| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | ఆ జరాసంధుండును నాయుధ నిహతులుగాని హంస డిభకులు దనకు సహాయులుగా నపరాజితంబయిన పరాక్రమంబునం బరచక్రపతుల భంజించుచు. | 160 |
| చ. |
అయన విహీనుఁడౌ సవితృనట్లు, విఖండిత పక్షతిద్వయుం డయిన ఖగేంద్రునట్లు, మఱి హంసుఁడు నా డిభకుండు నంతక క్షయ గతులైన నిప్డు గతగర్వమునన్ మగధేశ్వరుండు ని శ్చయమతి నున్నవాఁడు నిజసంక్షయకాలవిశంకితాత్ముఁడై. |
161 |
| ఉ. |
అమ్మగధేశు నుగ్రబలు నాయుధయుద్ధమునన్ జయింపఁగా నిమ్మహి నోప రెవ్వరు, నుమేశ్వరుఁ డట్టి వరమ్ము వానికిన్ నెమ్మిన యిచ్చెఁ, గావున వినీతుఁడు వాయుసుతుండు మల్లయు ద్ధమ్మున నోర్చు నాతని నుదగ్రమహాభుజశక్తి యేర్పడన్. |
162 |
| క. |
బలిమిమెయిఁ బార్థురక్షా | బలమును బవనసుతు బాహుబలమును నా ని ర్మలనీతిబలము నీకుం | గలుగ నసాధ్యంబు గలదె కౌరవనాథా! |
163 |
| చ. |
తడయక యేఁగి నీతి బలదర్పము లొప్పఁగ వాని డాసి, క వ్వడియును నేను భీముఁడు నవశ్యముఁ బోర బృహద్రథాత్మజుం గడిఁది రిపున్ జయింతుము జగన్నుత! న న్నెద నమ్ముదేని యి ల్లడయిడు భీము నర్జును నలంఘ్యబలాఢ్యుల నావశంబునన్. |
164 |
| వ. | అని నిశ్చయించి పలికిన నారాయణుని, విజయశ్రీ విభాసిత ముఖులైన భీమార్జునులం జూచి సంతుష్టాంత రంగుండయి ధర్మతనయుం డిట్లనియె. | 165 |
| చ. |
ప్రియహితసత్యవాక్య! యరిభీషణ! కృష్ణ! భవన్నిదేశ సం శ్రయమున నున్న మా కధికశత్రుజయం బగు టేమి పెద్ద, ని శ్చయముగ నింక మోక్షితుల సర్వమహీశులు, నిమ్మహాధ్వర క్రియయును సిద్ధిఁబొందెన యకిల్బిషకీర్తి వెలుంగుచుండఁగన్. |
166 |
| క. |
ధరణీధర! సర్వగుణా | కర! కరుణానిరత! సర్వకార్యైకధురం ధర! నినుఁ బడసిన మాకును | హరివిక్రమ! పడయరానియవియుం గలవే! |
167 |
| వ. | అని సంతసిల్లి మఱియు నాత్మగతంబున. | 168 |
| క. |
నయనములు నాకుఁ బవనత | నయ విజయులు, మనము కమలనాభుఁడు; వీరిం బ్రియహితులఁ బాసి నిమిషం | బయినను నెట్లుండ నేర్తు నవిచేష్టుఁడనై. |
169 |
| వ. | ‘అయినను నా హృదయంబు గరంబు హృద్యంబగుచున్నయది; కృష్ణార్జునులం దలంచినవారికి శ్రీ విజయంబు లగు ననిన నమ్మహాత్ములఁ దనకు సహాయులఁగాఁ బడసిన భీమసేనునకు శ్రీ విజయంబు లగుట యేమి సందేహం?’బని నిశ్చయించి ‘మీకుఁ గార్యసిద్ధి యయ్యెడు మరుగుం’ డని పంచిన. | 170 |
| క. |
ఘోరరిపుఁ జంప నరిగెడు | వీరుల వార్‌ష్ణేయపాండవేయుల సింహా కారులఁ జూచి మనంబున | ధీరుఁడు ముదమందె నయ్యుధిష్ఠిరుఁ డంతన్. |
171 |