పురాణేతిహాసములు శ్రీమహాభారతము మౌసలపర్వము - ఏకాశ్వాసము
మద్యపానమత్తుఁడైన సాత్యకి కృతవర్మతల నఱకుట (సం. 16-4-27)
మ. అనుచున్‌ సంయమి శాపజాత ముసలాత్యంతాద్భుత స్ఫీత శ
క్తినిరూఢంబుగ నూనినట్టి నిజ నిస్త్రింశంబు శీఘ్రంబునం
గొని తద్దీధితి రాజిచే నతని చూడ్కుల్‌ విహ్వలత్వంబు నొం
ద నుదగ్రోద్ధతిఁ ద్రుంచెఁ దద్గళము రక్తంబుల్‌ ప్రసారంబుగన్‌.
048
తే. అట్లు కృతవర్మఁ దెగటార్చి యాతఁ డంత | నిలువ కుద్ధతుఁ డయి భోజకులముమీఁదఁ
గవిసె బాహావిలాసంబు ఖడ్గదీప్తి | చయము మెఱయంగ సంరంభసత్వరముగ.
049
చ. కవిసినఁ జూచి యాఁగుటకుఁ గా నలినాక్షుఁడు వోవునంత నా
హవఖరులైన భోజులును నంధకవీరులు నొక్కఁడై దెసల్‌
సెవుడుపడంగ నార్చి యతిశీఘ్రత సాత్యకిఁ జుట్టుముట్టి; ర
ప్డు విమల బోధుఁ డాహరి కడుం గనలొందియుఁ గాలవేదితన్‌.
050
చ. తమ్మునిఁ గాచునట్టి సముదగ్రతఁ గైకొన నొల్లఁ డయ్యె వే
గమ్మున రుక్మిణీసుతుఁ డఖండపరాక్రమ మొప్పఁ గిట్టి శౌ
ర్యమ్ము భుజాబలమ్ము మెఱయం గని సాత్యకి సంతసిల్లి ద
ర్పమ్మునఁ బేర్చె మెచ్చొలసి ప్రస్తుతి సేసిరి చూచు ఖేచరుల్‌.
051
చ. కనుఁగొని వృష్ణివీరులు నికామసముజ్జ్వల రోషవహ్ని నె
మ్మనమున నుత్థితంబుగ సమత్సర శౌర్యము విక్రమోద్ధతిం
బెనుపఁగ వార లిద్దఱకుఁ బ్రీతి యెలర్పఁగ సింహనాదముల్‌
ఘనపథమెల్ల నిండఁగ బలంబుఁ జలంబును నుల్లసిల్లఁగన్‌.
052
క. భోజాంధక సంగమన వి | రాజితమగు నబ్బలంబు రౌద్రోద్రేక
భ్రాజితు లయి తాఁకి పెనఁగి | రేజాలియు లేక కృష్ణుఁ డీక్షింపంగన్‌.
053
క. అయ్యిరు దెఱఁగున కప్పుడు | కయ్యమునకుఁ బరమసాధకంబుగఁ గలిగెన్‌
ముయ్యంచు తుంగ యచ్చట; | దయ్యము నేర్పు విను సెప్పెదం గురునాథా!
054
చ. మునివరశాపసంభవదమోఘగతిన్‌ ముసలంబు సాద్భుతం
బును నతిదారుణంబు నగు భూరిసముద్భట శక్తిఖేలనం
బున ముసలత్వ విస్ఫురణముం గలిగించెఁ బ్రవేశలీలఁ గై
కొని సమరప్రవర్తనము ఘోరతరంబుగ నెల్లతుంగలన్‌.
055
క. పొడి గాఁగఁ జేసి యమ్మెయి | జడనిధిలో వృష్ణివరుఁడు చల్లించిననుం
జెడదయ్యె మునివరుల యె | క్కుడు శక్తిని ముసలశక్తి కురువంశవరా!
056
సీ. యాదవవీరుల కా సమయంబున | మద్యపానోద్భూత మదము పేర్మి
మునివరామోఘవచన దివ్యశక్తినిఁ | జేసి కల్గద తుంగ వ్రేసినంత
టన ప్రతిభటునకుఁ దనుపీడ గలుగునే? | యను వివేకము దానిఁగొని విరోధి
నడచినయప్పుడు మిడుక లే కిలఁ బడఁ | గని యిది యెట్లొకో? యని తలంచు
 
తే. టయును గావున సమర మిట్టలపుభంగిఁ | జెల్లె గృత్రిమముసలచండోల్లసనము
లతిశయిల్లఁగ వారి కన్యోన్య వధ వి | హార దుర్వారసంచారఘోర మగుచు.
057
ఆ. తండ్రి పుత్రుఁ డన్న దమ్ముఁడు నాక య | య్యిరు దెఱంగు వారు నేపు రేఁగి
మడియ మోఁద గాలిఁ బడు మ్రాఁకుగముల తె | ఱంగు దోఁచె నేమనంగఁ గలదు?
058
తే. మునిశాపము వారలమది | ననయము నస మెక్కఁజేయ సం దొకఁడైనన్‌
విను మరలుట దెరలుటలే | కని బెట్టుగఁ జేసి రధిప! యార్పులు సెలఁగన్‌.
059
తే. అట్టియెడ విను భోజులు నంధకులును | జాలఁ గలుగుటఁ బ్రబలుండు సాత్యకియు స
మగ్రశక్తి ప్రద్యుమ్నుఁడు నాదిగాఁగ | మడిసె వారిచే వృష్ణిసమాజమెల్ల.
060
సీ. అనిరుద్ధుఁ బ్రద్యుమ్ను సాంబుని సాత్యకి | గదునిని మఱియును గలుగు వృష్ణి
వరుల నంధకభోజవర్గ పరాక్రమ | క్రీడల సమసి యా క్షితితలమునఁ
బడియుండఁ గనుఁగొని పరమమునీంద్ర శా | పంబు మహాశక్తిఁ బద్మనాభుఁ
డును దీవ్రకోపాగ్ని తనదుచిత్తమున ను | ద్ధురమై జనింపంగ దురములోనఁ
 
తే. బడక శేషించి మెఱసిన ప్రతిభటాళి | మీఁదఁ గవిసి తుంగలఁగొని మోఁది నిరవ
శేషముగఁ జేసె; నిట్టు లశేష యాద | వులును మౌసలవిస్ఫూర్తిఁ బొలిసి రధిప!
061
క. నారాయణుఁ డప్పుడు గాం | ధారీ వాక్యంబు తెఱఁగు దలఁచి మనమునం
బారంబుఁ బొందెనే యిది | యా రూపున ననుచు సంగరావని నొకఁడున్‌.
062
క. నిలుచున్నఁ జూచి రణసం | కులతఁ బడకయున్న దారుకుఁడు బభ్రుఁడు న
జ్జలరుహనాభు సమీప | స్థలికిం జని యిట్టులని రతనితోడ నృపా!
063
తే. అఖిలజనమును సంహృతమయ్యె నిచట | నేల? బలభద్ర దేవుఁ డున్నెడ ముకుంద!
యరసికొని పోయి యాతని చరితమునకు | ననుగుణంబైన వర్తన మాచరింపు.’
064
ఉ. అనుటయు నట్ల కాక! యని యంబుజనాభుఁడు బభ్రుదారుకు
ల్మనములు దల్లడిల్లఁగ కెలంకుల రా బలభద్రదేవు పో
యిన దెస నాదరం బెసఁగ నేఁగి కురుక్షితిపాగ్రగణ్య! యా
ఘనతరమూర్తి నవ్వలనఁ గాంచె మహీజము పొంత నుండఁగన్‌.
065
సీ. కాంచి దారుకు దెసఁ గనుగొని ‘నీవు వే | పాండురాజ తనూజుల పాలి కరిగి
వారికి యాదవవర్గ సంక్షయవిధ | మెఱిఁగించి యర్జును నిందుఁ దెమ్ము’
నావుడు నతఁడు మహావేగవంతంబు | లగు రథ్యములఁ బట్టి యలఁతియరద
మునఁ బూన్చికొని రయంబున నేఁగె నప్పు డ | మ్మురవైరి బభ్రుని మోముఁ జూచి
 
ఆ. ‘అతివపిండుఁ గుంజరాదులఁ బురిఁ జేర్చి | యరుగుదెమ్ము వేగ’ మనిన నాతఁ
డట్ల చేయు పనికి నయి చన నొకబోయ | త్రుంగఁ జేసె నతనిఁ దుంగ వ్రేసి.
066
ఆ. హరికిఁ గానవచ్చునంత దవ్వుల నట్లు | పడియె బభ్రుఁ; డతని పాటుఁ జూచి
సంయమీంద్రశాపశక్తికి నద్భుత | మంది యమ్ముకుందుఁ డన్నతోడ.
067
క. ‘సామజరథతురగములను | రామలఁ బురి సేర్చి యే మరలి వచ్చెద నీ
భూమిజము కడన నిలువు ద | యామయ! నా రాక వార్చి’ యనియె నరేంద్రా!
068
సీ. అని గజాదుల నింతులను గొని పురి కేఁగి | వసుదేవుఁగాంచి యవ్వసుమతీశు
తోఁ దగ నిట్లను దొల్లి కౌరవకుల | క్షయము సూచితి; నేఁడు సకలయాద
వులనాశమును గంటి నలఘుతేజోధన! | యఖిలబాంధవహీనమయిన యిచటి
మనువున వర్తింప మనసు గొల్పదు మున్న | యన్న కాననమున కరిగినాఁడు
 
తే. భవ్యతపమున నా బలభద్రుఁ గూడి | యేను దపమాచరించెద; నింక మీర
లరసికొనుఁడు సర్వంబును; | నరుఁడు వచ్చు | నిందు మీ పంపు సేఁతకై యెల్లినేఁడు.’
069
క. అనుచు నతని పాదంబులు | తన ఫాలతలంబు సోఁకఁ దాత్పర్యమునన్‌
వినతి నడపె నంతకుమును | వినియె జనులచేత సమరవిధ మతఁ డధిపా!
070
చ. విని బలుజీవి వోయి మది విహ్వలమై మెయి మ్రానుపాటు నొం
ద నునికి మీఁదఁ గేశవుఁడు దానును రాముఁడు నిల్లువాసి కా
ననమున నుండువారమని నైష్ఠికతం బలుకంగ నున్నచే
తనయు నడంగఁ జేష్టితము దక్కి శవాకృతి నుండె నత్తఱిన్‌.
071
క. తన మాటలు నజ్జన నా | థు నవస్థయు వినియుఁ గనియు దురపిల్లి సతీ
జను లొక్కటఁ బె ల్లాక్రం | దన మొనరించిన మురారి దయ మది నొలయన్‌.
072
సీ. అందఱ నూరార్చి ‘యర్జునుం డిప్పుడ | వచ్చు నిచ్చటికి మీవంత లెల్లఁ
దీర్చు నక్కురు కులదీపకుం’ డని యుప | శమవాక్యములఁ దేర్చి జనకుపాల
నాసీనుఁ డయి తదీయాంఘ్రిపద్మంబులు | తన చారుపాణిపద్మముల మెత్త
మెత్తన యొత్తుచు మెలుపొందఁ గర్జంపుఁ | బలుకులఁ జిత్తవిభ్రమము మాన్చి
 
తే. మఱియుఁ బార్థుని రాక పల్మఱును జెప్పి | యన్నయాఢ్యుఁడు పనిసేయ నున్నవారిఁ
‘గరితురంగాదికముల మీ రరసికొనుఁడు; | వినుఁడు కర్తవ్యమిట్టిది వేయునేల?’
073
తే. అని తెగఁ బలికి యతని వీ | డ్కొని రామునికడకుఁ జని యకుంఠితభక్తిన్‌
వినతుం డయి ‘మన జనకుని | యనుమతి వచ్చితి మహాత్మ!’ యనియె నరేంద్రా!
074
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )