| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| ఆ. |
కడఁగి యనలుఁ డేమి కారణంబున సహ | దేవు సేనపయి నతిప్రచండ శిఖలు గప్పె? దీనిఁ జెప్పు మేర్పడ నాకు | ననఘ! వినఁగ వేడ్కయైన యదియు. |
253 |
| వ. | అనిన వైశంపాయనుం డి ట్లని చెప్పెఁ:దొల్లి నీలువంశంబున నిషధుం డనురాజు రాజ్యంబున జాతవేదుండు విప్రుండయి వేదాధ్యయనంబుసేయుచు మాహిష్మతీపురంబున నుండి ప్రమాదవశంబునం బారదారికుండయిన నెఱింగి రాజనియోగులు వానిం బట్టికొని పోయి రాజసమక్షంబున శాస్త్రవిహితదండనంబున దండింపం బోయిన. | 254 |
| క. |
అవమానదుఃఖితుండయి | పొవయుచు రోషానలంబు పోఁడిమి వెలుఁగం బవనసఖుఁ డుగ్ర కణములు | నెవయఁగఁ దన పొడవు చూపె నిషధుని మ్రోలన్. |
255 |
| వ. | వాఁడును గడు భీతుండయి యగ్నిదేవునకు నమస్కరించి ‘మహాపురుషా! నాయజ్ఞానంబు సహింపవలయు’ నని ముకుళిత కరకమలుం డయిన వానికి వైశ్వానరుండు ప్రసన్నుండయి ‘నీ కోరిన వరం బిచ్చెద వేఁడు’మనిన వాఁ డి ట్లనియె. | 256 |
| తే. |
ఇప్పురంబు జయింపంగ నెవ్వరేని | వత్తు రుద్ధతులయి శత్రువరులు వారు దర్పమేది నీచేత నిర్దగ్ధులై వి | హీను లవునట్లుగా వర మిమ్ము నాకు. |
257 |
| వ. | అనిన నా రాజునకు నగ్నిదేవుం డభిమతం బయిన వరం బిచ్చి, ‘మఱి నీవు నాకుం బ్రతిప్రియంబు సేయు; మిప్పురంబు నింతు లెంతయు మనోజరాగిణులు గావున వీరల స్వైరిణీవృత్తియెల్ల కాలంబు సహింపవలయు’ నని యడిగిన, నాఁటంగోలె మాహిష్మతీ పురంబు స్త్రీలకు స్వైరిణీత్వంబు నిర్దోషంబయ్యె; నగ్నిదేవుండును నప్పురంబుపై వచ్చిన వారలనెల్ల దగ్ధ సైన్యులం జేయుచు దాని రక్షించుచుంటంజేసి పరరాష్ట్రపతు లగ్ని భయంబున నప్పురంబు పరిహరింతు; రది కారణంబుగా సహదేవు సైన్యంబెల్ల నగ్నిపరీతంబయినం జూచి సంచలింపక సహదేవుండు శుచియై వార్చి దర్భశయనంబున శయనించి యగ్నిసూక్తంబుల నగ్నిభట్టారకు ని ట్లని స్తుతియించె. | 258 |
| సీ. |
‘నీ తదర్థంబులై నిఖిల వేదంబులు | వర్తిల్లు లోకపావనము లగుచుఁ; బావనంబులలోనఁ బావనుండవు నీవ; | యజ్ఞంబులును నీవ హవ్యవాహ! ధర్మనిత్యుండైన ధర్మజు కావించు | క్రతువు భవత్ప్రీతికరము గాదె! దానికి విఘ్నంబు దలఁచుట ధర్మువె? | వరద! వైశ్వానర! వాయుమిత్త్ర!’ |
|
| ఆ. |
యనిన నగ్నిదేవుఁ డతనికి సంప్రీతుఁ | డయి తదీయసేన కగ్నిభయముఁ బాచె; దాని నెఱిఁగి భక్తుఁడై నీలుండు | కౌరవేంద్రుననుజుఁ గానవచ్చె. |
259 |