| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
నినద సముద్భటస్ఫురణ నింగి వగుల్పఁగ సర్వభూతకం పన మగు చమ్మెయిన్ నిగిడి, పార్థివసత్తమ! యేమి సెప్పుదుం? దునిమె, శిరంబు రక్తమునఁ దోఁగుచుఁ గర్ణుని యట్ట వజ్రఘో రనిహతిఁ గూలు గైరిక ధరాధరముం దలఁపింపఁ బట్టుగన్. |
361 |
| క. |
చరమగిరినుండి పడియెడు | తరణికరణి సూతపుత్రుతల వడఁ గాంతి స్ఫురణోజ్జ్వలంబు నతి సుం | దరమును నగు కాయమట్లు ధరణిం బడియెన్. |
362 |
| తే. |
అధిప! యంతన గను విచ్చి యఖిల జనులు | గనుఁగొనంగ, నయ్యుజ్జ్వలతనువు విడిచి చని సముద్దీప్త మైన తేజంబు వారి | జాప్తబింబంబు సొచ్చె నత్యద్భుతముగ. |
363 |
| వ. | అట్టి యెడ. | 364 |
| క. |
వినుము! మహీసురుశాపము | మనుజేంద్రా! సూతపుత్రు మరణాంతం బై యునికినొ, రథచక్రము మే | దినిఁ గ్రుంగుట లేక తొంటితెఱఁగున నుండెన్. |
365 |
| తే. |
దారుణాస్త్రజాలాంశుల వైరిసైన్య | తాప మొనరించి, యా సూతతనయ తరణి పార్థదుస్తరకాలవైభవము గడవ | ననువు లేమి, నవ్విధమున నస్తమించె. |
366 |
| క. |
సూతతనూజుఁడు వడినం | బ్రీతిం బాంచాలు రార్వఁ బెల్లుగఁ దూర్య వ్రాతంబు సెలఁగ, సమ్మో | దాతిశయము వొందెఁ బాండవానీకంబుల్. |
367 |
| క. |
నిడుఁగేలున్ బలుతొడలు | న్వెడఁదయురమునై రణావనిం గర్ణునొడల్ పడియున్నఁ గని విషాదం | బడరి తొలఁగుమాడ్కిఁ గ్రుంకె నర్కుం డంతన్. |
368 |
| తే. |
నిర్గతప్రాణు రాధేయు నిజకరములఁ | గరుణ పెంపున నంటుట కారణముగఁ బావనస్నాన మొనరింపఁ బోవునట్టు | లపరజలనిధిలోనికి నరిగె నినుఁడు! |
369 |
| వ. | అప్పుడు. | 370 |
| తే. |
కామఁ బాసిన కమలంబుకరణిఁ బొలుచు | కర్ణుతల యిలఁ బడియు నుదీర్ణకాంతి నొప్పు నట్టయుఁ జూచి శల్యుండు సిడము | ద్రెస్సి మోడైన యరదంబు ద్రిప్పె నధిప! |
371 |
| క. |
బలితపువెస నాఁబోతుం | బులి గొనినం, బసులు వాఱుపోలికిఁ గ్రోధో జ్జ్వలుఁ డగు పార్థుఁడు గర్ణునిఁ | బొలియించిన నీదుసైన్యములు వెఱఁ బఱచెన్. |
372 |
| తే. |
దీనవృత్తి శల్యుండు నీ సేనజనులు, నట్లు పాంచాలు రుబ్బున నార్వ, సిగ్గు వడక పాండవమధ్యము సిడము మరలి | మరలి చూచుచుఁ బాఱిరి మనుజనాథ! |
373 |
| ఉ. |
గాండివ ముక్తబాణమునఁ గర్ణుఁడు గూలుటయుం, గడంగి శ ల్యుం డరదంబు దోలుటయు, నొక్కమొగిన్ భవదీయ సేన లొం డొండ కలంగి పాఱుటయు నుల్లసితుం డయి చూచి, వాయుపు త్రుండు మహావిరావమున రోదసి పిక్కటిలంగ నార్చినన్. |
374 |
| క. |
ఆ నినదంబునఁ బాండవ | సైనికహృదయములు సౌఖ్యసంపద నొందెన్ మానవనాథ! భవత్సుత | మానసములు శోకఘూర్ణమానము లయ్యెన్. |
375 |
| వ. | ఇ వ్విధంబున కేతనరహితంబై మోడువడియున్న యరదంబు దోలికొని యరిగి, యమ్మద్రపతి బాష్పాకుల లోచనుండును దీనాననుండును సుదీర్ఘతర నిశ్వాసుండును నై యున్న కౌరవేశ్వరుం జేరంజని యతనితో నిట్లనియె : | 376 |
| చ. |
‘నరవర! యెందుఁ జూడమె రణంబులు! కర్ణుఁడు నర్జునుండు సం గర మొనరింతురే యిటులు? క్రౌర్యనిరూఢికి దివ్యు లొంది ర చ్చెరు; వది యట్టులుండె; విను చెప్పెద; నెంతయు భీతిఁ బొంది రా హరియు నరుండుఁ గర్ణువడి; కంత విధాతృఁడు దప్పె వానికిన్.’ |
377 |
| వ. | అని వెండియు. | 378 |
| మ. |
‘ధరణీచక్రము నీవ యేలుటకు నుత్సాహంబు వాటించి పో రిరి, ప్రాణంబులు డాఁపమిం బడిరి వీరిం జూడు!’ మంచుం దురం గ రథేభంబులు చుట్టుఁ గూలి వికటాకారంబులై యుండ నొ ప్పి రణోర్విం బడియున్న భూపతులఁ జూపెం; జూపి యా రాజుతోన్. |
379 |
| వ. | మఱియు నమ్మద్రపతి ‘యింద్ర యమ వరుణ కుబేరులఁ బోల్పందగిన యింత లింతలు మేటిమగలు మనకార్యంబునకై శౌర్యంబును బాహు వీర్యంబును మెఱయించి ధైర్యంబు వొగడొందం బెనంగుట విఫలం బగుట విధికృతంబు; దీనికి వగవం బనిలే’ దని చెప్పి ధనుఃఖండంబుల నాయుధ శకలంబులఁ గేతనాతపత్ర చామర గజఘంటా తురంగ కింకిణుల తునియలం, గంకణ కేయూర హారమకుటంబుల తుముళ్ళ నభిరామ భీషణం బగు రణాంగణంబు సూపి నీకయి పెనంగి సమసిన సైన్యంబు నాలోకింపు’ మనునప్పు డసురాంతక పార్థులు పాంచజన్య దేవదత్తంబులు పూరించిన నింగి వగుల్చు నమ్మహారవంబున గుండియ లవిసి కురుబలంబు లత్యంతవికలంబు లయి, వినిపాతిత రావణనందనుఁ డగు సుమిత్రానందను సింహనాదంబున భయం బంది పఱచు దానవసేనల చందంబున, నీ కొడు కున్న నెలవు విడిచి వలియంబాఱిన వెలవెలంబాఱు నక్కురుపతితో నా శల్యుండు ‘సంధ్యాసమయం బయ్యె నేఁటికిఁ గయ్యంబు సాలింపుము; వేగుటయుఁ జేయవలయు కర్జంబు సూచికొంద’ మనియె; నట్టియెడఁ గృపాశ్వత్థామ కృతవర్మ శకుని సుశర్మ ప్రభృతులగు దొరలు పాండవ జయంబునకు దైన్యంబు నొందిన మానసంబులతో నిశ్వాసంబులు నిగుడ, నక్కురుపతిఁ జేరం జనుదెంచిన నతండు మూఁకల మరల్ప రామియు దొరల యుత్సాహ వైకల్యంబును శల్యుమాటల తెఱంగు నూహించి, మరలి కర్ణుం బేర్కొని విలాపంబు సేయుచు ‘హా కర్ణ! హా కర్ణ!’ యను నెలుంగులతో బలంబులఁ దివియ నియమించినఁ, దివిసి కౌరవులు దోడం జనుదేర నిజ శిబిరంబునకుం బోయె; న ప్పోవుట జూదంబున నోడి పాండునృపకుమారులు హస్తినాపురంబు వెడలి యడవికిం బోవునప్పటి భంగి యై యుండె; నయ్యవసరంబున. | 380 |
| చ. |
తనువులఁ గర్ణబాణము లుదాత్తగతిం జెలువొందఁ గౌరవుల్ కనుకనిఁ బాఱ, శౌరియును గవ్వడియున్ వెలుఁగొంది రొక్కెడ న్వినుత మరీచులై పొడిచి నిర్భర సంతమసంబు నల్గడం జన నభిరామ మూర్తు లగు చంద్రుని సూర్యునిఁ బోల్పఁ బట్టుగన్. |
381 |
| వ. | ఇ ట్లొప్పి, యమ్మెఱుంగుటమ్ములు పెఱికివైచి, యొండొరుల యాననంబు లాలోకించి ‘రాత్రి ముఖం బయ్యె విరోధుల వెనుకొనుటకు సమయంబుగా’ దని సంభాషణంబులు సేసి, తమ సేనలం దివియ నియమించి; | 382 |
| తే. |
బలునిఁ దెగటార్చి మరలు గోపతియు హరియుఁ | బోలెఁ గర్ణుని సమయించి లీల మెఱయ మరలి రత్యంత మోదసంభరితు లగుచుఁ | గవ్వడియుఁ గృష్ణుఁడును బంధుగణము లలర. |
383 |
| వ. | అప్పుడు దివ్యు లన్నరనారాయణుల ననేకప్రకారంబులం బ్రశంసించుచు, నిజనివాసంబులకుం జనిరి; పాండవ సేనా జనంబులు సంతసంబునం దేలుచు ధనంజయుం జెలంగి పొగడుచుం బోయి; రివ్విధంబున జయంబునం బొంపిరి వోవుచుఁ బాండవులు విడిదల కరిగి, ధర్మనందను నగరిమొగసాలఁ జొచ్చి; రట్టియెడ. | 384 |
| క. |
చెన్నునఁ బాంచాలురు మును | ము న్నానృపుకడకు నేఁగి, ముదితాత్ముం డై యున్న యతనిఁ గని, దీవన | ల న్నతులను సమ్మదానులాపములఁ దగన్. |
385 |
| వ. | గారవించిరి; వివ్వచ్చుండు వేగంబ యరదంబు డిగ్గి చని, యజ్జనపతి చరణంబులకుఁ బ్రణతుండైన, నతం డెత్తి యాలింగనంబును మూర్ధాఘ్రాణంబును జేసె; భీమ నకుల సహదేవు లన్నరదేవోత్తమునకుఁ బ్రణమిల్లి, పార్థుం గౌఁగిలించిరి, కృష్ణసాత్యకు లప్పాండవాగ్రజునకు సవినయ ప్రణామంబు లాచరించిన నమ్మహీవరుం డత్యాదరంబున నభినందించె; నప్పుడు కృష్ణుం డతని కిట్లనియె: | 386 |