| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అట సహదేవుండు దక్షిణ దిక్కున కరిగి సుమిత్ర శూరసేన దంతవక్త్ర యవనులను, గోశృంగగిరి నివాసులను జయించి కుంతిభోజుచేతం బ్రియపూర్వకంబున సత్కృతుం డయి. | 246 |
| ఆ. |
జలజనాభుపగతు జంభకుండనువాని | భూరిబలునిపుత్త్రుఁ బోరిలోన నొడిచి వానిచేత నుత్తమ గజహయ | రత్నతతులు గొని పరాక్రమమున. |
247 |
| వ. | నర్మదాసమీపంబున నవంతి పతుల విందానువిందుల మందదర్పులం జేసి చని, మాహిష్మతీపురంబు పయి విడిసిన. | 248 |
| క. |
వీరుఁడు తత్పురవిభుఁ డు | గ్రారివిమర్దనుఁడు నీలుఁ డనువాఁడు మహా దారుణబలుఁ డై సమర | ప్రారంభాత్యుగ్రుఁ డయ్యెఁ బాండవుతోడన్. |
249 |
| వ. | అంత. | 250 |
| క. |
దరికొని దహనుం డెగసెను | వరుసను సహదేవుసకలవాహినిమాద్య త్కరులపయిఁ దురగములపయి | వరరథములపయిఁ బదాతివర్గములపయిన్. |
251 |
| వ. | అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. | 252 |