| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | కృష్ణభీమపార్థులు కృతకస్నాతకులయి చని, యేక పర్వత ప్రభవంబులైన కాల కూట శోణ గండకీ సదానీరలను నేఱుల లంఘించి, సరయూనదియునుం బూర్వకోసల మిథిలా దేశంబులును గంగయుం గడచి, పూర్వాభిముఖులయి నిత్య ప్రయాణంబుల నమ్మగధదేశంబు సొచ్చి గోరథం బనుపర్వతం బెక్కి. | 172 |
| చ. |
ఉరుతర హర్మ్యమాలికల నొప్పు గిరివ్రజ మన్పురంబుఁ గాం చిరి నవసౌరభప్రసవచిత్రవనావళి గల్గుదాని నె వ్వరికి దురాసదంబు లగు వజ్రమయోన్నతవప్రచారు గో పురముల దాని నయ్యలకఁ బోలెడు దాని మహార్థసంపదన్. |
173 |
| వ. | కని దాని యపూర్వ రామణీయక సమృద్ధి కచ్చెరువడి యచ్యుతుండు భీమార్జునుల కిట్లనియె. | 174 |
| క. |
గోరథమును ఋషభము వై | హారము ఋషిగిరియుఁ జైత్యకాద్రియు ననఁగా భూరిగిరు లేను దీనికి | శూరభటులువోలెఁ గాచి చుట్టును నుండున్. |
175 |
| వ. | ‘దానన చేసి యిప్పురంబు గిరివ్రజంబు నాఁబరఁగె; నిందుఁ దొల్లి గౌతముం డౌశీనరి యను శూద్రయందుఁ గాక్షీవాదుల సృజియించె; నట్టి గౌతమానుగ్రహంబునను నీ దుర్గ బలంబుననుం జేసి యిమ్మాగధుల నెవ్వరును జయింప నోప’ రనుచుఁ దద్ద్వారంబునం బురంబు సొరనొల్లక చైత్యకగిరి శృంగంబున కరిగి యందున్న మూఁడు భేరులం జూపి, ‘తొల్లింటి మాగధులు మానుషాదంబను ఋషభంబు వధియించి దాని చర్మంబున వీని నిర్మించి; రివి యిప్పురంబు వింతవారు చొచ్చునప్పు డమ్మునిశక్తిం జేసి మ్రోయు’ ననిన. | 176 |
| ఉ. |
దారుణ వజ్రచారు భుజదండములన్ బలవద్విచార గం భీరులు ధీరు లాక్షణమ భేరులు మూఁటిని వ్రచ్చి చైత్యక స్ఫార నితంబదేశమును భగ్నము సేసి గిరివ్రజంబు న ద్వారమునందుఁ జొచ్చి రతిదర్పితు లా యదుకౌరవోత్తముల్. |
177 |
| క. |
ఘోరాకారులు మాలా | కార గృహంబులకు గంధిక గృహంబునకున్ దా రరిగి మువ్వురు బలా | త్కారంబునఁ గొనిరి పుష్పగంధము లొప్పన్. |
178 |
| వ. | అందు మాల్యాలంకృతమౌళులుఁ జందనాగరు రూషితహస్తులు విస్మయమాన మాగధ నిరీక్ష్యమాణులు నయి రాజమార్గంబు గదియం జని, యనవరతంబును బ్రాహ్మణులకు సుప్రవేశంబగుచున్న జరాసంధు మందిరంబు గోవాసంబు హిమవత్సింహంబులు సొచ్చునట్లు యాదవ పాండవ సింహంబులు సొచ్చిన. | 179 |