసిరి, కౌరవులు గర్ణు డగ్గఱి. 281
చ. ‘కడఁగుము నీదుబాణములఁ గవ్వడి గూలినఁ జాలు నంతతోఁ
జెడుదురు పాండవుల్‌ రణము సేయు నుదగ్రత యెల్లఁ దక్కి పే
రడవుల కేఁగి సాధుమునులై చరియింతురు; కౌరవేంద్రుఁ డీ
పుడమి సమస్తముం బొగడు పొంపిరివోవఁగ నేలు లీలతోన్‌!’
282
వ. అని తఱిమి పలికిరి; ప్రొద్దునుం జాల వ్రాలెఁ, గాలాంతక ప్రతిము లగు నప్పార్థకర్ణు లన్యోన్య జయార్థు లై పెనంగునప్పుడు. 283
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )