| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
ధనదుసభ యింద్రసభతో | నెనయగుచు మహావిభూతి నెంతయు నొప్పుం దన దివ్యశక్తి నాతం | డొనరఁగ నిర్మించె దాని నుత్తమమణులన్. |
74 |
| వ. | అదియును నూఱుయోజనంబుల నిడుపును డెబ్బదియోజనంబుల వెడల్పునుం గలిగి సితప్రభంబయి గగనచరంబయి కనకమయతరులతాలంకృతం బయి తటిల్లతావిచిత్రశరదంబుదంబు ననుకరించు చుండు. | 75 |
| క. |
అందుఁ గుబేరుఁడు పరమా | నందంబున నుండు ధర్మనందన! విలస న్మందార పారిజాతక | నందన మందానిలాభినందితుఁ డగుచున్. |
76 |
| వ. | అతని ననవరతంబును నరకిన్నర నాములైన గంధర్వులును, వరాహకర్ణ గజకర్ణ మాణిభద్ర హేమనేత్ర విభీషణ పింగళక ప్రవాళకాదులయిన యక్షులును, నలకూబరుండును, నూర్వశీతిలోత్తమా ఘృతాచీ మేనకా విభావరీ రంభా ప్రభృతులయిన యప్సరసలును సేవింతు; రే నెప్పుడు ననేక దేవర్షి గణంబులతో నరిగి చూచుచుండుదు. | 77 |
| ఉ. |
వానికి నెయ్యుఁడై యమరవంద్యపదాంబుజుఁ డంబికా బృహ త్పీనపయోధరాగ్ర పరిపీడితవక్షుఁడు భూషణీకృతా హీనుఁ డశేషలోకగురుఁ డీశ్వరుఁ డెప్పుడు నంద యుండు నా నా నిశితాయుధాయుతసనాథమహాద్భుతభూతకోటితోన్. |
78 |