పురాణేతిహాసములు శ్రీమహాభారతము మౌసలపర్వము - ఏకాశ్వాసము
అర్జునుఁడు సకల స్వజనక్షయ దుఃఖితుండగు వసుదేవునిం గాంచుట (సం. 16-7-1)
క. తలఁకుచుఁ జని యతనిం గన | బలువగలం బొగిలి సెజ్జపై మేనిడి య
శ్రులు గ్రమ్మనున్న యవ్విభుఁ | డలమట క్రొత్త యయి మనసు నలమికొనంగన్‌.
106
ఆ. లేచి యడలి సవ్యసాచిఁ గౌఁగిటఁ జేర్చి | గద్గదిక నెలుంగు గడలుకొనఁగ
నడరి పెలుచ నేడ్చె నాఱడివోయిన | ప్రజలఁ బేరు గ్రుచ్చి పనవి పనవి.
107
క. మనుజాధిపుఁ డమ్మెయి రో | దన మటు సేయంగ నరుఁ డతని నూరార్చెన్‌
విను మవ్వసుదేవుం డి | ట్లను నాలుక తొట్రువడఁగ నాతని తోడన్‌.
108
చ. ‘మనుజుల మాత్ర గాక సురమాన్యపరాక్రమ ముల్లసిల్లఁగా
దనుజులఁ దాఁకి గీటడఁచు దర్పమునం బెనుపొంది మాఱులే
క నెగడి రట్టిబిడ్డల కకారణరోషమునం బరస్పరా
హననము గల్గి చావలసె నందఱ కక్కట! దైవ మల్గినన్‌.
109
క. విను నీ శిష్యులు సాత్యకి | యును ప్రద్యుమ్నుండు నిమ్మహోగ్రపుసమరం
బునఁ దొలుపీనుఁగు లైరని | వినియుఁ బ్రదికినాఁడ నేన వీరుఁడ జగతిన్‌.
110
క. తొలితొలి సాత్యకి కృతవ | ర్మలు రేఁపఁగ బుట్టె సంగరము దానను వా
రల దూఱనేల? మునిము | ఖ్యుల శాపం బట్టి చేఁతకుం దగియుండన్‌?
111
చ. వలసిన నెట్టి కార్యమును వావిరి నెట్టుగ నైనఁ జేయఁగా
వలఁతి మృతుం బరీక్షితుని వత్సలతన్‌ బ్రదికించె శౌరి; మొ
క్కలమున యాదవుల్‌ పెనఁగఁగాఁ గని మాన్పఁ డుపేక్షసేసె నీ
పొలియు టవశ్యభావ్యమని బుద్ధిఁ దలంచుట గాన నయ్యెడున్‌.
112
క. ఇది విధివశత్వమున నై | నది యని శోకంబు దొఱఁగు నట్టి వివేకం
బొదవదు ఫల్గున! యాఱడి | యదువంశం బెల్ల సమసె ననువగపేర్మిన్‌.’
113
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )