| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| సీ. |
అవనీశ! వినుమంత నద్దారుకుఁడు సని | పాండవేయులఁగని పరమమునులు యాదవకులముఁ బేరలుకమైఁ దొల్లి శ | పించుట మునుఁ దలఁపించి పిదప జలధితీరముల నాసవపానమత్తులై | వృష్ణిభోజాంధకవీరు లెల్ల మునివరనిర్దిష్ట ముసలాత్మకములైన | ముయ్యంచుతుంగల మోఁదులాటఁ |
|
| తే. |
బేర్చి యొండొరువులఁ బరిమార్చుటయును | రామకృష్ణుల యునికియు నా మురారి తన్నుఁ బుత్తెంచుటయు సవిస్తారభంగిఁ | జెప్పె వారలు పెనువగఁ జేడ్పడంగ. |
095 |
| తే. |
సర్వయాదవసంఘంబు చావు విన్న | ద్రౌపదీప్రముఖాఖిలాంతఃపురాంగ నలును శోకించి యాక్రందనములు సేసి | రతికరుణముగఁ బురజను లార్తిఁబొంద. |
096 |
| సీ. |
దారుకుం డత్యంతధర్మవినీతిమై | నర్జునుతో ‘నన్ను నచ్యుతుండు నినుఁ దోడి తెమ్మని పనిచిన వచ్చితి’ | ననిచెప్పెఁ జెప్పిన నతనిఁ జూచి ‘యాదవకుల విషయం బైన యొప్పని | పలుకు నా వీనులఁ జిలుకునట్టె! యచటికి వేగంబ యరుగక యిచటఁ గా | ల్దన్ని యుండెడు నట్టి ధైర్య మెందుఁ |
|
| ఆ. |
గలదు నాకు? నీవు పిలువ నే?’ లని పల్కి | యన్నతోఁ దగంగ నాడి యాతఁ డక్కులాగ్రగణ్యు ననుమతితో ద్వార | వతికి నరిగె శీఘ్రగతి నరేంద్ర! |
097 |
| చ. |
అరిగి మగండు సచ్చిన కులాంగనయున్ శశి గ్రుంకినట్టి శ ర్వరియునుఁ బోల్పఁ బట్టగుచు వారిజనాభుఁడు లేని దీనతం బొరసి కృపైకభాజనతఁ బొందిన యప్పురిఁ జూచి మానసం బెరియఁగఁ జొచ్చె నేటి కెదురీఁదిన చాడ్పున నేమి సెప్పుదున్? |
098 |
| క. |
దారుకుఁడుఁ దోడఁ జనుదేరఁ | బౌర జనము లంతఁ దన్నుఁ బరమాశ్వాసం బారెడు మనములతోడను | గారవమునఁ జూడఁగా నగరికిం జనియెన్. |
099 |
| చ. |
చనుటయుఁ గ్రొత్త పేరడలు సైఁపఁగ లేక మురాంతక ప్రియాం గనలు పదాఱువేలును మొగంబులఁ గప్పఁగ బాష్పవారి రో దనరవముల్ చెలంగఁగఁ బదంబులు దొట్రుపడంగ దైన్యముల్ తనువులు దాల్చినట్టు దెరలం జనుదెంచిరి పార్థుపాలికిన్. |
100 |
| చ. |
వారలఁ గాంచి శోక మనివారణఁ జిత్తము పెల్లగింప న క్కౌరవసత్తముం డెలుఁగు గద్గదికం దగులంగ నేడ్చుచున్ దేరొక భంగి డిగ్గి యిలఁ ద్రెళ్ళిన యద్దురవస్థఁ జూచినన్ వైరులకైన డెందములు వ్రయ్యలుగా వగ దాఁకు భూవరా! |
101 |
| తే. |
రోదన ధ్వను లెసఁగంగ రుక్మిణియును | సత్యఙభామయు నప్పు డా సవ్యసాచి కడకు నేతెంచి పుడమిపైఁ బడిరి వనట | వెల్లి మునిఁగి యుల్లంబులు వెగడునొంద. |
102 |
| క. |
తక్కునుగల మహిషీజను | లక్కుంతీతనయుచుట్టు నవని నొఱగి లో నెక్కొనిన వగలఁ బొగిలిరి | ‘దిక్కెవ్వరు మాకు?’ ననుచు దీనత దోఁపన్. |
103 |
| క. |
వినుము ధనంజయుఁ డప్పుడు | తనుఁ దాఁ దేర్చికొని యెల్లతరుణుల నూరా ర్చె నతనిఁ దోడ్కొని హరి జన | కునికడకుం జనియె దారుకుం డట్టి యెడన్. |
104 |
| సీ. |
‘యాదవుల్ సమసిన నయ్యెడు నడలు చం | దమ కాక యివ్వనితాజనంబు నందు దైన్యముతోడి యత్యంత శోకస | మాకులత్వముఁ దోఁచె నస్మదీయ మగు చిత్తమున వీరియాతురత్వము గన్న | యంతన కొందల మతిశయిల్లెఁ గాని విశేషంబు గల్గదు కృష్ణుని దశ యెట్టిదో? యనుతల్లడంబు |
|
| ఆ. |
నెవ్వరొక్కొ దీని నెఱిఁగించువారను నెవ్వగయును గదిరెఁ గవ్వడికిని నధిప! దారుకునకు నట్టయ్యు నా నృపు | కడ నెఱుంగు వారు గాఁగఁ దారు. |
105 |