| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| చ. |
అని శిశుపాలుఁ డొండొకట నప్రియముల్ హరిఁ బల్కుచున్నచో ననలశిఖాలి దూల దనుజాంతకచక్రము రాజచక్ర మె ల్లను భయమంద మూర్ధవికలంబుగ నప్పుడు సేసెఁ జేదినం దను తనువున్ బృహద్రుధిరధారలు బోరన మీఁది కొల్కఁగన్. |
68 |
| ఉ. |
ప్రల్లదమేది యిట్లు శిశుపాలుఁడు వజ్రహతాద్రి తుల్యుఁడై త్రెళ్ళెడు వానిదైన పృథుదేహము వెల్వడి తేజ మంబరం బెల్ల వెలుంగ వచ్చి పరమేశ్వరు దేహము సొచ్చె విస్మయో త్ఫుల్ల విశాలనేత్రు లయి భూపతులెల్లను జూచుచుండఁగన్. |
69 |
| క. |
ఘనజాలము లేకయుఁ బెలు | చన పిడుగులతోడి వృష్టి చైద్యుని పాతం బునఁ గురిసె; సముద్ర మహా | ద్రి నికాయముతో ధరిత్రి దిర్దిరఁ దిరిగెన్. |
70 |
| క. |
జయ జయ నినాదమున న | వ్యయు నంబుజనాభు భువనవంద్యు నుపేంద్రుం బ్రియమునఁ బొగడెడు జనముల | దయిన మహాధ్వనియుఁ జెలఁగె నతితుములంబై. |
71 |
| వ. | అంత ననంతశయనుండు శిశుపాలు సంస్కరింపం బంచి వాని కొడుకుం జేదిరాజ్యంబున కభిషిక్తుం జేసె; నట్లు ప్రశాంతవిఘ్నంబయి, సుఖారంభంబయి, ప్రభూతభక్ష్యాన్నధనదానసనాథంబయి, జగన్నాథ రక్షితంబయి రాజసూయమహాధ్వరంబు సమాప్తప్రయోగం బయిన. | 72 |
| ఉ. |
దేవగురుద్విజప్రకరతృప్తికరున్ వరరాజసూయ య జ్ఞావభృథాభిషేకవిమలాంగు విశుద్ధయశోనిధిన్ జగ త్పావను ధర్మనందను సభాస్థితుఁ జూచి ముదంబు చెంది రిం ద్రావరజాది మిత్రు, లసహత్వముఁ బొందిరి ధార్తరాష్ట్రులున్. |
73 |
| వ. | ఇట్లు మహావిభూతితో నున్న ధర్మరాజు నొద్దకు వచ్చి నానాదేశాగతులయిన రాజు లి ట్లనిరి. | 74 |
| మాలిని |
జగదభినుతసామ్రాజ్యంబుతో నొప్పు నీ య త్యగణిత గుణయుక్తం బైన ధర్మప్రవృత్తిన్ మిగిలి వెలిఁగె నాజామీఢవంశంబు విద్వ ద్గగనతపన! సర్వక్షత్త్రవంశంబులందున్. |
75 |
| వ. | ‘ఏము భవదీయ రాజసూయ మహోత్సవ దర్శనంబునను భవత్కృత సత్కార గౌరవంబుననుం జేసి కృతార్థుల మయితిమి. మా మా దేశంబులకుం బోయెద’ మని చెప్పి వీడ్కొని చని; రప్పుడు ధర్మరాజువచనంబున భీష్మధృతరాష్ట్రుల భీమసేనుండును, యజ్ఞసేను నర్జునుండును, సపుత్త్రకులయిన (కర్ణ) శల్య సుబలుల నకులుండును, గృపద్రోణాశ్వత్థామల సహదేవుండును, విరాట భగదత్తుల ధృష్టద్యుమ్నుండునుం, బార్వతేయులైన రాజుల సౌభద్రద్రౌపదేయులును ననిచి రంత. | 76 |
| క. |
సతత ధన దానములఁ బూ | జితులయి తృప్తులయి గుణవిశిష్టమహీదే వతవరులు ధర్మసుతు మా | నితగుణు దీవించి చనిరి నిజ గృహములకున్. |
77 |
| వ. | నారాయణుండును బాండునందనుల నందఱం గ్రమంబున వీడ్కొని ద్వారవతికిం బోవుచుండి ధర్మరాజున కి ట్లనియె. | 78 |
| తే. |
సకలభూతసంఘంబు పర్జన్యుఁ, బక్షి | సమితి బహుఫలవృక్షంబు, నమరు లింద్రు ననిశమును నుపజీవించునట్లు బంధు | జనులు ని న్నుపజీవింప మనుము పేర్మి. |
79 |
| వ. | ‘మఱియు నప్రమత్తుండవయి నిఖిలప్రజారక్షణంబు సేయు’మనినఁ గృష్ణునకు ధర్మరా జి ట్లనియె. | 80 |
| ఉ. |
నీకరుణం గరంబు రమణీయతరంబయి సర్వవిఘ్నదూ రీకృతమై సమాప్తి నొనరెన్ ధరణీధర! యిమ్మఖంబు; భూ లోకములోన నేను నృపలోక నమస్కృతిఁ గీర్తిఁ బర్వితిన్; నా కులమున్ వెలింగె సుగుణంబుల కాస్పదమై పవిత్రమై. |
81 |
| క. |
ద్వారవతి నుండియును నిట | యారసియుండునది దానవాంతక! లోకా ధార! సమీపస్థుండవ | దూరంబున నుండియుం జతుర్భుజ! మాకున్. |
82 |
| వ. | ‘నిన్నుం బాసి నిమిషంబయిన నిర్వహింప నేర’మని ధర్మరా జెట్టకేనియు గరుడగమనుగమనంబున కొడంబడియె; నంత. | 83 |
| చ. |
అనిలజవాశ్వయుక్తమయి హాటకరత్న విచిత్ర తార్‌క్ష్య కే తనమయి మేఘనాదమయి దారుక సారథియైన దివ్య కాం చన రథ మెక్కి యాక్షణమ సాత్వతకుంజరుఁ డేఁగె భక్తి నా తని ననిచెన్ యుధిష్ఠిరుఁడు దమ్ములు దానును బాదచారియై. |
84 |
| క. |
తగిలి విలోచన గోచర | మగు నంతకు దృష్టి నిలిపి యట హృదయం బి మ్ముగఁ జొనిపి యెట్టకేనియు | మగిడిరి హరి ననిచి దీనమతిఁ బాండుసుతుల్. |
85 |