| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| సీ. |
అన విని యమ్మహాముని క్రీడి కిట్లను | ‘సంయమిదత్తోగ్రశాపనిహతి నఖిలయాదవులును నట్లైరి; దానికి | నడలఁగఁ బనిలేదు; హరి యెఱుంగు మున్న యా సంక్షయ మన్న! చెప్పెద విను ప్రాప్తకాలంబగు పనికి నడ్డ పడనేల యని యాత్మ భావించి యతఁ డుపేక్షాపరుఁడై యుండెఁగాక; మూఁడు |
|
| తే. |
భువనములు నన్యథాత్వంబుఁ బొందఁజేయఁ | జాలువాఁడు కణ్వాదుల శాప ముడుప శక్తి లేకుండెనే? యవశ్యంబు భావి | యైనయదిగాన యదునాశ మయ్యెఁ జువ్వె. |
217 |
| ఉ. |
నీ వని సేయ నీవలని నెయ్యమునం గృప నన్యసైన్యముం దా వధియించు శూలధరతాస్ఫురణం బెసఁగంగ ముంద ర ద్దేవుఁడు; దానిఁ గాంచు భవదీయసమంచిత దృష్టియున్ నినుం గావఁడ యా మురాంతకుఁడు కాలవిపర్యయ మావహిల్లుటన్. |
218 |
| చ. |
ధరణిఙభరంబు వాప నవతారము నొందిన విష్ణుఁ డత్తెఱం గరుదుగ నిర్వహించి యజరామరనిష్కల నిర్వికార భా స్వరనిజసత్పదంబు నుపశాంతిపరుండయి పొందె దానికిం గురుకులవర్య! శోకమునఁ గుందుదురే మిముఁ బోటి బోధనుల్? |
219 |
| మ. |
అవనీభారము వాపి తా హరికిఁ దోడై భీమ సాహాయ్యగౌ రవదుర్దాంత పరాక్రమంబునఁ గృతార్థత్వంబునం జేసి య స్త్రవితానంబును నిన్నుఁ బాసి చనియెన్ దైవప్రకారజ్ఞ! నీ దువరిష్ఠాచరణంబునన్ సురలు సంతోషించి రప్పోరులన్. |
220 |
| క. |
బలమును బుద్ధియుఁ జేవయు | నలఘుమతీ! యుల్లసిల్లు నగు కాలమునం బొలియుం గాలవిపర్యయ | కలనంబున బుధుల కుబ్బుఁ గలఁకయుఁ గలవే? |
221 |
| తే. |
కాలమూలంబు సర్వంబుఁ గాన దీని | కొండు తలఁపులు దక్కి మీ రుత్తమంపు గతికిఁ జనుఁడు నిశ్చింత వికారతనులు | విడిచి యార్యజనంబులు వినుతి సేయ.’ |
222 |
| సీ. |
అన విని శోకమోహంబులు వాసిన | డెందంబు నిర్భరానంద మొంద నధికభక్తియు వినయంబును దలకొన | నర్జునుఁ డమ్మహితాత్ము వీడు కొని వారణపురికిఁ జనుదెంచి ధర్మజుఁ | గని తన పోయివచ్చిన తెఱంగు వినిపించె సర్వంబు నని యిట్లు సంయమి | నుతుఁడు వైశంపాయనుండు రామ |
|
| తే. |
కృష్ణు లాదిగఁ గల్గిన వృష్ణిచయము | భోజసంతతి యంధకరాజి నూత్న వృత్తములు జనమేజయ విభున కింపు | సెవులఁ దళుకొత్త నేర్పడఁ జెప్పుటయును. |
223 |