| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| క. |
అనునెడఁ గ్రీడి ‘యితఁడు కృ | ష్ణునుపేక్షయ చెప్పెఁ గాని శోక మడరియుం బనవఁడు కృష్ణునిఁ గావున | ననుమానము వలవ దమ్మహాత్ము నునికికిన్.’ |
114 |
| సీ. |
అని మదిఁ జర్చించె నప్పు డవ్వసుదేవుఁ | డతనితో ననియె ‘సమస్తయాద వులును మహామునీంద్రుల ఘోరశాపంబు | ఘనశక్తి నుద్భవించిన మహోగ్ర ముసలంబు విలసనమున ముసలాయమా | నము లైన తుంగల సమదవృత్తి నన్యోన్యవినిహతి యాచరించి గతాసు | లగుటయు నొక్కఁడు నతివపిండుఁ |
|
| ఆ. |
గరులఁ దురగములను నరదంబులను గొని | యరుగుదెంచెఁ గృష్ణుఁ డనిన నా ధ నంజయుండు తన మనంబు దల్లడపడ | ‘నమ్ముకుందుఁ డెచటి కరిగె నధిప!’ |
115 |
| క. |
అని యడిగిన వసుదేవుఁ డ | తని కిట్లను ‘నట్లు వచ్చి దామోదరుఁడే వనటం బొందుచు నుండఁగ | నను నూరార్చుటకుఁ గాఁగ నరవర! నాతోన్. |
116 |
| సీ. |
‘విధివశంబునఁ జేసి వృష్ణిభోజాంధక | నాశంబు వాటిల్లె నరున కేను జెప్పి పుచ్చినవాఁడ; నిప్పుడ యక్కౌర | వాగ్రణి యిప్పురి కరుగుదెంచు; నీయెడ భక్తుండు నినుఁ గొల్చియుండెడుఁ | బనిచినపని యొనర్పంగ వలఁతి యమ్మహాభుజుఁడు కార్యజ్ఞుండు శౌర్యస | మగ్రుండు విక్రమమహితుఁ డతఁడు’ |
|
| ఆ. |
నాఁగ నే ననంగ నరనాథ! భేద మిం | చుకయు లేదు విడువు శోక మతనిఁ జేతఁ బట్టి నీవు మాతంగతురగాది | కముల బంధుజనులఁ గాచికొనుము. |
117 |
| క. |
అతఁడు వనితలను బాలుర | నతిప్రయత్నమున నరసి యాపదఁ బాపున్ ధృతిసారమహిత! యంబుధి | కతిపయదినములను ముంపఁగల దిప్పురమున్. |
118 |
| సీ. |
యాదవుల్ తమలోన నాహవం బొనరింప | కటమున్న బలదేవుఁ డడవి కరిగి యత్యంత నియతిమై నధిక తపోవర్త | నంబునఁ దగిలియున్నాఁడు నాకు నదియ యొప్పెడు తెరువై యుండుఁ గర్తవ్య | మిట్టిది; వేయును నేల? యింక నొండు విచారంబు లుడిగి దయాలోల! | యనుమతి సేయు మప్పనికి నన్ను |
|
| తే. |
నా ధనంజయు చెప్పిన యట్ల సకల | కార్యజాతంబు నడపి నెగడు; మతండ సమరమృత యాదవుల కెల్ల సముచిత ప్ర | కారమునఁ జేయు నగ్నిసంస్కార మనియె. |
119 |
| క. |
ఆతడు కాలాంతరమున | బ్రాఁతిగ భవదీయ భవ్యపరలోక విధుల్ చేతోగతి భక్తిపరి | స్ఫీతములుగఁ జేయు ననియుఁ జెప్పెఁ గుమారా! |
120 |
| క. |
చెప్పిన నేను నొడంబడి | యప్పురుషోత్తముని నెమ్మి ననిచితి; నిట నీ చెప్పిన యట్టులు సేయుట | యొప్పైనను గలదు నీకు నొక్కఁడు సెప్పన్. |
121 |
| ఉ. |
పీనుఁగు పెంటగాఁ బడిన బిడ్డల నెల్లఁ దలంచు టెప్పుడున్ మానఁగ రామి తెల్ల; మిది మానసముం గలఁగింప నన్నమున్ బానము నెమ్మెయిన్ రుచికిఁ బట్టగునట్లును గాక యిద్దెసం దాను సహించి యేమిగతిఁ దావుకొనున్ మెయిఁబ్రాణ మర్జునా! |
122 |
| క. |
ఈ వనితలఁ బ్రజలను దం | తావళముఖవస్తువులను దగు చందమునన్ నీ వరసికొనుము బాహు | శ్రీ విశ్రుత! కృష్ణుపనుపు సెల్లింపవనా!” |
123 |
| సీ. |
అన విని ఫల్గునుం డా వృష్ణిపతి హృద | యము దేహనిరపేక్షమగు టెఱింగి డెందంబు నెవ్వగఁ బొంద నిమ్మేదినీ | రమణుతోఁ ‘గృష్ణ విరహితమైన యిద్దేశమున వసియింపంగ నాకుఁ జి | త్తము గొల్పునే? ధర్మతనయ భీము లును నేను మాద్రినందనులును బాంచాలి | యును నేకచిత్తుల మనఘ! వినుము |
|
| తే. |
ధర్మతనయుఁ డిక్కార్యంబు దలఁచి మున్న | నిశ్చయించి బాలకులను నెలఁత పిండుఁ దగుధనమును నింద్రప్రస్థ నగరమునకుఁ | జేర్పవలయుట మాకెల్లఁ జెప్పినాఁడు. |
124 |
| ఉ. |
కావున నప్పురంబున సుఖస్థితి నుండెడు నట్లు గాఁగఁ బృ ధ్వీవర! సంప్రయత్నమున వీరల నందఱ నంద పెట్టెదన్ నీవు పురస్సరుండవయి నెమ్మిఁ జనం గొనిపోయెదన్ భవ ద్భావము నుమ్మలంబుఁ బెడఁబాపుము; తప్పునె దైవకృత్యముల్?’ |
125 |
| క. |
అని పలికి దారుకునిఁ గనుఁ | గొని యాతని చిత్తవృత్తి గుందుట బుద్ధిం గని యిట్లనుఁ ‘గృష్ణుని పో | యిన వంక నెఱింగి పోద మేనును నీవున్. |
126 |
| ఉ. |
ఇచ్చటి కార్యముల్ నడపుఁ డిట్లని నెమ్మి నమాత్యకోటికిం బొచ్చెము లేక చెప్పి మఱి వోవుట యుక్తము నిల్చి వారలం దెచ్చుట కీవ పొ’ మ్మనిన దిగ్గన నాతఁడు వోయి యందఱం దెచ్చె సుధర్మ యన్సభకు దేవపతిప్రియసూనుఁ డుండఁగన్. |
127 |
| సీ. |
అమ్మండపమ్మున కరిగిన యమ్మంత్రి | వర్యు లక్కౌరవ వంశవర్యు వినయ మారఁగఁ బరివేష్టించి రమ్మహి | తాత్ముండుఁ గరమును నార్ద్రుఁ డగుచు గారవంబున వారి గలయఁ గనుంగొని | యంతరంగంబు శోకాగ్ని నెరియ వారలతో నిప్డు పౌరజనంబుల | నెల్లను బిలిపింపుఁ డేను మీకు. |
|
| తే. |
వారికిని నెఱిఁగింపంగ వలయునట్టి | పనులు గలవని చెప్పిన విని రయమున వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రు | లాదిగాఁ బ్రజ రావించి రథిపముఖ్య! |
128 |
| తే. |
. అరుగుదెంచి యా ప్రజ లుచితాసనమున | నున్న యయ్యింద్రనందనుఁ గన్న నతఁడు గరము నెమ్మి నయ్యందఱఁ గలయఁ జూచి | యిట్లనియె మోమునను దైన్య మెసకమెసఁగ. |
129 |
| క. |
‘వననిధి నేఁటికి నేడవు | దినమున నిప్పురము ముంచు దివిజులు గగనం బుననుండి చెప్పఁగా నే | వినినది యిది వెడలవలయు వేగమ మనకున్. |
130 |
| క. |
వినుఁ డింద్రప్రస్థపురం | బునకు నధీశుఁడుగ వజ్రుఁ బోఁడిమితో నే నునిచెద మీరెల్ల నతఁడు | మనుపంగాఁ దొంటి యట్ల మనుఁ డచ్చోటన్. |
131 |
| క. |
సరకులు భారవహులకును | భరియింపఁగఁ గొలఁది యయిన భంగిని మోపుల్ వెరవు పడఁగఁ గట్టుఁడు చె | చ్చెర శకటము లాయితంబు సేయుఁడు మీరల్. |
132 |
| ఆ. |
వాహనములు వానివాని ముట్టులు నొక్క | వంకగా నొనర్చి వలసినపుడ కట్టి వెడలిపోవునట్టి తెఱంగున | కనువు గాఁగఁ జేసికొనుఁడు వేగ. |
133 |
| క. |
ఈ దేశముప్రజ ధర్మజు | నాదరసంభావనముల నాజ్ఞానిరతిన్ యాదవవీరుల కలనాఁ | డేది తెఱం గట్టి మనికి యెసకం బారున్.’ |
134 |
| క. |
అని చెప్పి పురజనులఁ బోఁ | బనిచి సచివకోటితో నిభములాదిగ వా హనముల సవరణ బెరయం | గొనిరాఁదగిన పరిచారకుల మునుముట్టన్. |
135 |
| క. |
నియమింపుఁడు నగరి సరుకు | లయినవి యిట్టిట్టి భంగి నక్షీణములై యెయిదంగలవారలఁ గని | పయనము తెఱఁగు సమకట్టుపని మఱవకుఁడీ. |
136 |
| క. |
సుందరులకు బాలురకును | నందలములు వేసడములు నాయితములుగాఁ గందక కుందక చనువిధ | మొందఁగ సమకట్టుఁ డెడలకుండుఁడు తాల్మిన్. |
137 |
| తే. |
గతము లయిన కార్యంబులు గ్రమ్మఱింప | రాదుగాని మనకు ధర్మరాజు గలఁడు శేషజనరక్ష కొడయనిఁ జేయవచ్చు | వాసుదేవుని మనుమని వజ్రదేవు.’ |
138 |
| క. |
అని వారి నిండ్లకును బోఁ | బనిచి మదిని వగలు మిగులఁ బార్థుం డా రే యనవద్యచరిత! కృష్ణుస | దనమున వసియించె సముచితపువృత్తమునన్. |
139 |
| చ. |
తెలతెల వేగునప్డు వసుదేవుడు నిర్మలయోగనిష్ఠ మే నిల నిడి వర్ణనీయగతి కేఁగినఁ దత్సదనాంతరంబునం జెలఁగె ననేక రోదనవిశేషము లవ్వసుదేవవల్లభల్ నలువురు నెమ్మిఁ గూడి మరణంబునకై కయిసేసి రత్తఱిన్. |
140 |