| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | ఇట్లు నిఖిల క్షత్త్రియత్రాసజననంబుగా నలిగి దంతసందష్ట దారుణ ముఖుండై శిశుపాల నిర్మూలనాభీల సంరంభంబున నున్న భీమసేను వారించి భీష్ముం డిట్లని చెప్పె ; ‘నిద్దురాత్ముండు తొల్లి చేదివంశంబున దమఘోషుం డనువానికి సాత్వతికిం జతుర్భుజ లలాట నేత్రంబులతో నుదయించి. రాసభరవంబున నేడ్చుచున్నం జూచి తల్లిదండ్రులు భయవిస్మయాధీనమనస్కులయి యున్న వారికి నొక్క యశరీరభూతం బిట్లనియె.’ | 52 |
| ఆ. |
వీని నొరులు చంపఁగా నోప రెవ్వరు; | నెవ్వరేని వీని నెత్తికొనుడు మిగిలియున్న బాహుయుగళంబుఁ గన్నును | నడఁగు వీని కతఁడ యంతకుండు. |
53 |
| వ. | అనిన నయ్యశరీరివచనంబులు విని వార లాశ్చర్యమానసులయి, యా కుమారుం జూడవచ్చిన వారికెల్ల నెత్తికొన నిచ్చుచున్నంత. | 54 |
| చ. |
అతివికృతస్వరూపధరుఁ డైన కుమారకుఁ బ్రీతితోడ సా త్వతిఁ దమ మేనయత్తను ముదంబునఁ జూడఁగఁగోరి యద్భుత ప్రతిభులు రామకేశవులు పన్నుగ నేఁగిరి చేదిధారుణీ పతిపురి కొక్కనాఁ డఖిల బాంధవ మంత్రిసుహృత్సమేతులై. |
55 |
| వ. | ఇట్లు వచ్చిన రామకేశవులం బ్రియసత్కారంబులఁ బూజించి సాత్వతియు నబ్బాలు బలదేవుచేతికి నెత్తికొననిచ్చి తదనంతరంబ నారాయణుచేతికి నిచ్చిన. | 56 |
| క. |
అక్కొడుకు నబ్జనాభుం | డక్కజముగ నెత్తికొనుడు నందఱుఁ జూడన్ గ్రక్కున నొక్కట నడఁగెను | మిక్కిలి చేతులును వానిమిక్కిలి కన్నున్. |
57 |
| వ. | దానిం జూచి సాత్వతి యద్భుతచిత్తయై యశరీరిపలుకు లప్పుడు దలంచి తన పుత్త్రునకు మురవైరివలన మరణం బగుట యెఱింగి యతని కి ట్లనియె. | 58 |
| క. |
కుపథప్రవృత్తుఁ డయి వీఁ | డపనయమున నీ కనిష్టుఁ డయినను గరుణా నిపుణుఁడవై నీ మఱఁదికి | నపరాధశతంబు సైఁపుమయ్య యుపేంద్రా! |
59 |
| వ. | అని వీనితల్లి తొల్లి జగద్వల్లభుండైన జనార్దనుం బ్రార్థించి తత్ప్రసాదంబున వరంబు వడయుటం జేసి శతాపరాధంబులు నిండునంతకు వీఁ డన్యులచేత నప్రతిహతుండు; కృష్ణునిచేత నిహతుండగు; నది కారణంబుగా. | 60 |
| చ. |
ఇతనికి నిట్లు న న్నుఱక యెగ్గులు వల్కఁగఁ బోలెఁగాక, యు ద్ధతమతి నన్యు లీతని విధంబునఁ బల్కి మదీయచాప ని ర్గత చటులోగ్రమార్గణ నికాయ పయోధి మునుంగ కిట్లు ద ర్పితులయి పోవనేర్తురె గభీరపరాక్రమ! మారుతాత్మజా! |
61 |
| వ. | అని పలుకుచున్న భీష్మభీముల నతిక్రమించి శిశుపాలుండు జనార్దనున కభిముఖుండయి యి ట్లనియె. | 62 |
| మ. |
అవమాన్యున్ సభలోన మాన్యుఁ డని సౌహార్దంబునం గౌరవ స్థవిర ప్రేరణ నిన్నుఁ బాండుతనయుల్ తప్పంగఁ బూజించి ర య్యవివేకాస్పదు లైన పాండవులు మోహాంధుండు భీష్ముండుఁ గే శవ! నీవుం గడఁగుండు నాకు నెదురై సంగ్రామరంగంబునన్. |
63 |
| వ. | అని శిశుపాలుండు గర్వించి పలికిన విని చక్రధరుం డఖిల రాజచక్రంబు విన నిట్లనియె. | 64 |
| సీ. |
ప్రాగ్జ్యోతిషంబున భగదత్తుపయి నేము | వోయిన నీతఁ డన్యాయవృత్తి నిట బాలవృద్ధుల కెల్ల భయంబుగా | ద్వారకాపురిఁ గాల్చె, వీరులైన భోజరాజన్యులు పొలఁతులతోడ రై | వతకాద్రిఁ గ్రీడాభిరతిఁ బ్రమత్తు లయియున్న వారల నదయుఁడై వధియించె; | దేవాభుఁ డగు వసుదేవు చేయు |
|
| ఆ. |
నశ్వమేధమునకు నభ్యర్చితం బైన | హయము నపహరించి యజ్ఞమునకు విఘ్న మాచరించె; వీఁ డతిపాపుఁ డై | బభ్రుభార్యఁ దనకు భార్యఁ జేసె. |
65 |
| వ. | ‘మఱియు వాగ్విషయంబు లయిన యపకారంబు లనేకంబులు సేసె; మా యత్త సాత్వతి నన్నుం బ్రార్థించుటంజేసి యిద్దురాత్ముండు సేసిన యపరాధశతంబు సహించితి; నిప్పుడు మీ రిందఱు నెఱుంగ నాయం దకారణ వ్యతిక్రమం బుపక్రమించి యత్యంతశత్రుం డయ్యె’ ననిన విని శిశుపాలుం డతిపరుష వచనుం డగుచుఁ బురుషోత్తమున కి ట్లనియె. | 66 |
| క. |
నీ కూర్మియు నీ యలుకయు | నా కవి యేమిటికి దుర్గుణప్రియ! మొదలన్ నా కిచ్చిన యక్కన్యకఁ | జేకొని నీ కిట్లు పలుక సిగ్గును లేదే! |
67 |