| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| మ. |
అవనీనాథు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయు దు ర్వ్యవసాయంబునఁ గృష్ణుఁ గష్టచరితున్ వార్‌ష్ణేయుఁ బూజించి నీ యవివేకం బెఱిఁగించి తిందఱకు; దాశార్హుండు పూజార్హుఁడే? |
8 |
| చ. |
కడుకొని ధర్మతత్త్వ మెఱుఁగంగ నశక్యము; ధర్మబాహ్యు ని న్నొడఁబడ నిష్టుఁడై కఱపి యుత్తము లుండఁగ వాసుదేవుఁ డ న్జడునకుఁ బూజ యిమ్మని విచారవిదూరుఁడు భీష్ముఁ డెంతయున్ వెడఁగుఁదనంబునం బనిచె; వృద్ధులబుద్ధులు సంచలింపవే. |
9 |
| చ. |
ఇతనికిఁ గూర్తురేని ధనమిత్తు రభీష్టములైన కార్యముల్ మతి నొనరింతు రిష్టుఁడని మంతురుగాక, మహాత్ములైన భూ పతులయు విప్రముఖ్యులసభన్ విధిదృష్ట విశిష్ట పూజనా యతికి ననర్హు నర్హుఁ డని యచ్యుతు నర్చితుఁ జేయఁ బాడియే? |
10 |
| సీ. |
ఈతని వృద్ధని యెఱిఁగి పూజించితే | వసుదేవుఁ డుండంగ వసుమతీశ! ఋత్విజుం డని విచారించి పూజించితే | ద్వైపాయనుం డుండ ధర్మయుక్తి; యాచార్యుఁ డని వినయమునఁ బూజించితే | కృతమతుల్ ద్రోణుండుఁ గృపుఁడు నుండ; భూనాథుఁ డనియెడు బుద్ధిఁ బూజించితే | యాదవుల్ రాజులే యవనిమీఁదఁ; |
|
| ఆ. |
బూజనీయులైన పురుషులలోపల | నెవ్వఁడయ్యెఁ గృష్ణుఁ? డిట్టు లేల పూజ్యులయినవారిఁ బూజింపనొల్లక | భీష్ము పనుపుఁ జేసి బేల వయితి. |
11 |
| చ. |
పురుష విశేష విత్తముఁడు పూజ్యుఁడు రాజులలోన నీయుధి ష్ఠిరుఁ డని నీ గుణాళి ప్రకటించి మనంబులలోన ధారుణీ శ్వరులు భవన్మఖంబునకు వచ్చిన నిందఱ కివ్విధంబునం బరఁగ నవజ్ఞ సేయు టిది పాడియె ధర్మువె ధర్మనందనా! |
12 |
| క. |
నీ వెఱుఁగక యిచ్చిన నిది | నా విషయమె యని మనంబునం దలఁపక ల జ్జా విరహితుఁ డయి యర్ఘ్యము | గోవిందుఁడు గొనియెఁ; దనకుఁ గొను టుచితంబే? |
13 |
| క. |
చనఁ బేడికి దారక్రియ | యును, జెవిటికి మధురగీతియును, జీకునక త్యనుపమ సురూపదర్శన | మును జేయుటఁ బోలుఁ గృష్ణుఁ బూజించు టిలన్. |
14 |
| ఉ. |
‘ఈ యవనీశ్వర ప్రవరు లిందఱు నిన్ను నగంగ నిట్లుగాఁ జేయుదె ధర్మరా జను విశేషసమాఖ్య నిరర్థకంబుగా ధీయుత!’ యంచు ధర్మజ నదీసుత కృష్ణుల నెగ్గులాడుచుం బోయె సదంబు వెల్వడి సపుత్త్రబలుండయి చైద్యుఁ డల్కతోన్. |
15 |
| వ. | ఆ శిశుపాలు పిఱుందన చని ధర్మనందనుండు వానిం బ్రియవచనంబుల ననునయించుచు ని ట్లనియె. | 16 |
| క. |
భూరిగుణోన్నతు లనఁదగు | వారికి ధీరులకు ధరణివల్లభులకు వా క్పారుష్యము చన్నె? మహా | దారుణ మది విషముకంటె దహనముకంటెన్. |
17 |
| ఉ. |
ఆదిజుఁడైన బ్రహ్మయుదయంబున కాస్పదమైనవాఁడు, వే దాది సమస్త వాఙ్మయములందుఁ బ్రశంసితుఁడైన వాఁడు,లో కాది, త్రిలోకపూజ్యుఁ డని యాత్మ నెఱింగి పితామహుండు దా మోదరుఁ జెప్పెఁ బూజ్యుఁ డని; యుక్తమ కా కిది యేమి దోసమే? |
18 |
| క. |
పరమార్థ ప్రతిభఁ దమో | హరు నచ్యుతు భీష్ముఁ డెఱిఁగిన ట్లెఱుఁగఁగ నీ కరిది శిశుపాల! పెద్దల | చరితం బల్పులకు నెఱుఁగ శక్యమె యెందున్? |
19 |
| క. |
గురుఁ డని సమస్తలోకో | త్తరుఁ డని నీకంటె వృద్ధతములైన నరే శ్వరు లచ్యుతు నర్చన నెడఁ | గర మభినందింప నీకుఁ గాదనఁ దగునే. |
20 |
| వ. | అని యా శిశుపాలుం బట్టువఱుచుచున్నంత ధర్మరాజునకు భీష్ముం డి ట్లనియె. | 21 |